జనసేన పార్టీ ఆఫీసులో ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్లు మోసం : పోలీస్ కేసు నమోదు

జనసేన పార్టీ ఆఫీసులో ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్లు మోసం : పోలీస్ కేసు నమోదు

ఏపీలో జనసేన నేతలు, పార్టీ సింబల్ వాడుకొని వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.  జనసేన నేతలు,పార్టీ పేరుతో ఏలూరు, తణుకు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయలు వసూలు చేసి ఓ వ్యక్తి పరారైన ఘటన కలకలం రేపుతోంది. జనసేన పార్టీ సీనియర్ నేత కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే), ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోటా రుక్మిణి పేర్లను దుర్వినియోగం చేస్తూ ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జనసేన నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. 

గగర ధరణి అనే వ్యక్తి గతంలో ఓ కన్సల్టెన్సీ జాబ్ ఏజెన్సీలో పనిచేసేవాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత జనసేన పార్టీ రాష్ట్ర ఆఫీసు లెటర్ హెడ్ లు, పార్టీ గుర్తులు, నేతల పేర్లను నాయకుల పేర్లను ఉపయోగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించాడు. నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు సృష్టించి ఒక్కొక్కరి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఇలా సుమారు 20 మంది నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేసి పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారం జనసేన పార్టీ రాష్ట్ర ఆఫీసు వర్గాల దృష్టికి రావడంతో ఆ పార్టీ సీనియర్ నేత కళ్యాణం శివ శ్రీనివాసరావు స్పందించారు. తన పేరుతో పాటు పార్టీ గుర్తులను దుర్వినియోగం చేస్తూ మోసానికి పాల్పడిన వ్యక్తిపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు స్వీకరించిన మంగళగిరి రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.