గ్రేటర్ శివారు మున్సిపాలిటీల్లో నిలిచిన రోడ్డు వైడెనింగ్ పనులు

గ్రేటర్ శివారు మున్సిపాలిటీల్లో నిలిచిన రోడ్డు వైడెనింగ్ పనులు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రోడ్ వైడెనింగ్​ను అధికారులు పట్టించుకోవడం లేదు. అక్కడ జనాభాతోపాటు వెహికల్స్ ​కూడా పెరుగుతున్నప్పటికీ.. రోడ్ల వైడెనింగ్, రిపేర్లపై ఫోకస్  పెట్టడం లేదు. మున్సిపల్​ కార్పొరేషన్లలో రూ.1,250 కోట్లతో లింక్ రోడ్లను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన్నపటికీ పనులు మాత్రం జరగడం లేదు. శివారు ప్రాంతాల్లో గత ఐదారేళ్లతో 30 శాతానికిపైగా జనాభా పెరిగింది. గతంలో సిటీలో ఉంటున్న చాలామంది శివారు ఏరియాల్లో సొంతిళ్లు కొని అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్, వ్యాపారులు, ప్రభుత్వ ఎంప్లాయీస్ అక్కడే ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇలా జనాభాతో పాటు వెహికల్స్ ​సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. చిన్న రోడ్లు కావడంతో శివారుల్లోనూ ట్రాఫిక్ ​జామ్ ఏర్పడుతోంది. అవసరమైన చోట రోడ్ల వైడెనింగ్ పనులు జరగడం లేదు. రెండళ్ల కిందట శాంక్షన్ అయిన పనులు కూడా మొదలు పెట్టలేదు.

నామ్​ కే వాస్తేగా రిపేర్లు..

శివారులోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో  రోడ్ల పరిస్థితి అలాగే ఉంది. ఎప్పుడో వేసిన రోడ్లను వైడెనింగ్ చేయడం లేదు. నామమాత్రంగా రిపేర్లు చేపట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.  జవహర్ నగర్ కార్పొరేషన్​లో బాలాజీనగర్ కమాన్ నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు 9 నెలల క్రితం రోడ్డు పనులు చేపట్టారు. కానీ కేవలం డివైడర్లు వేసి రోడ్డు వేయలేదు. ఇక్కడ రోడ్లు గుంతలమయం కావడంతో వెహికల్స్ బోల్తా పడిన సందర్భాలున్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని దమ్మాయిగూడ చౌరస్తా నుంచి  నాగారం వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం రూ.34 కోట్లు శాంక్షన్ అయినా కూడా రోడ్డు వేయడం లేదు. ఈ పనులు చేయకుండా రిపేర్లు మాత్రమే చేపట్టారు. బండ్లగూడ జాగీర్ నుంచి కిస్మత్ పురా వెళ్లే రోడ్ 100 ఫీట్ల మేర వైడెనింగ్ కోసం అనుమతులు వచ్చినా నేటికి స్టార్ట్ చేయడం లేదు. ఈ రూట్​లో రోజూ ట్రాఫిక్ జామ్​ ఏర్పడుతోంది. ఇలా చాలా ప్రాంతాల్లో   శాంక్షన్​అయిన పనులు కూడా చేపట్టడం లేదు.

ఫైన్లు మాత్రం తప్పట్లే..

శివారు మున్సిపాలిటీలు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బైక్​పై ఇద్దరు వెళ్తే వెనుక కూర్చున్న పిలియన్ రైడర్​కు సైతం హెల్మెట్ తప్పనిసరి. లేకపోతే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధిస్తున్నారు. చిన్నరోడ్ల నుంచి మెయిన్ రోడ్లపైకి ఎంట్రీ అయ్యే సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్లు కూడా సరిగ్గా కనిపించడం లేదు. కానీ సిగ్నల్ జంప్ అని చలాన్లు జనరేట్ అవుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు. చిన్న రోడ్లపైనా ఫైన్లు పడుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం ఫైన్లపై పెట్టిన దృష్టిని రోడ్ల వైడెనింగ్, రిపేర్లపై పెడితే బాగుంటుందని చెబుతున్నారు. 

1, 250 కోట్లతో 10 మున్సిపాలిటీల్లో రోడ్లు

గ్రేటర్ శివారులోని  బండ్లగూడ జాగీర్, బడంగ్ పేట, మణికొండ, జవహర్ నగర్ కార్పొరేషన్లు, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్, కొత్తూరు, దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల్లో రూ.1,250 కోట్లతో 103.45 కిలోమీటర్ల మేర లింక్ రోడ్లను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఆ పనులు మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదు. ట్రాఫిక్ జామ్​లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఈ పనులను  ప్రారంభించడం లేదు. అవసరమైన చోట రోడ్ల నిర్మాణం చేపడితే ట్రాఫిక్ ఇబ్బందులు తీరతాయని  వాహనదారులు చెబుతున్నారు.