రూ.1533 కోట్లు ఇస్తే.. 287 కోట్లే ఖర్చు 

రూ.1533 కోట్లు ఇస్తే..  287 కోట్లే ఖర్చు 
  • మిగిలినవి ఎప్పుడు ఖర్చు చేస్తరో చెప్పాలంటూ రాష్ట్రానికి కేంద్రం ప్రశ్న 
  • వచ్చే జూన్ కల్లా పనులు పూర్తి చేస్తరో లేదో చెప్పాలని లెటర్

హైదరాబాద్, వెలుగు: స్మార్ట్ సిటీల పనులు ఆలస్యంగా చేస్తుండడంతో రాష్ట్ర సర్కారుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు ఆ పనులు చేసే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించింది. ‘‘స్మార్ట్​ సిటీస్ మిషన్​లో భాగంగా తెలంగాణలోని గ్రేటర్ ​వరంగల్, కరీంనగర్​లో 72 ప్రాజెక్టులకు సంబంధించి రూ.1,533 కోట్ల పనులు జరుగుతున్నాయి. కానీ, ఇప్పటి వరకు 2 సిటీలకు సంబంధించి రూ.287 కోట్లే ఖర్చు చేశారు. మిగిలిన రూ.1,246 కోట్లు వాడుకునేలా పనులు ఎందుకు చేయట్లేదు.పనులు పూర్తి చేసే ఉద్దేశం ఉందా? లేదా?” అని ప్రశ్నించింది.

ఈ మేరకు రాష్ట్ర సర్కారుకు కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ఇటీవల లెటర్ రాసింది. పథకం ప్రారంభించి ఏడేండ్లవుతున్నా పనుల్లో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలా చేస్తే  రాష్ట్రంలో కొత్త స్మార్ట్​సిటీలను ఎలా ప్రకటిస్తామని ప్రశ్నించింది. వచ్చే ఏడాది జూన్ కల్లా పనులు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఆలోపు పనులు పూర్తి చేస్తారో? లేదో? రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. 

చాలా పనులు మొదలే పెట్టలేదు..  

స్మార్ట్ సిటీస్ మిషన్ కింద గ్రేటర్ వరంగల్, కరీంనగర్ ను ఎంపిక చేసిన కేంద్రం.. 2015లో పథకం ప్రారంభించినప్పటి నుంచి నిధులు కేటాయిస్తోంది. ఇప్పటికే రూ.392 కోట్లు రిలీజ్​చేసినట్లు కేంద్రం లెటర్ లో పేర్కొంది. వాటికి స్టేట్ వాటా రిలీజ్ చేసి, ఫండ్స్​వాడుకోవడంలో రాష్ట్ర సర్కార్ ఫెయిలయిందని తెలిపింది. కేంద్రం 2015 నుంచి నిధులు విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర సర్కార్ ఆరేండ్లు ఆలస్యం చేసింది. పోయినేడాది నుంచే స్మార్ట్ సిటీలకు కేటాయింపులు ప్రారంభించింది.

గ్రేటర్ వరంగల్​లో రోడ్లు, భద్రకాళి లేక్​ఫ్రంట్ ఫేజ్ 2లో 50 శాతం లోపే పనులు పూర్తయినట్లు కేంద్రం లెటర్ లో పేర్కొంది. నాలాలకు బౌండరీ వాల్స్​నిర్మాణం, బయోమైనింగ్ డంప్​సైట్ నిర్మాణం వంటి పనులు శంకుస్థాపనలకే పరిమితమైనట్లు తెలిపింది. కరీంనగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ రోడ్ల రీడిజైన్, ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్​మేనేజ్​మెంట్, సీసీ కెమెరాల ఏర్పాటు, మోడ్రన్ స్లాటర్ హౌస్ వంటి పనులు మొదలుకాలేదని చెప్పింది. పనులన్నీ పూర్తి చేస్తేనే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని, సగం చేసి వదిలేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొంది. 

2015లో ప్రారంభం.. 

స్మార్ట్ సిటీస్ మిషన్‌‌ను కేంద్రం 2015 జూన్ 25న ప్రారంభించింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, సౌలతులు కల్పించడం, వాతావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టడం, నగరాలను ప్రమోట్ చేయడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం. నగరాల్లో నీరు, విద్యుత్, శానిటైజేషన్, అర్బన్ మొబిలిటీ, ప్రజా రవాణా, ఈ-–గవర్నెన్స్, ఆరోగ్యం, విద్య వంటివి మెరుగుపర్చేందుకు కేంద్ర నిధులు, యూఎల్​బీ గ్రాంట్లతో పాటు కొంత రాష్ట్ర నిధులతో పనులు చేపడుతోంది.