ఆర్టీసీ కార్మికులు ఆగమైతున్నరు.. మనోవేదనతో బ్రెయిన్​స్ట్రోక్​లు, హార్ట్​ఎటాక్​లు, ఆత్మహత్యలు 

ఆర్టీసీ కార్మికులు ఆగమైతున్నరు.. మనోవేదనతో బ్రెయిన్​స్ట్రోక్​లు, హార్ట్​ఎటాక్​లు, ఆత్మహత్యలు 
  •     సంస్థ బస్సులు తగ్గించి అద్దె బస్సులు పెంచుతున్నరు
  •     ఇతర జిల్లాలకు బలవంతపు బదిలీలు  
  •     అనారోగ్యం ఉన్నా ఆఫీసర్లు పట్టించుకోవట్లే 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఆర్టీసీలో ఆఫీసర్ల వేధింపులు, పని భారం, ఇష్టమున్నట్టు ట్రాన్స్​ఫర్లు చేస్తుండడంతో డ్రైవర్లు, కండక్టర్లు ​గోస పడ్తున్నారు. దీంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా, మరికొందరు మానసిక వేదనతో హార్ట్​ఎటాక్​ వచ్చి చనిపోతున్నారు. నష్టాల పేరుతో పలు రూట్లలో బస్సులను తగ్గిస్తున్న యాజమాన్యం అద్దె బస్సులను పెంచుకుంటూ పోతోంది.

అలాగే ఎక్సెస్​ పేరిట డ్రైవర్లు, కండక్టర్లను ఇతర జిల్లాలకు బదిలీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కొత్తగా 400 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తుండడం, వీటిని ప్రైవేట్​ఆధ్వర్యంలో నడిపిస్తారన్న వార్తలు వస్తుండడంతో డ్రైవర్లు, కండక్టర్లు తమను మళ్లీ బదిలీ చేస్తారేమోనని భయపడుతున్నారు. ఇక రాత్రి 8 గంటలకే మహిళా కండక్టర్లు ఇంటికి వెళ్లవచ్చన్న సీఎం కేసీఆర్​ హామీ ఇంకా నెరవేరడం లేదు.  

ట్రాన్స్​ఫర్ల మీద పడ్డరు

ఆఫీసర్లు ఇష్టమున్నట్టు బదిలీలు చేస్తుండడం, పెరిగిన పనిగంటలతో ఉద్యోగం చేయలేకపోతున్నామని కార్మికులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోల్లో బస్సులను తగ్గించి కార్మికులు ఎక్సెస్​ఉన్నారంటూ డ్రైవర్లు,కండక్టర్లను బదిలీ చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో నాగర్​కర్నూల్ ​జిల్లాలోని నాలుగు డిపోల నుంచి తొమ్మిది మందిని గోల్కొండ రీజియన్​కు, మహబూబ్​నగర్ ఆర్టీసీ రీజియన్​ పరిధిలో 25 మంది డ్రైవర్లను, పెద్దపల్లి జిల్లాలోని రెండు డిపోల పరిధిలో తొమ్మిది మందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు.

ఎనిమిది నెలల కింద ఖమ్మం ఆర్టీసీ రీజియన్ ​పరిధిలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల నుంచి దాదాపు 60 మందిని ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ట్రాన్స్​ఫర్​ చేశారు. కార్మికులు గొడవ చేయడంతో అందరిని ఆరు నెలల్లో తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ దాని ఊసే లేదు. మళ్లీ నెల కిందటే 42 మందిని హైదరాబాద్ కు బదిలీ చేశారు.    

వెళ్లలేక ఆత్మహత్యలు..మనోవేదనలో మరణాలు

తమను చాలా దూరంలో ఉన్న జిల్లాలకు పంపిస్తున్నారని, అనారోగ్య కారణాలతో అక్కడ పని చేయలేమని కార్మికులు నెత్తీనోరు కొట్టుకుంటున్నా ఆఫీసర్లు వినడం లేదు. బదిలీల విషయమై ఆఫీసర్లతో మాట్లాడడానికి వెళ్తే కనీసం కలిసేందుకు కూడా ఒప్పుకోవడం లేదు. దీంతో మనోవేదనతో చనిపోవడమో, ఆత్మహత్యలు చేసుకోవడమో జరుగుతోంది. భద్రాచలం డిపోకు చెందిన డ్రైవర్ రేణు గుండెజబ్బుతో బాధపడుతుండగా 2018లో స్టంట్ ​వేశారు.

అప్పటినుంచి ఆయన ఆరోగ్యం బాగుండడం లేదు. అయినా, గత ఫిబ్రవరి నెలలో హైదరాబాద్​కు బదిలీ చేయడంతో అధికారులను కలిసి మొరపెట్టుకున్నాడు. వారు వినకపోవడంతో వారం కింద తన స్వగ్రామమైన ఇల్లెందులో సూసైడ్​ చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో పనిచేస్తున్న ఓ డ్రైవర్​ను కూడా హైదరాబాద్​కు బదిలీ చేయగా, తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, వెళ్లలేనని ఆఫీసర్లకు చెప్పాడు.

వాళ్లు ఒప్పుకోకపోవడంతో మనోవేదనతో బ్రెయిన్ ​స్ట్రోక్​బారిన పడ్డాడు. అలాగే ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన డ్రైవర్ పుల్లారావును గత నెలలో హైదరాబాద్​కు బదిలీ చేశారు. తనకు హెల్త్​ సరిగ్గా ఉండడం లేదని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్​ వెళ్లి జాయిన్​అయ్యాడు. అక్కడ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతంతో ఇప్పుడు మంచాన పడ్డాడు.   

ఆఫీసర్ల వేధింపులు  

గతేడాది కొత్తగూడెం డిపోలో ఎస్ఎం(స్టేషన్​మేనేజర్​)గా పనిచేస్తున్న ఉద్యోగి యూన్​రావును అప్పటి డిపో మేనేజర్ కావాలనే బదిలీ చేయడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఎనిమిది నెలల కింద హార్ట్​ఎటాక్​తో చనిపోయాడు. డీఎం వేధింపులతోనే తమ తండ్రి చనిపోయాడని అప్పట్లో యూన్​ రావు కొడుకులు ఆరోపించారు. కార్మికులు 12 గంటలు స్పెషల్​ఆన్​ డ్యూటీ చేస్తే మరుసటి రోజు రెస్ట్​ ఇవ్వాల్సి ఉంటుంది.

గతంలో ఇది అమలు చేసేవారు. ప్రస్తుతం14 గంటల నుంచి 16 గంటలు పనిచేస్తేనే మరుసటి రోజు రెస్ట్​ఇస్తామని ఆఫీసర్లు తెగేసి చెబుతున్నారని కార్మికులు వాపోతున్నారు. సర్వీస్​లు తగ్గించి అద్దె బస్సులను పెంచి ఉన్న వారిపై ఆర్ఎం, డీఎంలు పని భారం పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని భారం ఎక్కువవుతోందని, తగ్గించాలని డిమాండ్​చేస్తూ కొత్తగూడెం డిపోలో 20 రోజుల కింద కార్మికులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును కలిసి తమ బాధలు చెప్పుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. 

ట్రాన్స్ ఫర్ అయిందనే బాధతోనే చనిపోయిండు 

నా భర్త రేణు ఆర్టీసీ డ్రైవర్​. 2018లో గుండెజబ్బు రావడంతో స్టంట్ వేశారు. అయినా హైదరాబాద్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. ఆరోగ్యం బాగా లేదని, హైదరాబాద్ ​వెళ్లి పని చేయలేనని ఆఫీసర్లకు చెప్పినా వినలే. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పోవడంతో నాతో పాటు ఇద్దరు పిల్లలు దిక్కు లేని వారమయ్యాం. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. అధికారులు నా కొడుకుకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. –  ఆర్. మల్లేశ్వరి, ఆర్టీసీ డ్రైవర్ రేణు భార్య, ఇల్లెందు

కార్మికుల సమస్యలను పట్టించుకోవట్లే

కార్మికుల సమస్యలను ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ప్రయాణికులు లేరంటూ ఆర్టీసీ బస్సులను తగ్గిస్తూ అద్దె బస్సులను పెంచుతున్నారు. కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారంటూ బదిలీలు చేస్తూ వేధిస్తున్నారు. ఎక్కువ గంటలు పని చేయిస్తూ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. – డీఎన్​ రావు, యూనియన్​ లీడర్ 

కొత్తగూడెం కార్మికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నరు 

కార్మికులకు పనిభారం ఎక్కువైంది.ఆఫీసర్లు వేధిస్తున్నారు. ఇష్టమున్నట్టు ట్రాన్స్​ఫర్లు చేస్తుండడంతో కార్మికుల ప్రాణాలు పోతున్నాయి. చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. మహిళా కండక్టర్లకు సీఎం ఇచ్చిన హామీ అమలు కావట్లేదు.

ఆర్టీసీ బస్సులను తగ్గించి అద్దె బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. డీఎం, ఆర్​ఎంలకు సమస్యలు చెప్తే పట్టించుకోవట్లేదు. సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమిస్తాం. త్వరలో వస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ ​డ్రైవర్లు, కండక్టర్లకు అప్పగించనున్నట్టు తెలిసింది . - కందుల భాస్కర్, ఆర్టీసీ ఎంప్లాయీస్​ యూనియన్​ (ఏఐటీయూసీ)  రీజియన్​ గౌరవ అధ్యక్షుడు