
- సొంతంగా హాస్పిటల్స్, క్లినిక్స్ నడుపుతున్న పలువురు డాక్టర్లు
- రిజిస్టర్‌లో సంతకం చేయగానే సొంత నర్సింగ్‌హోంకు పయనం
- సొంత హాస్పిటల్ లేని వారు ప్రైవేట్‌లో ప్రాక్టీస్
- నోటీసులు, వార్నింగ్‌లు ఇస్తున్నా మారని తీరు
- తాజాగా మరోసారి 77 మందికి నోటీసులు జారీ
వరంగల్/వరంగల్ సిటీ, వెలుగు : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన వరంగల్ ఎంజీఎం హస్పిటల్‍లో డాక్టర్లు మొదలు స్టాఫ్ నర్స్, నర్సులు, ల్యాబ్ అసిస్టెంట్ల వరకు మొక్కుబడిగానే పనిచేస్తున్నారు. ఇక్కడ అటెండెన్స్ వేసుకున్న తర్వాత.. కొందరు డాక్టర్లు, సిబ్బంది సొంత క్లినిక్స్‌కు వెళ్తుండగా.. అలాంటివి లేని వారు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ప్రాక్టీస్‌కు వెళ్తున్నారు. మరికొందరు డ్యూటీ టైం దాటి రెండు, మూడు గంటలు దాటినా హాస్పిటల్‌లో అడుగే పెట్టడం లేదు. దీంతో వివిధ జిల్లాల నుంచి ఎంజీఎంకు వచ్చే రోగులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. డ్యూటీలో నిర్లక్ష్యం వహించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన ఆఫీసర్లు వార్నింగ్‌లు, షోకాజ్ నోటీసులతోనే సరిపెడుతున్నారు.
పేరుకే టైమింగ్స్...
ఎంజీఎంలో వివిధ డిపార్ట్‌మెంట్లకు సుమారు 30 నుంచి 40 మంది హెచ్‌వోడీలు, 250 మంది డాక్టర్లు, 200 మంది హౌస్ సర్జన్లు, 500 మంది వరకు జూనియర్ డాక్టర్లు (పీజీలు) ఉన్నారు. వీరే కాకుండా 65 మంది హెడ నర్సులు, 450 మంది స్టాఫ్ నర్సులు ఉన్నారు. హెచ్‌వోడీలు, డాక్టర్లు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా డ్యూటీకి హాజరుకావాలి. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేసే వారైతే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండాలి. కానీ మొత్తం డాక్టర్లు, సిబ్బందిలో 90 శాతం మంది తమకు నచ్చిన టైంలో డ్యూటీకి అటెండ్ అవుతున్నారు. కొందరైతే కాసేపు డ్యూటీలో ఉండి.. ఆ తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ కోసం బయటకు వెళ్తున్నారు.
సొంత హాస్పిటళ్లు, ప్రైవేట్ ప్రాక్టీస్‌లు
ఎంజీఎంలో పనిచేస్తున్న చాలా మంది డాక్టర్లు గ్రేటర్ వరంగల్ పరిధిలో సొంత హాస్పిటల్స్, క్లినిక్స్ నడుపుతున్నారు. వారి కుటుంబ సభ్యుల పేరుతో వీటిని ఏర్పాటు చేస్తున్న వైద్యులు ఎంజీఎంలో డ్యూటీకి హాజరుకాకుండా.. సొంత హాస్పిటల్ బాగోగులు చూసుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదయం టైంపాస్‌కు వచ్చినట్లు ఎంజీఎంకు వచ్చి అటెండెన్స్ వేసుకున్న తర్వాత.. జూనియర్లకు అప్పగించి సొంత క్లినిక్స్‌కు వెళ్లిపోతున్నారు. గతంలో ఇదే ఎంజీఎంలో సూపరింటెండెంట్ స్థాయిలో పనిచేసిన వారికి సైతం సొంత హాస్పిటల్స్ ఉండడం గమనార్హం.
ఎంజీఎంలో పనిచేసే ఆర్థోపెడిక్, అనస్తీషియా, రెడియోథెరపీ, యూరాలజీ, గైనాకాలజీ, జనరల్ సర్జన్ డిపార్ట్‌మెంట్లకు చెందిన డాక్టర్లకు హనుమకొండ బాలసముద్రం, ఏషియన్ మాల్ ఎదురు గల్లీ, హనుమకొండ చౌరస్తా, నయీంనగర్, ములుగు రోడ్, పోచమ్మ మైదాన్, వరంగల్ ప్రాంతాల్లో సొంత హాస్పిటళ్లు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడల్లోనూ క్లినిక్‌లు నడిపిస్తూ... ఇక్కడ అటెండెన్స్ మెయింటేన్ చేసే డాక్టర్లుసైతం ఎంజీఎంలో ఉన్నారు. సొంత క్లినిక్స్ లేని వారు గ్రేటర్ సిటీలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో పనిచేస్తున్నారు.
పేదలకు అందని ట్రీట్‌మెంట్
ఏదైనా అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్తే టెస్ట్‌లు, స్కానింగ్‌లు, ట్రీట్‌మెంట్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్నారు. దీంతో వేలాది మంది పేదలు, సామాన్య ప్రజలు ప్రతి నిత్యం ఎంజీఎంకు వస్తుంటారు. తెల్లవారుజామునే ఎంజీఎం చేరుకొని ఓపీ సెంటర్ వద్దక్యూ కడుతున్నారు. ఎమర్జెన్సీ, ఈఎన్‍టీ, డెంటల్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థో, పీడియాట్రిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ డిపార్ట్‌మెంట్‌కు వచ్చే వారే సుమారు 2 వేల మంది వరకు ఉంటారు. కానీ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది డుమ్మాలు కొడుతుండడంతో పేషెంట్లకు మెరుగైన వైద్యం అందడం లేదు.
గతంలో రెగ్యులర్ మానిటరింగ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ఎంజీఎం నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మంత్రి కొండా సురేఖతో పాటు వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విధుల్లో అలసత్వం వహించిన వారికి షోకాజ నోటీసులు జారీ చేశారు. ఇష్టారీతిన అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసిన డాక్టర్‌ను సస్పెండ్ చేశారు. తర్వాత హాస్పిటల్ అంతటా ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశారు. రెగ్యులర్‌గా పర్యవేక్షణ చేయడంతో సేవల్లో కొంత మార్పు కనిపించింది. తర్వాత ఆఫీసర్లు పట్టించుకోవడం మానేయడంతో వైద్యసిబ్బంది తీరు షరామామూలే అన్నట్లు తయారైంది.
తాజాగా 77 మందికి నోటీసులు
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఇటీవల ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో డాక్టర్లు, సిబ్బంది డ్యూటీలకు డుమ్మా కొట్టినట్లు తేలడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్ రికార్డులను పరిశీలించారు. ఆర్థో, డీవీఎల్, అనస్తీషియా, రేడియాలజీ, న్యూరాలజీ, ట్రామా, గ్యాస్ట్రో, పీడియాట్రిక్, సీఏఎస్ విభాగాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు రికార్డ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్లు.. మొత్తంగా 72 మంది డాక్టర్లు, ఐదుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. వీరు ఇచ్చే సమాధానం ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.