
- 12 రోజుల పాటు 8,419 ట్రిప్పులు నడిపిన ఆర్టీసీ
- 4,63,691 ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం
వరంగల్, వెలుగు : కాళేశ్వరంలో జరిగిన సరస్వతీ పుష్కరాలు ఆర్టీసీకి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. 12 రోజుల పాటు నడిచిన బస్సుల ద్వారా సంస్థకు రూ. 8 కోట్ల ఆదాయం వచ్చింది. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను నడిపింది. ఉమ్మడి వరంగల్‌లోని తొమ్మిది డిపోలతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
పుష్కరాల సందర్భంగా 12 రోజుల పాటు వరంగల్ రిజియన్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల ద్వారా 8,419 ట్రిప్పులు నడుపగా.. మొత్తం 4,63,691 మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించారు. పుష్కరాలు ప్రారంభమైన మొదట్లో బస్సుల్లో రోజుకు 7 వేల మంది ప్రయాణించగా.. 23న ఒక్కరోజే 49,757 మంది జర్నీ చేశారు. ఇక 24న 68,575, 25న 68,473 మంది, చివరి రోజైన సోమవారం 65 వేల మంది బస్సుల్లో ప్రయాణం చేశారని ఆఫీసర్లు తెలిపారు.