
-
దర్జాగా ల్యాండ్ సెటిల్మెంట్లు
-
గుండాల వెంట సినిమా తరహా ఉస్తాద్‌లు
-
బాధితులను బెదిరించి దోపిడీ
-
పట్టించుకోని పోలీసులు
నిజామాబాద్, వెలుగు ; ఇందూరులో రౌడీ ముఠాల ఆగడాలు పెరుగిపోతున్నాయి. కొందరు దాదాగిరితో డబ్బు సంపాదించడాన్ని దందాగా చేసుకున్నారు. ల్యాండ్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో అదేస్థాయిలో లిటిగేషన్లు తయారయ్యాయి. వీటి సెటిల్మెంట్లలో దర్జాగా ఎంటరవుతున్న రౌడీలు లక్షలు ఎగరేసుకెళ్తున్నారు. కత్తులు, తల్వార్లు, కండలు తిరిగిన ఉస్తాద్‌లను మెయింటెన్చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. సెటిల్మెంట్లో ఆధిపత్యం కోసం రౌడీల మధ్య గ్యాంగ్‌వార్ హత్యలకు సైతం దారితీస్తోంది.
ఒక్క డీల్.. రూ.27 లక్షలు
నిజామాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న భూములు ఎకరాకు రూ.4 కోట్లు పలుకుతున్నాయి. ఓ యజమాని రెండెకరాలను అమ్మడానికి కొనుగోలుదారుతో ఒప్పందం చేసుకొని బయానా రాసుకున్నాడు. రూ.కోటి ముట్టజెప్పి నాలుగు కిస్తీల్లో మిగతా సొమ్ము ఇచ్చాక రిజిస్ర్టేషన్‌కు వెళ్లాలన్నది ఒప్పందం. అయితే, అగ్రిమెంట్తర్వాత మరొకరు భూమి తనదని ప్రవేశించడంతో కొన్నవారిలో టెన్షన్ మొదలైంది. సమస్య లేకుండా ఉంటేనే మిగితా డబ్బు ఇస్తానని కొనుగోలుదారు పట్టాదారుకు స్పష్టం చేశాడు. అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇవ్వలేదని పట్టాదారు రేటు పెంచి మరొకరికి భూమి అమ్మాడు. ఈ వ్యవహారం సెటిల్మెంట్కోసం రౌడీల వద్దకు చేరింది. ఇందులో డీల్ కుదిర్చిన సదరు రౌడీలు తమ వాటాగా రూ.27 లక్షలు తీసుకున్నారు. ఈ ఒక్క ఘటనే కాదు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో సెటిల్మెంట్ఏదైనా రౌడీల దగ్గరికే చేరుతోంది.
60 ఏళ్లు దాటినా ఆగని దందా..
నగరానికి చెందిన ఒక మాజీ కార్పొరేటర్‌పై 1990వ దశకంలో పోలీసు రికార్డులో ( ఎస్పీ ఆర్.పి.మీనా హయాంలో) రౌడీషీట్ తెరిచారు. ఇప్పుడు ఆయన వయసు 60 ఏళ్లు దాటింది. ఈయన దందా అంతా సెటిల్మెంట్లు చేయడమే. చుట్టూ ఎప్పుడు బాడీ బిల్డర్లను పెట్టుకొని వచ్చినవారిని భయపెడుతుంటాడు. నగరంలోని గాంధీ చౌక్ సమీపంలో ఉండే ఈయన నాలుగంతస్తుల ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పంచాయితీలకే కేటాయించాడు. ఈ మధ్య ఇద్దరు వ్యక్తులు తమ రూ.50 లక్షల పంచాయితీ తేల్చమని వస్తే వారి నుంచి 25 శాతం తీసుకొని డీల్సెటిల్చేశాడు. సమస్య పరిష్కరించమని వచ్చిన ఒకరి ఇంటికి తన గ్యాంగ్ సభ్యుడిని పంపి తాళం వేయించాడు. తర్వాత కత్తులతో చంపుతానని బెదిరించగా ఇల్లు కుదువ పెట్టి వారంలో డబ్బు చెల్లించాడు. ల్యాండ్ సెటిల్మెంట్లు, బాకీ వసూళ్లకు తన వద్దకు రావొచ్చని బహిరంగంగా ప్రచారం చేసుకునే ఇతడి గురించి పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
లిటిగేషన్ సృష్టించి...
ఈ మధ్య ఒక డాక్టర్ కొన్న ప్రాపర్టీకి నగరానికి చెందిన ఓ రౌడీ బోగస్ రిజిస్ర్టేషన్ పేపర్లు సృష్టించి సెటిల్మెంట్కు ఇన్వైట్ చేశాడు. కాదు కుదరదు అంటే నడవదని, నిర్మాణ పనులు స్టార్ట్ చేస్తామని హెచ్చరించడంతో సదరు డాక్టర్ బయటకు చెప్పకుండా రూ.25 లక్షలు ముట్టజెప్పాడు. భూతగాదాలు తెలుసుకునేందుకు, విలువైన ల్యాండ్కొంటున్న వారి సమాచారం కోసం రిజిస్ట్రేషన్ఆఫీస్లో ఇద్దరిని ఇన్ఫార్మర్లుగా పెట్టుకున్నట్లు
సమాచారం.
రిజిస్ట్రేషన్ సిబ్బందిని బెదిరించి..
హమాల్‌వాడీ ఏరియాలో జరిగిన ఒక ఇంటి స్థలం రిజిస్ర్టేషన్ విషయంలో తనకూ వాటా కావాలని రెంజల్ మండలానికి చెందిన ఓ రౌడీ షీటర్ ఏకంగా రిజిస్ర్టేషన్ సిబ్బందిని బెదిరించాడు. స్థిరాస్తి సొంతం చేసుకున్న వ్యక్తి నుంచి డబ్బు ఇప్పించాలని బెదిరించడంతో వారు తలొగ్గినట్లు సమాచారం.
ముగ్గురి పేర్లు ప్రముఖం..
జిల్లాలో లిటిగేషన్ భూములు కొనే విషయంలో ముగ్గురి పేర్లు విస్తృత ప్రచారం పొందాయి. ఏజెంట్లను నియమించుకొని జిల్లా వ్యాప్తంగా దందా నడుపుతున్నారు. నిత్యం లగ్జరీ కార్లలో తిరుగుతూ ల్యాండ్‌మాఫియా నడుపుతున్నారు. వారి దందాలో పోలీసులకు షేర్ఇస్తారనే ఆరోపణలు
వినిపిస్తున్నాయి.
గ్యాంగ్‌వార్..
రౌడీల మధ్య ఆధిపత్య పోరు ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. దందాలో పట్టు సాధించడానికి ఎంతవరకైనా వెళ్తున్నారు. ఈ మధ్య నందిపేటలో సుపారీ హత్య మొదలుకొని గత 5 నెలల్లో ముగ్గురు రౌడీల మర్డర్లకు గ్యాంగ్‌వారే ప్రధాన కారణం. మెట్రో నగరాల సుపారీ హత్యల సంస్కృతి జిల్లాను తాకడం ఆందోళన కలిగిస్తోంది.