ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం దశలవారీగా ఆందోళనలు

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం దశలవారీగా ఆందోళనలు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ జాతీయ మజ్దూర్‌‌ యూనియన్‌‌ (టీజేఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌‌ డిమాండ్‌‌ చేశారు. ఇందుకోసం యూనియన్‌‌ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న అన్ని డిపోల ఎదుట ధర్నాలు, 26న ఇందిరా పార్కు వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జులై తొలి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చైతన్య యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని టీజేఎంయూ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తాము చేసిన విలీన ప్రతిపాదననే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇక్కడ కూడా అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆర్టీసీ ఎన్నికల్లో తమ యూనియన్‌‌ను గెలిపిస్తే వేతన సవరణ చేయిస్తామని, డీఏను ఆరునెలలకోసారి ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగ భద్రత, పనిభారం తగ్గించే విధంగా పోరాడుతామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆన్ డ్యూటీలో చనిపోతే వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు చెల్లించాలని డిమాండ్‌‌ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులను  యాజమాన్యం వాడుకున్నా ఏ సంఘం మాట్లాడలేదని ఆరోపించారు. టీఎంయూ ఇన్నాళ్లూ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా నిద్రావస్థలో ఉందని, ఇప్పుడు ఎన్నికల జిమ్మిక్కులు చేస్తోందని ఆయన విమర్శించారు. అంతకుముందు టీజేఎంయూ ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.