రోజుకు రూ.94 వేల కోట్లు! అక్టోబర్ యూపీఐ లావాదేవీల రికార్డ్

రోజుకు రూ.94 వేల కోట్లు! అక్టోబర్ యూపీఐ లావాదేవీల రికార్డ్
  • దీపావళి ముందు రోజు 75 కోట్ల లావాదేవీలు
  • వెల్లడించిన ఎన్​పీసీఐ రిపోర్ట్​

న్యూఢిల్లీ: ఈసారి నవరాత్రి, దీపావళి పండుగల సమయంలో  యూపీఐ లావాదేవీలు విలువ పరంగా, సంఖ్యల పరంగా రికార్డులు సృష్టించాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ) లెక్కల ప్రకారం, ఈ నెలలో యూపీఐ సగటు రోజువారీ లావాదేవీల విలువ రూ. 94 వేల కోట్లకు చేరింది. ఇది సెప్టెంబరులో ఉన్న రూ. 82,991 కోట్ల కంటే 13 శాతం ఎక్కువ. రోజువారీ సగటు లావాదేవీల సంఖ్య కూడా సెప్టెంబరులో ఉన్న 65.4 కోట్ల నుంచి అక్టోబరులో 69.5 కోట్లకు పెరిగింది. 

అక్టోబర్ లో యూపీఐ ద్వారా 16.58 బిలియన్ లావాదేవీల్లో జనం రూ. 23.5 లక్షల కోట్ల విలువైన డబ్బు పంపారు. దీపావళి ముందు రోజు (అక్టోబర్ 18న) 75.4 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రికార్డు స్థాయిలో రూ. 1.02 లక్షల కోట్లు! పండుగ ఉత్సాహం, జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ రేట్ల తగ్గింపుతో యూపీఐ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వాడకం భారీగా పెరిగింది. 

పండుగ ఆఫర్లు, కొన్ని వస్తువులపై జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ తగ్గింపు, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా సులభంగా డబ్బు పంపే అవకాశం ఉండటం, ఈ–కామర్స్​ వల్ల డిజిటల్​ పేమెంట్లు పెరిగాయి. ప్రస్తుతం మొత్తం డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా దాదాపు 85 శాతం ఉంది.

ఈ–కామర్స్ దూకుడు

ఈసారి పండగ సమయంలో ఈ–కామర్స్ లావాదేవీల సంఖ్య గత ఏడాది ఇదే సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 22 శాతం పెరిగింది. డెబిట్ కార్డుతో ఈ–-కామర్స్ ఆర్డర్లు ఇవ్వడం 24 శాతం తగ్గింది. వరుసగా రెండో ఏడాది కూడా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్​లో క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు (48 లక్షలు) పాయింట్-  ఆఫ్- సేల్ స్వైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల (42 లక్షలు) కంటే ఎక్కువగా ఉన్నాయి. యూపీఐ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే, గూగుల్ పే మార్కెట్​లీడర్లు అయినప్పటికీ చిన్న యూపీఐ సంస్థలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. 

నవి ఆగస్టులో దాదాపు 50 కోట్లు, సూపర్ డాట్​మనీ 25 కోట్లు, భీమ్ యాప్ ద్వారా దాదాపు 10 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ పోటీ వల్ల గూగుల్ పే, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే మొత్తం మార్కెట్ వాటా ఏడాది క్రితం 85 శాతం నుంచి ఆగస్టులో 80 శాతానికి తగ్గింది. యూపీఐ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మరింత సులభంగా వాడటానికి ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఐ 'యూపీఐ హెల్ప్'ను ప్రారంభించింది. చెల్లింపులకు సంబంధించిన ప్రశ్నలు, ఫిర్యాదుల పరిష్కారంలో సహాయం చేసే ఏఐ-ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ఇది. దీంతో ట్రాన్సాక్షన్​ స్టేటస్​ను, కంప్లయింట్ల పరిస్థితిని ట్రాక్ చేయవచ్చు.