ODI World Cup 2023: అయ్యర్‌ను నమ్మాను.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు: రోహిత్ శర్మ

ODI World Cup 2023: అయ్యర్‌ను నమ్మాను.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు: రోహిత్ శర్మ

టీమిండియా వరల్డ్ కప్ లో వరుస విజయాలు సాధిస్తున్నా మిడిల్ ఆర్డర్ బ్యాటర్  శ్రేయాస్ అయ్యర్ ఫామ్ జట్టుకు ఆందోళనకరంగా మారింది. కావాల్సినంత టాలెంట్ ఉన్నా నిలకడగా ఆడలేకపోతున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకున్నా అతడిని నమ్మి వరుసగాఅవకాశాలు ఇచ్చారు. అయితే అప్పుడప్పుడు అడపాదడపా మెరుస్తున్నా పూర్తిస్థాయిలో మాత్రం గాడిలో పడలేదు. వరల్డ్ కప్ కావడంతో అయ్యర్ నిలకడలేమి టీమిండియాకు పెద్ద సమస్యగా మారింది.

వరుస అవకాశలు ఇచ్చి అయ్యర్ ను అనవసరంగా హైలెట్ చేస్తున్నారంటూ బయట నుంచి ఎన్నో విమర్శలు వచ్చాయి. అయ్యర్ బదులు ఫామ్ లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ ను సెలక్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. కానీ నిన్న దక్షిణాఫ్రికాపై అయ్యర్ ఇన్నింగ్స్ చూసిన  తర్వాత అతనిలో ఎంతో పరిణితి కనిపించింది. ఈ మ్యాచ్ లో మొత్తం 87 బంతుల్లో 77 పరుగులు చేసిన అయ్యర్ భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఎంతో కష్టంగా ఉన్న ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై సహనం కోల్పోకుండా బ్యాటింగ్ చేసాడు.

మొదటి 34 బంతుల్లో 11 పరుగులే చేసిన అయ్యర్ ఆ తర్వాత 43 బంతుల్లో 66 పరుగులు చేసాడు. గత మ్యాచ్ లో శ్రీలంకపై 82 పరుగులు చేసి గాడిలో పడిన ఈ స్టార్ బ్యాటర్.. దక్షిణాఫ్రికాపై గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అయ్యర్ ను ప్రశంసించాడు. అయ్యర్ చాలా బాగా ఆడాడని అతనిపై నాకు ఎప్పుడు నమ్మకం ఉంటుందని చెప్పుకొచ్చాడు. జట్టు మొత్తం అతడిని నమ్మినందుకు అతడు తనను తాను మరోసారి నిరూపించుకున్నాడని ఈ సందర్భంగా రోహిత్ ఈ ముంబై బ్యాటర్ ను కొనియాడాడు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో నిర్ణీత 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. కోహ్లీ 101 పరుగులు చేసి తన 49 సెంచరీని పూర్తి చేసుకుంటే.. అయ్యర్ 77 పరుగులు చేసి రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో సఫారీల జట్టు 83 పరుగులకే కుప్పకూలింది. జడేజా 5 వికెట్లతో దక్షిణాఫ్రికా పతన్నని శాసించగా.. షమీ, కుల్దీప్ చెరో రెండో వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ కు ఒక వికెట్ లభించింది.