ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్​ను ఓడించాలె : అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్​ను ఓడించాలె : అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ ను ఓడించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఓటమి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అశ్వత్థామరెడ్డి కలిశారు. అయితే, తాను కాంగ్రెస్ లో చేరలేదని ఆయన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. రాష్ర్టవ్యాప్తంగా ఈ నెల 28 వరకు అన్ని ఆర్టీసీ డిపోల్లో పర్యటిస్తానని, కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరిస్తానని ఆయన తెలిపారు.  

9 ఏండ్ల నుంచి ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోలేదని 2 పీఆర్సీలు, 9 డీఏలు, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకునేందుకు ఎన్నికల ముందు హడావుడిగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రతిపాదన తీసుకొచ్చిందని.. బిల్లులో క్లారిటీ లేకుండా, కార్మికుల బకాయిలపై స్పష్టత ఇవ్వకపోవటంతో గవర్నర్ అడ్డుకున్నారని తెలిపారు.