వరద తగ్గింది.. నష్టం మిగిలింది

వరద తగ్గింది.. నష్టం మిగిలింది
  •    తెగిన రోడ్లు.. స్టార్ట్ కాని రాకపోకలు
  •     పొలాల్లో ఇసుకమేటలు
  •     కాలనీలు, గ్రామాల్లో కూలిన ఇండ్లు

కరీంనగర్‌‌, వెలుగు‌‌ : ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కాగా వర్షాలకు చాలాచోట్ల చెరువులు, వాగులకు గండ్లు పడ్డాయి. రోడ్లు, బ్రిడ్జిలు తెగిపోయాయి. పంటలు నీటమునిగాయి. పొలాలు ఇసుక మేటలు ఏర్పడ్డాయి. రోడ్లు కొట్టుకుపోయిన రూట్లలో ఇంకా రాకపోకలు స్టార్ట్​ కాలేదు.  ఉమ్మడి జిల్లాలో సుమారు 23,519 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 

తెగిన బ్రిడ్జిలు.. గుంతలమయమైన రోడ్లు

కరీంనగర్ జిల్లాలో వాన శుక్రవారం గెరువిచ్చింది. కాగా వరదల కారణంగా జిల్లాలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. సిటీలో వరద ప్రవాహానికి బైపాస్ రోడ్డు, కోతిరాంపూర్ రోడ్డు, పెరుమాండ్ల టెంపుల్ రోడ్లు గుంతలమయంగా మారాయి. హుజురాబాద్ – జూపాక బ్రిడ్జి వర్షాలతో మరోసారి కొట్టుకుపోయింది. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో బ్రిడ్జి కోతకు గురికావడంతో గంగాధర నుంచి జగిత్యాల జిల్లా పెగడపల్లి, గొల్లపల్లి మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాలకు తీవ్ర నష్టం జరిగింది. మూలవాగు, మానేరు వాగుల ఉధృతికి రోడ్లు తెగిపోయాయి. కోనరావుపేట మండలం బావుసాయిపేట వద్ద కాజ్ వే కొట్టుకుపోయింది. నిమ్మపల్లిలో పెంటి వాగుపై ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. నిజామాబాద్ గ్రామంలో పంటలు నీటమునిగాయి. గంభీరావుపేట మండలం గోరింటాల వాగు ఉధృతికి మల్లుపల్లి రోడ్ తెగిపోయింది. చందుర్తి మండలం ఎంగల్‌‌లో, ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో రోడ్డు దెబ్బతిన్నాయి. సిరిసిల్ల పట్టణంలో చిన్నబోనాల చెరువు తెగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

కొత్త చెరువు ఉధృతితో శాంతినగర్, శ్రీనగర్ కాలనీల్లో ప్రస్తుతం బురదమయంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలలో 37 ఇండ్లు కూలిపోయాయి. జిల్లాలో 1960 ఎకరాల్లో  పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 

జగిత్యాలలో దెబ్బతిన్న రోడ్లు 

జగిత్యాల : జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలకు తీవ్రంగా ఆస్తి, పంట నష్టం జరిగింది. ఇతర జిల్లాలకు వెళ్లే రోడ్లు, గ్రామాల లింక్​రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకపోవడంతో రాకపోకలు ప్రారంభం కాలేదు. పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో వరి పంట తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా పొలాల హద్దులు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 11,559 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. 1069  చెరువులకు 864 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. జగిత్యాల రూరల్ మండలం అనంతారం రొడ్డం వద్ద జగిత్యాల–ధర్మపురి రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలు స్టార్ట్​ కాలేదు. 

వేములవాడ–జగిత్యాల రూట్​ బంద్​

వేములవాడ : వేములవాడ–జగిత్యాల ప్రధాన రోడ్డులో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు ఇంకా ప్రారంభంకాలేదు.