యాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలులో మోసం .. కొనకున్నా.. 200 క్వింటాళ్లు కొన్నట్టుగా లెక్కలు

యాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలులో మోసం .. కొనకున్నా.. 200 క్వింటాళ్లు కొన్నట్టుగా లెక్కలు
  • సొంత అకౌంట్లోకి రూ.4.64 లక్షలు  

యాదాద్రి, వెలుగు : వడ్లు కొనకున్నా.. కొన్నట్టుగా లెక్కల్లో చూపి సర్కారు సొమ్ము తమ అకౌంట్లలో వేసుకున్న ఘటన యాదాద్రి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. యాసంగి -2025 సీజన్​లో వడ్ల కొనుగోలు చేయడానికి యాదాద్రి జిల్లాలో 375 సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో 237 సెంటర్లు నిర్వహించారు. వీటిలో వలిగొండ మండలం సంగెం ఏర్పాటు చేసిన పీఏసీఎస్​ సెంటర్​లో అక్రమాలకు తెరలేపారు. రైతు పన్నాల చంద్రశేఖర్​రెడ్డి 1,034 బస్తాల వడ్లను సెంటర్లలో తూకం వేయించాడు. అయితే చంద్రశేఖర్ రెడ్డి 1,534 బస్తాల వడ్లు తూకం వేయించినట్టుగా సెంటర్​ఇన్​చార్జి ఉమారాణి రికార్డుల్లో నమోదు చేశారు. ట్యాబ్​ఎంట్రీ కూడా చేశారు. 

తూకం వేసిన బస్తాల కంటే ఎక్కువగా రికార్డుల్లో ఎంట్రీ చేసిన విషయాన్ని సెంటర్​ అసిస్టెంట్​ఇన్​చార్జి, ట్యాబ్​ఎంట్రీ ఆపరేటర్​ బాలకృష్ణ, డేటా ఎంట్రీ ఆపరేటర్ శేఖర్ గుర్తించారు. 1,034 బస్తాల అమౌంట్ చంద్రశేఖర్​రెడ్డి అకౌంట్​కు వెళ్లేలా ఎంట్రీ చేశారు. ఆ తర్వాత సెంటర్​ ఇన్​చార్జి ఉమారాణికి తెలియకుండా 500 బస్తాలకు సంబంధించిన అమౌంట్ కోసం శేఖర్ తన బ్యాంకు అకౌంట్ నంబర్, బాలకృష్ణ తన తల్లి పద్మ అకౌంట్​ను ఎంట్రీ చేశారు. దీంతో వీరిద్దరి అకౌంట్లలో రూ.4.64 లక్షలు జమ అయ్యాయి. తన అకౌంట్​కు డబ్బులు రాకపోవడంతో శేఖర్, బాలకృష్ణతో సెంటర్​ ఇన్​చార్జి ఉమారాణి వాగ్వాదానికి దిగారు. దీంతో విషయం బయటకు పొక్కడంతో జిల్లా ఆఫీసర్ల దృష్టికి వచ్చింది. 

డీసీవో విచారణ..

విషయం బయటకు రావడంతో కలెక్టర్​ హనుమంతరావు ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్​ వీరారెడ్డి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దీంతో డిస్ట్రిక్​ కో–ఆపరేటీవ్​ ఆఫీసర్లు విచారణ నిర్వహించి రిపోర్ట్ ను అడిషనల్​కలెక్టర్ వీరారెడ్డికి అందించారు. దీంతో సెంటర్​ ఇన్​చార్జి ఉమారాణి, ఎంట్రీ ఆపరేటర్లు శేఖర్, బాలకృష్ణకు సంబంధించిన బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్​చేయించారు. 

ముగ్గురిపై కేసు.. సగం డబ్బు రికవరీ..

వడ్లు కొనకున్నా.. కొన్నట్టుగా రికార్డులు రూపొందించిన ఉమారాణి, డబ్బు సొంత అకౌంట్లలో వేసుకున్న శేఖర్, బాలకృష్ణపై కేసు నమోదు అయింది. బాలకృష్ణ అమ్మ పద్మ అకౌంట్లో ఉన్న రూ.2.44 లక్షలను రికవరీ చేశారు. శేఖర్ అకౌంట్లో ఉన్న అమౌంట్​కూడా రికవరీ చేయడానికి బ్యాంకు ఆఫీసర్లను సివిల్ సప్లయ్​డిపార్ట్​మెంట్​సంప్రదించింది.