యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో సినిమా ‘మోగ్లీ 2025’. కలర్ ఫోటోతో నేషనల్ అవార్డు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ ‘మోగ్లీ’ తెరకెక్కించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇవాళ శనివారం (2025 డిసెంబర్ 13న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ప్యూర్ ఇన్నోసెన్స్ లవ్ స్టోరీగా వచ్చిన ‘మోగ్లీ’ అసలు కథేంటీ? విడుదలకు ముందే పాజిటివ్ వైబ్ దక్కించుకున్న ‘మోగ్లీ’ పై పబ్లిక్ టాక్ ఎలా ఉంది? రోషన్-సందీప్ రాజ్ హిట్ కొట్టారా? లేదా అనేది ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
పార్వతీపురం అనే ఒక కొండ ప్రాంతం. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో ఉంటాడు మోగ్లీ ఉరఫ్ మురళి (రోషన్ కనకాల). అతను ఒక అనాథ. అడవినే తల్లిగా భావించే మోగ్లీ ఎప్పటికైనా పోలీసు కావాలనే ఆశతో బతికేస్తుంటాడు. అలా తన జీవనం సాగించుట కొరకు బెస్ట్ ఫ్రెండ్ అయిన బంటి (వైవా హర్ష)తో కలిసి సినిమా షూటింగ్స్‌కి వెళుతుంటాడు. అక్కడ జూనియర్ ఆర్టిస్టులను చేరవేయడం అతని పని. ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్లో భాగంగా డూప్‌గా నటించాల్సి వస్తుంది మోగ్లీ. ఇక అదే సినిమా టీమ్‌లోని సైడ్ డ్యాన్సర్ జాస్మిత్ (సాక్షి మడోల్కర్)తో లవ్లో పడతాడు. అయితే, ఆమెకు చెవులు వినపడవు. మాటలు రావు. జాస్మిత్ కూడా మోగ్లీని ప్రేమిస్తుంది.
అలా సీతరాముల్లాంటి ఈ జంట మధ్యలోకి రావణుడిలా ఎంట్రీ ఇస్తాడు SI క్రిప్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్). నోలన్ రాకతో జాస్మిత్ లైఫ్లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. అదే సమయంలో నోలన్, హీరోయిన్ జాస్మిత్‌పై మోజు పడతాడు. ఎలాగైనా ఆమెను వాడుకోవాలని ఎన్నో పథకాలు వేస్తాడు. ఇలా జాస్మిత్-మోగ్లీ జంటని ఎన్నో చిత్రహింసలు పెడతాడు.
ఇలాంటి అమ్మాయిల పిచ్చి ఉన్న ఎస్సై నోలన్ బారీ నుంచి.. ప్రియురాలు జాస్మిత్‌ని మోగ్లీ ఎలా కాపాడుకున్నాడు? నోలన్ నుంచి మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరికి జాస్మిత్-మోగ్లీ ప్రేమ గెలిచిందా లేదా? అడవిని నమ్ముకుని బ్రతికే మోగ్లీకి.. ఆ దైవం ఎలాంటి ధైర్యం ఇచ్చింది? కర్మ సిద్ధాంతానికి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి? అనే తదితర విషయాలు తెలియాలంటే థియేటర్లో మూవీ చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
ఈ కథ సరిగ్గా నితిన్ నటించిన ఆల్టైం బ్లాక్ బస్టర్ ‘జయం’ సినిమాను గుర్తుచేసేలా ఉంది. అలాంటి ప్యూర్ ఇన్నోసెన్స్ లవ్ స్టోరీతో మోగ్లీ తెరకెక్కించాడు డైరెక్టర్. అంతేకాకుండా డైరెక్టర్ సందీప్ రాజ్ తీసిన ఫస్ట్ మూవీ ‘కలర్ ఫోటో’లో ఉన్న సోల్ కనిపిస్తుంది. అయితే, ఈ రెండు సినిమాలు విలేజ్-కాలేజీలో మొదలై చివరికి అడవి బాట పడతాయి. కానీ, ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో హృద్యమైన ప్రేమకథగా మొదలై.. అక్కడి హానెస్ట్ లవ్ స్టోరీతో కళ్ళకు కట్టేలా చేస్తుంది. ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ సందీప్ రాజ్ రేసీ స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారు. ఇందులో కామెడీ, యాక్షన్ సహా అన్ని రకాల ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి.
మోగ్లీ తన ప్రేమ కోసం దేనికైనా రెడీగా పోరాడే ప్రేమికుడిగా, తన ప్రేమ కథకు వచ్చిన అడ్డంకులను ఎలా అధిగమించాడనేది ఆర్గానిక్‌గా చూపించాడు డైరెక్టర్. అయితే, బండి సరోజ్ కుమార్ పోషించిన పాత్రకే ఎక్కువ మార్కులు పడతాయి. జయం సినిమాలో ఎలాగైతే గోపీచంద్ ఎక్కువ కనెక్ట్ అయ్యాడో.. ఇక్కడ కూడా బండి సరోజ్ ఇంపాక్ట్ చూపించాడు. విలన్ నుంచి హీరోయిన్‌ను కాపాడుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు, అందుకు సహకరించే ఫ్రెండ్ ఇవే అంశాలతో సినిమా సాగుతుంది.
ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. సందీప్ రాజ్ డైలాగ్స్ గట్టిగా పేలాయి. కానీ, కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఉన్న జోష్ సెకండాఫ్ స్టార్టింగ్లో మిస్ అయ్యింది. చివరికి క్లైమాక్స్తో ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా రాసుకున్నాడు దర్శకుడు. ఒక రకంగా చెప్పాలంటే, క్లైమాక్స్లో చూపించిన కర్మ సిద్ధాంతం సినిమాకు కలిసొచ్చే అంశం. ప్రేమ, యాక్షన్ అంశాల మేళవింపుతో కూడిన ఎమోషనల్ జర్నీనే మోగ్లీ కథ. మొత్తానికి మోగ్లీ సినిమాతో సుమ కొడుకు హిట్ కొట్టడం కన్ఫామ్ అనే అనే తెలుస్తోంది.
ఎవరెలా నటించారంటే:
హీరోగా రోషన్ కనకాల తన నటనతో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ సినిమా బబుల్గామ్ తోనే హీరోగా నిరూపించుకున్న రోషన్.. ఈ సినిమాతో మరో పదిమెట్లు పై స్థానంలో నిలిచారు. తనలోని ఇన్నోసెన్స్ ని చాలా బాగా చూపించాడు. హీరోయిన్ సాక్షి మదోల్కర్ మూగ, చెవిటి అమ్మాయి పాత్రలో చక్కగా నటించింది. హావభావాలతో తన ఉనికి చాటుకుంది. విలన్గా బండి సరోజ్ కుమార్ తన నటనతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువతాడు. కమెడియన్ వైవా హర్షా ఎప్పటిలాగే తన వర్సటాలిటీని నిరూపించుకున్నాడు. మిగతా నటులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

