పార్లమెంట్ ఎన్నికలు పదేళ్ల అభివృద్ధి, వంద రోజుల అబద్ధాల మధ్య జరుగుతున్న యుద్ధం అని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్ చింతకుంటలో జరిగిన బీఆర్ఎస్ యుద్దభేరి సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ ఆదేశాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని.. కేసులకు బీఆర్ఎస్ భయపడదని చెప్పారు.
కరీంనగర్ లో వినోద్ కుమార్ ఎంపీగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు..ప్రతీకార పాలన అని ఆర్ఎస్పీ విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీల ప్రభుత్వం కాదని.. గారడీల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 200 మంది రైతులుల ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత వినోద్ కుమార్ దేనని ఎమ్మెల్యే గంగుల కమాలకర్ అన్నారు. వినోద్ కుమార్ గెలుపు కరీంనగర్ జిల్లాకు ఇప్పుడు చాలా అవసరమని చెప్పారు. ప్రశ్నించే గొంతుక పార్లమెంటుకు వెళ్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తెలేదని.. వినోద్ కుమార్ గెలిస్తేనే కరీంనగర్ కు నిధులు వస్తాయని చెప్పారు.