
- ఒకరు మృతి, 20 మందికి గాయాలు
రాయపర్తి (వరంగల్), వెలుగు : ఆర్టీసీ బస్సు, కంటెయినర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు డ్రైవర్ చనిపోగా, మరో 20 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం శివారులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 45 ప్రయాణికులతో వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తోంది. మైలారం శివారులోని సబ్‌స్టేషన్ సమీపంలో గల ఎస్సారెస్పీ కెనాల్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే... ఎదురుగా వచ్చిన కంటెయినర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ గడ్డం వెంకటయ్య , కండక్టర్ క్రిష్ణయ్య, వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మిట్టపల్లి సుభాశ్, సుంకరి స్వామి, సంకినేని భీమరాజు, వరంగల్ రంగశాయిపేటకు చెందిన ఊరుగొండ ప్రేమ్‌కిశోర్, మహబూబాబాద్ జిల్లా జయ్యారానికి చెందిన పేరుబోయిన సావిత్రి, రాయపర్తికి చెందిన రావుల విమల, భూపాలపల్లి పంబాపూర్ గ్రామానికి చెందిన జరియాల ఎల్లయ్య, జరియాల శ్రీలతతో పాటు గుజరాత్‌కు చెందిన కంటెయినర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని వరంగల్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బస్సు డ్రైవర్ వెంకటయ్య సాయంత్రం చనిపోయాడు.
కంటెయినర్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో అరగంట పాటు శ్రమించి అతడిని బయటకు తీశారు. ప్రమాదం కారణంగా ఖమ్మం హైవేపై సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ అంబటి నర్సయ్య తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యాక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ ప్రమాద స్థలానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకొని, గాయపడిన వారిని
పరామర్శించారు.