
గుజరాత్ పోలీసులు ఓ పెద్ద రాకెట్‌ను ఛేదించారు. ఫుట్‌బాల్ బెట్టింగ్ యాప్ ద్వారా చైనాకు చెందిన ఓ వ్యక్తి రూ.14వందల కోట్లు కొల్లగొట్టినట్లు తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఇదంతా కేవలం 9 రోజుల్లోనే జరిగిందని పోలీసులు చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ యాప్ వలలో పడి గుజరాత్‌లో దాదాపు 12వందల మంది దగ్గర్నుంచి ఆ వ్యక్తి డబ్బును దోచుకున్నాడు. ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ స్కామ్‌ను దృష్టిలో ఉంచుకుని గుజరాత్ పోలీసులు దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు.
చైనాలోని షెన్‌జెన్ ప్రావిన్స్‌కు చెందిన వు యువాన్‌బీ ఈ కుంభకోణానికి సూత్రధారి అని సీఐడీ అధికారులు తెలిపారు. దీని గురించిన సమాచారం మొదటిసారిగా జూన్ 2022 నెలలో వెల్లడైంది. డానీ డేటా అనే యాప్ ద్వారా గుజరాత్, యూపీలో చాలా మంది మోసపోతున్నారని అప్పట్లోనే బట్టబయలైంది. అంతకుముందు మే నెలలో ఫుట్ బాల్ బెట్టింగ్ యాప్ ను ప్రారంభించిన యువాన్ బీ.. రీఫండ్ లతో పేరుతో ఎంతో మందిని ఆకర్షించాడు. దీని ద్వారా అతను రోజుకు రూ.2వందల కోట్లు వసూలు చేశాడని తెలుస్తోంది. అలా ఈ యాప్ సాయంతో 9 రోజుల పాటు వసూలు చేయడం కొనసాగింది. ఆ తర్వాత సడెన్ గా యాప్ పనిచేయడం ఆగిపోవడంతో.. యూజర్స్ మోసపోయామనే విషయాన్ని గ్రహించారు.
ఆగస్టు 2022లో గుజరాత్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత యువాన్ బీ చైనాకు పారిపోయినట్టు విచారణలో తేలింది. యుయాన్ బీకు వ్యతిరేకంగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఎటువంటి ఖచ్చితమైన సాక్ష్యాలను కనుగొనలేకపోయింది. కాబట్టి చైనాకు వెళ్లి పట్టుకునేలా చర్యలు తీసుకోవడం సాధ్యం కాలేదు. మరోవైపు చైనా, హాంకాంగ్, సింగపూర్ వంటి పొరుగు దేశాల నుంచి యువాన్ బీ ఇప్పటికీ ఈ తరహా రాకెట్‌ను నడుపుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇందుకోసం వివిధ రకాల యాప్స్ వాడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.