
- ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ
- పరస్పర దాడులతో పలువురికి గాయాలు
- మద్దతు తెలిపిన బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ పీ అరెస్టు
- రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఘటన
శంకర్ పల్లి, వెలుగు : చర్చి పక్కన రోడ్డు వేస్తుండగా.. ఆనుకొని వేయొద్దని ఓ వర్గం.. వేయాలంటూ మరో వర్గం పట్టుబట్టింది. అది కాస్త కులాల మధ్య చిచ్చుపెట్టే స్థాయికి చేరి ఘర్షణకు దారితీసింది. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. బాధితులు న్యాయం చేయాలని బుధవారం శంకర్పల్లి- – నార్సింగి రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్ర బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్మద్దతు తెలపడంతో ఆందోళన మరింత తీవ్రమైంది. పోలీసులు గ్రామంలో 144 సెక్షన్విధించారు. ఆర్ఎస్ప్రవీణ్కుమార్ని అరెస్టు చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి..
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో మంగళవారం సాయంత్రం హెచ్ఎండీఏ నిధులతో చర్చి ముందు రోడ్డు వేస్తున్నారు. కొద్దిగా స్థలం వదిలిపెట్టి రోడ్డు వేయాలని ఓ వర్గం కోరారు. స్థలం వదిలిపెట్టకుండా రోడ్డు వేస్తామని మరో వర్గం వారు చెప్పడంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడం, దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. సమాచారం అందడంతో మోకిల పోలీసులు గ్రామానికి వెళ్లారు. గొడవ సద్దుమణగకపోగా అదనపు బలగాలను రప్పించారు.
రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్, నార్సింగి ఏసీపీ లక్ష్మినారాయణ, మోకిల, శంకర్ పల్లి, నార్సింగి సీఐ లు వీరబాబు, వినాయక్ రెడ్డి, హరికృష్ణ రెడ్డి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి సముదాయించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జన్వాడలో దళితులపై జరిగిన దాడి హేయమైన చర్య బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభివర్ణించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, దాడి చేసిన నిందితులను గుర్తించి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.