వేసిన రోడ్లే మళ్లీ మళ్లీ!

వేసిన రోడ్లే మళ్లీ మళ్లీ!

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు: మేడారం మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులలో అధిక శాతం పక్కదారి పడుతున్నాయి. కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు మిలాఖత్‌‌‌‌ అయ్యి వేసిన రోడ్లనే మళ్లీ మళ్లీ వేస్తున్నారు. పైసలు మిగిలే రోడ్లపైనే ప్రేమ కురిపిస్తున్నారు. భక్తులకు ఉపయోగపడే చాలా రోడ్లను పట్టించుకుంటలేరు. చేసిన పనులనే ఎన్నిసార్లు చేస్తారంటూ స్వయంగా ఎమ్మెల్యే నిలదీసినా ఆఫీసర్లలో మార్పు రావట్లేదు. మేడారం వర్కులంటే చాలు పైపైన పనులు చేసి నిధులు కాజేయవచ్చనే అపవాదును తొలగించాలని భక్తులు ఎన్నిసార్లు కోరినా పట్టించుకునేవారే లేరు. 2022 మహా జాతర కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించగా కాంట్రాక్టర్లు షార్ట్‌‌‌‌ టెండర్ల ద్వారా పనులు దక్కించుకొని మళ్లీ పైపైనే పనులు చేసి బిల్లులు కాజేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మూడు జాతరలకు రూ.257 కోట్ల ఖర్చు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత మూడు మహాజాతరలలో స్టేట్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ రూ.257 కోట్లు ఖర్చు చేసింది. 2016 నుంచి ప్రతి మహాజాతరకు విడుదలైన నిధులలో రూ.100 కోట్లకు పైగా రోడ్ల నిర్మాణం కోసమే ఖర్చు చేశారు. వీటిలో తాడ్వాయి‒నార్లాపూర్‌‌‌‌, పస్రా‒నార్లాపూర్‌‌‌‌, నార్లాపూర్‌‌‌‌‒భూపాలపల్లి రోడ్లు ప్రధానమైనవి. 2016, 2018 మహా జాతర సందర్భంగా ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ, పంచాయతీరాజ్‌‌‌‌ శాఖ డిపార్ట్‌‌‌‌మెంట్లు ఈ రోడ్లను వెడెల్పు చేసి డబుల్‌‌‌‌ రోడ్లు చేశారు. కనీసం పదేళ్ల పాటు అయినా రోడ్లు ఖరాబు కాకుండా ఉండాలి. అలాంటిది రెండేళ్లకోసారి జరిగే మహా జాతర టైంలో బీటీ ప్యాచ్‌‌‌‌ వర్క్‌‌‌‌, రిపేర్లు, కాజ్‌‌‌‌వేలు నిర్మాణం అంటూ రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. వేసిన రోడ్లనే మళ్లీ, మళ్లీ వేసి కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. ఈ సారి కూడా ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ పస్రా‒నార్లాపూర్‌‌‌‌ రోడ్డుపై రూ.10 కోట్లు, తాడ్వాయి‒నార్లాపూర్‌‌‌‌ రోడ్డుపై రూ.1.20 కోట్లతో పనులు చేస్తున్నారు.

షార్ట్‌‌‌‌ టెండర్లతో..

మేడారం మహాజాతరకు కేవలం 3 నెలల ముందు నిధులు మంజూరు చేయడం స్టేట్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ పాలసీగా పెట్టుకుంది. దీనివల్ల రూల్స్​ప్రకారం టెండర్లు పిలిచి వర్కులు అప్పగించడం జిల్లా కలెక్టర్‌‌‌‌కు ఇబ్బందిగా మారుతోంది. దీంతో ఆయా డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు షార్ట్‌‌‌‌ టెండర్లు పిలిచి తమకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. ఆఫీసర్లు కాంట్రాక్టర్లతో మిలాఖత్ అవడం వల్ల పైసలు పెద్దమొత్తంలో చేతులు మారుతున్నాయి. నాణ్యత లేకుండా పనులు చేయడం వల్ల రెండు, మూడేళ్లకే వేసిన రోడ్లు దెబ్బతినడం మళ్లీ జాతర నాటికి భక్తుల సౌకర్యం కోసం పనులు చేపడతామంటూ ఆఫీసర్లు స్టేట్‌‌‌‌ మెంట్‌‌‌‌ ఇవ్వడం పరిపాటిగా మారింది. 

ఇది పాడైపోయిన ఊరట్టం కాజ్‌‌‌‌వే వంతెన. మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌గఢ్‌‌ ‌‌రాష్ట్రాల నుంచి మేడారానికి భక్తులు చేరుకోవడానికి 12 ఏళ్ల క్రితం జంపన్నవాగులో ఊరట్టం దగ్గర కిలోమీటర్‌‌‌‌ దూరం కాజ్‌‌‌‌వే వంతెన నిర్మించారు. జాతర సమయంలో వెహికల్స్​అన్నీ ఈ రోడ్డు వెంటే మేడారం చేరుకుంటాయి. 8 ఏళ్ల క్రితం 30  మీటర్ల దూరం కాజ్‌‌‌‌వే దెబ్బతింది. వరద తాకిడికి నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు ఆగిపోయాయి. భక్తులు ఈ కాజ్‌‌‌‌వే మీదుగా కేవలం కి.మీ. ప్రయాణిస్తే మేడారం చేరుకుంటారు. అలాంటిది 10 కి.మీ. దూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. 

ఇది పస్రా నుంచి నార్లాపూర్‌‌‌‌కు వెళ్లే రోడ్డు. మేడారం వెళ్లే ప్రైవేట్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ అన్నీ ఈ రోడ్డు వెంబడే ప్రయాణిస్తాయి. ఈ రోడ్డు వేసి ఇంకా 5 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఖరాబయ్యిందని ఈసారి రూ.10 కోట్లతో మళ్లీ కొత్తగా వేస్తున్నారు. ఆర్ అండ్‌‌‌‌ బీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఈ జాతర కోసం రూ.12 కోట్లు ఖర్చు చేస్తుంటే అందులో రూ.10 కోట్లు ఈ ఒక్క రోడ్డుపైనే వెచ్చిస్తోంది. వరంగల్‌‌‌‌ ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌ కంపెనీ పనులు చేపడుతోంది. 2020 మహా జాతర సమయంలో పాడైపోయిన చోట బీటీ ప్యాచ్‌‌‌‌ వర్క్‌‌‌‌ పేరిట రూ.50 లaక్షలు ఖర్చుచేశారు.  రెండేళ్లు కూడా గడవకముందే మళ్లీ కొత్తరోడ్డు వేస్తున్నారు.