చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. దాంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకుంది. అతనికేమో చదువంటే పెద్దగా ఇష్టంలేదు. మరోవైపు సన్నగా ఉండడం వల్ల అందరూ అతన్ని చూసి హేళన చేసేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో తన ఫిట్‌నెస్ జర్నీని మొదలుపెట్టాడు. ఇప్పుడు రోహిత్ ఖత్రి ఇండియాలోని టాప్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్లలో ఒకరు. వర్కవుట్ టిప్స్, న్యూట్రిషన్ గైడ్స్‌తో లక్షలాది మంది యువతను ఆకట్టుకుంటున్నాడు.
రోహిత్ ఖత్రి 1996 జులై 5న ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. పన్నెండేండ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. దాంతో కుటుంబ బాధ్యతలు పెరిగాయి. రోహిత్‌కు చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పైగా సన్నగా(తక్కువ బరువు) ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చిన్నప్పటినుంచే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆ కష్టాలే అతన్ని ఫిట్‌నెస్ వైపు నడిపించాయి. స్కూల్ డేస్‌లోనే జిమ్‌కు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. కానీ.. మొదట్లో చాలా పొరపాట్లు చేశాడు. ఆ తర్వాత సైన్స్ బేస్డ్ ట్రైనింగ్, న్యూట్రిషన్ ఫుడ్‌పై లోతుగా రీసెర్చ్ చేశాడు. చివరకు తన బాడీని పూర్తిగా మార్చుకోగలిగాడు. ఆ తర్వాత స్పోర్ట్స్ సైన్స్ న్యూట్రిషన్‌లో సర్టిఫికేషన్ కోర్సు చేశాడు. అది అతని ట్రైనింగ్ మెథడ్స్‌కు బలమైన ఫౌండేషన్ అయింది.
ఇన్ఫ్లుయెన్సర్గా..
రోహిత్ సోషల్ మీడియా జర్నీ 2016లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మొదలైంది. మొదట్లో వర్కవుట్ ఫొటోలు, టిప్స్ పోస్ట్ చేశాడు. అందులో ఫాలోవర్ల సంఖ్య పెరిగాక, యూట్యూబ్‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. 2017లో ‘రోహిత్ ఖత్రి ఫిట్‌నెస్’ పేరుతో చానెల్ స్టార్ట్ చేశాడు. అందులో బాడీబిల్డింగ్, వీక్లీ జిమ్ ప్లాన్స్, సిక్స్ ప్యాక్ ఎక్సర్‌సైజ్‌లు, న్యూట్రిషన్ సలహాలు, ప్రొడక్ట్ రివ్యూలు అప్‌లోడ్ చేశాడు. అతని కంటెంట్ ప్రత్యేకత ఏంటంటే.. బిగినర్స్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవల్ వరకు అందరికీ సరిపడేలా ఉంటుంది. మన దేశంలో ఎక్కువగా తినే రోటీ, దాల్, వెజ్ మీల్స్ లాంటివాటితో సింపుల్ డైట్ ప్లాన్స్ ఇస్తుంటాడు. ముఖ్యంగా ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్, హోమ్ వర్కవుట్స్, స్టెరాయిడ్–ఫ్రీ బాడీబిల్డింగ్‌పై ఫోకస్ చేస్తుంటాడు. అతని వీడియోలు సైన్స్ బేస్డ్‌గా ఉండటం వల్ల ఫాలోవర్లలో చాలామంది రియల్ రిజల్ట్స్ చూస్తున్నారు.
రెండో చానెల్
రోహిత్ 2022 మార్చి 4న సోనియా సింగ్‌ని పెండ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, అథ్లెట్. రోహిత్ ఆమెతో కలిసి ‘‘సోనియా రోహిత్ వ్లాగ్స్” పేరుతో మరో చానెల్ నడుపుతున్నాడు. అందులో ఇద్దరూ కలిసి లైఫ్‌స్టైల్, ట్రావెల్, ఫ్యామిలీ వ్లాగ్స్ చేస్తున్నారు. అంతేకాదు.. అప్పుడప్పుడు జాయింట్ వర్కవుట్ వీడియోలు కూడా చేస్తుంటారు.
వ్యాపారాలు..
రోహిత్ కేవలం యూట్యూబర్ మాత్రమే కాదు. సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా. సొంతంగా ‘ఆర్కే ఫిట్‌నెస్’ అనే జిమ్ చైన్ నడుపుతున్నాడు. ఆ జిమ్‌లలో అధునాతన ఎక్విప్‌మెంట్, పర్సనలైజ్డ్ ట్రైనింగ్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆన్‌లైన్ పెయిడ్ కోచింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాడు. వీటిలో ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది చేరుతున్నారు.
లక్షల్లో ఆదాయం
రోహిత్ ఖత్రి ఫిట్‌నెస్ చానెల్‌ను ఇప్పటివరకు 5.19 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. అందులో ప్రస్తుతం 824 వీడియోలు ఉన్నాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అతని పేజీని 2.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. రోహిత్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, యూట్యూబ్, జిమ్ రెవెన్యూ, స్పాన్సర్‌షిప్స్ ద్వారా ప్రతినెలా లక్షల్లో సంపాదిస్తున్నాడు. అంతేకాదు.. ఫోర్బ్స్ ఇండియా–2022 డిజిటల్ స్టార్స్ లిస్ట్‌లో కూడా చోటు సంపాదించాడు.
ఎంతో ఇంపాక్ట్..
రోహిత్ ఫిట్‌నెస్ మీద అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతని కంటెంట్ ద్వారా చాలామంది యువకులు హెల్దీ లైఫ్‌స్టైల్‌కు మారారు. 2025లో రోహిత్ నేపాల్ ఫిట్‌నెస్ ఎక్స్‌పోలో పార్టిసిపేట్ చేశాడు. అక్కడ అతన్ని ‘‘ఇండియాస్ మోస్ట్–ఫాలోడ్ ఫిట్‌నెస్ స్టార్’’గా ప్రమోట్ చేశారు. 2024లో అమెచ్యూర్ ఒలింపియా, షెరు క్లాసిక్ లాంటి కాంపిటీషన్లలో పాల్గొన్నాడు. అతను చేసిన ‘150 డేస్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్” వీడియోలో తన బరువు తగ్గించుకుని, మస్క్యులర్ బాడీని పెంచుకున్న విధానాన్ని వివరించాడు. అది ఎంతోమందికి మోటివేషన్ ఇచ్చింది.
