రోడ్లు కుంగుతున్నయ్​..నాసిరకం పనులే కారణమా..

రోడ్లు కుంగుతున్నయ్​..నాసిరకం పనులే కారణమా..
  •     నాసిరకం పనులతో గుంతలు పడుతున్న రహదారులు
  •     లోపిస్తున్న అధికారుల పర్యవేక్షణ
  •     ఇక్కట్లు పడుతున్న ప్రయాణికులు

గాంధారి మండలం రాంపూర్​గడ్డ నుంచి లింగంపేట మండలం బాణాపూర్​ వరకు నాలుగేండ్ల కింద డబుల్​ రోడ్డు పనులు చేపట్టారు. కొంత మేర పనిచేసి మధ్యలో ఆపేశారు. మళ్లీ ఇటీవల పనులు ప్రారంభించారు. రూ.10 కోట్ల మేర అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రోడ్డు పనులు అస్తవ్యస్తంగా  మారాయి. కొన్ని నెలల కిందట కంప్లీటయిన రోడ్డుపై పలు చోట్ల బీటీ తొలగిపోయింది. సంగెం - బాణాపూర్​ తండా మధ్య పలు చోట్ల బీటీ లేచి, గుంతలు పడ్డాయి. గుంతలు కనిపించకుండా కంకరపొడి పోశారు. రాంపూర్​ సమీపంలో  కొద్దిరోజుల్లోనే కల్వర్ట్​ వద్ద రోడ్డు కుంగింది. 

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో కోట్ల ఖర్చుతో ఆర్అండ్​బీ, పంచాయతీ రాజ్ శాఖ వాళ్లు వేస్తున్న రోడ్లు కొన్నాళ్లకే ధ్వంసమవుతున్నాయి. పనుల్లో నాణ్యతలోపం స్పష్టంగా కనిపిస్తోంది. రూ.140 కోట్ల ఫండ్స్​తో జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో రోడ్లు వేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నాసిరకమైన పనులతో కంప్లీట్​అయిన కొద్ది నెలల్లోనే రోడ్లపై బీటీ తొలగిపోతోంది. గుంతలు పడి, రోడ్లు కుంగిపోతున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో చేపట్టిన పలు రోడ్లు అధ్వాన్నంగా మారాయి.

గాంధారి, లింగంపేట, రామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, రాజంపేట, నాగిరెడ్డిపేటతో పాటు పలు మండలాల్లో రోడ్లపై గుంతలు పడి వెహికల్స్​రాకపోకలకు ప్రాబ్లమ్​అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా టౌన్లలోనూ రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. కామారెడ్డి టౌన్​లో పలు కాలనీల్లో ఏడాది కిందట వేసిన సీసీ రోడ్లు పగుళ్లు వచ్చాయి.