అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేస్తే పట్టించుకోరా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేస్తే పట్టించుకోరా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు: అసైన్డ్ భూములను కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాగజ్ నగర్ లో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ఈస్గాం శివ మల్లన్న ఆలయ సమీపంలో సర్వే నం.190లో ఉన్న అసైన్డ్‌ భూములను కొందరు రియల్ వ్యాపారులు ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారని పేర్కొన్నారు.

రెవెన్యూ ఆఫీసర్ల కనుసన్నలోనే ఇదంతా జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. దీనిపై పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పెంచికల్ పేట్ లో సిరిపురం ఈశ్వర్ అనే ఉపాధి కూలీ పనులకు వెళ్లొస్తూ గుండెపోటుతో చనిపోగా అక్కడికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి తదితరులున్నారు 

ఎస్పీఎంలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు వెంటనే జరపాలి .

సిర్పూరు పేపర్ మిల్(ఎస్పీఎం) కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వం వెంటనే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎస్పీఎంలో కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు శుక్రవారం ఆయనను కలిసి మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేకే కంపెనీ యాజమాన్యం కార్మికుల కష్టాలు తీర్చడంలో విఫలమైందన్నారు.

కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ, హక్కులను కాలరాస్తోందని ఫైర్​అయ్యారు. స్థానికులకు తక్కువ జీతాలు చెల్లిస్తూ, స్థానికేతరులకు మాత్రం అధిక జీతాలు చెల్లిస్తోందని విమర్శించారు. కార్మికులకు ప్రమాదం జరిగితే పరిహారం చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. వారికి ఉద్యోగ భద్రత లభించాలని డిమాండ్ చేశారు.