ఖరాబ్.. ఖరాబ్.. సిటీ రోడ్లన్నీ గుంతలమయం

ఖరాబ్.. ఖరాబ్..  సిటీ రోడ్లన్నీ గుంతలమయం
  •  ఇసుక మేటలు, తేలిన కంకర
  • మ్యాన్‌హోల్స్‌,డ్రైనేజీలు ధ్వంసం 
  • వానలు తగ్గినా మరమ్మతుల్లేవ్ 
  • నామ్​ కే వాస్తేగా పూడ్చివేత
  • ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు

‘‘ప్రతిరోజు నల్లకుంటలోని ఆఫీసు నుంచి ఇంటికి పోతుంటే రోడ్డుపై మ్యాన్ హోల్ ఎక్కడుందో తెలియని పరిస్థితి.  ఇసుక, కంకర చేరడంతో బైక్ స్కిడ్ అవుతుందని భయమేస్తుంది.  రాత్రి టైమ్‌లో  ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నా.  వానలు తగ్గినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.  ఇలాంటి రోడ్లపై జర్నీ కష్టమే’’. అని సంతోష్‌నగర్​కు చెందిన 
రాజ్‌కుమార్‌ తెలిపాడు.

హైదరాబాద్‌,వెలుగు: సిటీలో వరుసగా కురిసిన వానలు తగ్గుముఖం పట్టాయి. వర్షాల కారణంగా వచ్చిన సెలవులతో సిటిజన్లు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. సోమవారం నుంచి ఉద్యోగులు, స్టూడెంట్లు రోడ్డెక్కనున్నారు. దీంతో గ్రేటర్‌‌లో ట్రాఫిక్‌ తిప్పలు తప్పేలా లేవు. ఇందుకు కారణం లేకపోలేదు. 

వర్షాలు, వరదలతో ధ్వంసమైన రోడ్లను మరమ్మతులు చేయకపోవడమే. వర్షాలు తగ్గడంతో శుక్రవారం నుంచే వెహికల్స్ రద్దీ ఉంది. ధ్వంసమైన రోడ్లపై కంకర తేలి, ఇసుక మేటలు వేయగా.. మెయిన్ రోడ్లలో ట్రాఫిక్ జామ్‌ అయింది. ఇలాంటి పరిస్థితిలో బల్దియా రోడ్లకు రిపేర్లు చేయకపోతే సోమవారం నుంచి ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరం అయ్యే చాన్స్​ ఉంది. డ్యామేజ్ అయిన రోడ్లకు ట్రాఫిక్ పోలీసులు తాత్కాలిక మరమ్మతు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. 

నడిరోడ్డుపై డేంజర్‌ బెల్స్‌‌

భారీ వర్షాలతో గ్రేటర్ పరిధిలోని రోడ్లన్నీ కరాబ్​ అయ్యాయి. ఇసుక మేటలు వేసి, కంకర తేలి ప్రమాదకరంగా మారాయి. రోడ్లపై గుంతలు, మ్యాన్‌హోల్స్‌ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నాలాలు, డ్రైనేజీలు పొంగి రోడ్లపై మోకాలి లోతు గుంతలు ఏర్పడ్డాయి. బురద, దుమ్ము, ధూళితో సిటీలో జర్నీ చేయాలంటేనే నరకంగా ఉంది. వారం రోజుల వర్షాలకు ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ జామ్ అయిన సంగతి తెలిసిందే. 

జర్నీ అంటేనే..

సిటీ రోడ్లపై జర్నీ అంటేనే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.  స్టీల్‌ బ్రిడ్జిలు,ఫ్లై ఓవర్ల నిర్మాణ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు, బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. నడవలేని పరిస్థితులు కూడా లేవు. బైక్​లు, కార్లలో వెళ్లేవారు నరకం చూస్తున్నారు. మలక్‌పేట నుంచి సంతోష్​​నగర్, చంపాపేట్‌ వెళ్లే రూట్‌లో కదిలే పరిస్థితి లేదు. దిల్‌సుఖ్‌నగర్‌‌, చాదర్‌‌ఘాట్‌, మెహిదీపట్నం, లక్డీకపూల్‌, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్‌ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి.

ఆర్‌‌యూబీల వద్ద..  

రైల్వే బ్రిడ్జిల రూట్లలో ట్రాఫిక్ కష్టాలు తప్పేట్లు లేవు. చాదర్‌‌ఘాట్‌, సికింద్రాబాద్‌, బేగంపేట్‌,ఆర్‌‌సీపురం, లింగంపల్లి సహా ప్రధాన రోడ్లలోని రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్‌‌యూబీ)ల వద్ద రోడ్లు పూర్తిగా ఖరాబ్​ అయ్యాయి.  ఆయా రూట్లలో నిరంతరం ట్రాఫిక్ జామ్ అవుతోంది.  ఇలాంటి ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలంటే రైల్వే డిపార్ట్​మెంట్‌ పర్మిషన్ కావాలి. అయితే జీహెచ్‌ఎంసీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిసింది.  అధికారులకు లెటర్స్ రాలేదని సమాచారం. ఇందుకు కనీసం వారం రోజులు పట్టేలా ఉంది. దీంతో ఆర్‌‌యూబీ నుంచి వెళ్లే వారు  ట్రాఫిక్ కష్టాల్లో చిక్కుకునే పరిస్థితి నెలకొంది. 

రోడ్ల వివరాలు సేకరించాం

వానలతో డ్యామేజ్ అయిన రోడ్లను ఇప్పటికే గుర్తించాం. సిటీ ట్రాఫిక్‌ ఇంజనీరింగ్‌ వింగ్‌, బల్దియా అధికారులతో కో ఆర్డినేట్ చేస్తున్నాం. వానలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ధ్వంసమైన రోడ్ల వివరాలు సేకరించాం. బల్దియా అధికారులకు సమాచారం అందించాం. స్కూల్‌ మేనేజ్ మెంట్లతో మీటింగ్స్ కండక్ట్  చేస్తున్నాం. 
– సుధీర్‌‌ బాబు, సిటీ ట్రాఫిక్ చీఫ్‌