పెరిగిన రిషి గంగ నీటి మ‌ట్టం.. ఉత్తరాఖండ్ లో నిలిచిపోయిన స‌హాయ‌క చ‌ర్య‌లు

పెరిగిన రిషి గంగ నీటి మ‌ట్టం.. ఉత్తరాఖండ్ లో నిలిచిపోయిన స‌హాయ‌క చ‌ర్య‌లు

ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని త‌పోవ‌న్ విద్యుత్తు కేంద్రం సొరంగంలో కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు నిలిచిపోయాయి. చ‌మోలీ జిల్లాలో రిషి గంగ న‌ది నీటి మ‌ట్టం పెర‌గ‌డంతో.. సొరంగంలో చిక్కుకున్న వారి కోసం గ‌త నాలుగు రోజులుగా కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల్ని తాత్కాలికంగా నిలిపివేసిన‌ట్లు జిల్లా మెజిస్ట్రేట్ స్వాతి బ‌దౌరియా తెలిపారు. సొరంగం లోప‌ల ప‌నిలో ఉన్న భ‌ద్ర‌తా సిబ్బందితో పాటు అక్క‌డ డ్రిల్లింగ్ చేసేందుకు ఉంచిన భారీ యంత్రాల‌ను అధికారులు సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు.

ఈ సొరంగంలో చిక్కుకున్న 25 నుంచి 35 మంది కోసం అన్వేష‌ణ కొన‌సాగిస్తున్నారు. లోప‌ల ఉన్న‌వారిని రక్షించేందుకు పూడుకుపోయిన మ‌ట్టికే రంధ్రాలు చేసి ఆక్సిజ‌న్‌ను పంపించాల‌ని చూస్తుండ‌గా.. మ‌రోసారి న‌దిలో నీటిమ‌ట్టం పెర‌గ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లిగింది.

మ‌రోవైపు 1500 మీట‌ర్ల పొడ‌వు గ‌ల సొరంగంలో  ఇప్పటి వరకు 120 మీటర్ల వరకు శిథిలాలను తొలగించినట్లు తెలుస్తోంది. అయినా ఇంకా బుర‌ద, నీరు కొట్టుకుని వ‌స్తుండ‌డంతో స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం ఇబ్బందిక‌రంగా మారింది.