వనపర్తి, వెలుగు : పెట్టుబడి పేరుతో ఓ వ్యక్తి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 30 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... వనపర్తిలోని జంగిడిపురం కాలనీకి చెందిన చెన్ని శివ కృష్ణ ఆరు నెలల కింద టీవీలో ఓ యాప్ గురించి విని దానిని డౌన్‌లోడ్ చేసుకున్నాడు.
తర్వాత ఆ యాప్ నుంచి ‘ఏఆర్‌ఎస్‌ఎస్‌బీఎల్’ అనే యాప్‌కు సంబంధించిన లింక్ రావడంతో దానిని కూడా డౌన్‌లోడ్ చేసుకొని మొదట రూ. 30 వేలు ఇన్వెస్ట్ చేయడంతో అతడి పేరున అకౌంట్ క్రియేట్ అయింది. పెట్టుబడి పెట్టిన డబ్బులు భారీ మొత్తంలో పెరిగినట్లు యాప్‌లో చూపించడంతో నిజమేనని నమ్మిన శివకృష్ణ ఆరు నెలల్లో మొత్తం రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.
కాగా, అక్టోబర్ 31న అతడి అకౌంట్ బ్లాక్ అయినట్లు చూపింది. దీంతో యాప్ నిర్వాహకులను కాంటాక్ట్ కావడానికి ట్రై చేసినా ఫలితం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి మంగళవారం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.
