చెరువుల్లో అడ్డగోలుగా తవ్వకాలు..కాంట్రాక్టర్లకు మట్టిని అమ్ముకుంటున్నరు

చెరువుల్లో అడ్డగోలుగా తవ్వకాలు..కాంట్రాక్టర్లకు మట్టిని అమ్ముకుంటున్నరు
  • చెరువుల్లో అడ్డగోలుగా తవ్వకాలు
  • కాంట్రాక్టర్లు, రియల్టర్లు, ఇటుక బట్టీలకు
  • మట్టిని అమ్ముకుంటున్న లీడర్లు
  • చెరువుల్లో ఎక్కడ చూసినా గోతులే
  • తెలియక వెళ్లి.. ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు

భూపాలపల్లి/ మహబూబ్​నగర్ /నెట్​వర్క్, వెలుగు: అధికార పార్టీ నేతల ధన దాహానికి, అధికారుల నిర్లక్ష్యానికి చెరువులు ఆగమవుతున్నాయి. మిషన్ కాకతీయ కింద రూ.20 వేల కోట్లు ఖర్చు చేసి 40 వేలకు పైగా చెరువులను డెవలప్ చేసినట్లు చెప్పుకుంటున్న సర్కారు.. అవే చెరువులను అడ్డగోలుగా తవ్వుకుంటున్నా పట్టించుకుంటలేదు.

ఇరిగేషన్​ ప్రాజెక్టులు, రోడ్లు, బిల్డింగులు, ఇతర అభివృద్ధి పనుల పేరుతో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు వేలాది చెరువులను గంపగుత్తగా రాసిస్తున్నది. ఇటుక బట్టీ యాజమాన్యాలకూ లీజుకిస్తున్నది. ఈజీఎస్ కింద చెరువుల్లో పూడిక తీయిస్తూ.. విలువైన మట్టిని ప్రైవేట్​వ్యక్తులకు అప్పగిస్తున్నది. కొన్ని చోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా బీఆర్ఎస్ లీడర్లే తవ్వుకొని రియల్టర్లకు, బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు అమ్ముకుంటున్నారు. రూల్స్ ప్రకారం చెరువుల్లో పూడిక మాత్రమే పారలతో ఎత్తి పోయాల్సి ఉన్నా.. ఎక్స్​కవేటర్లతో తవ్వించి, వందలాది లారీల్లో తరలిస్తున్నారు. దీంతో సాఫ్​గా ఉండాల్సిన చెరువులన్నీ కయ్యలు, గుంతలతో రూపు కోల్పోతున్నాయి. చెరువుల్లో గుంతలను అంచనా వేయకుండా ఈతకు, బట్టలు ఉతికేందుకు వెళ్తున్న పిల్లలు, మహిళలు వాటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇష్టారాజ్యంగా లీజులు

రాష్ట్రంలో పాలమూరు–-రంగారెడ్డి సహా పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద కరకట్టల నిర్మాణ పనులు నడుస్తున్నాయి. రూ.వేల కోట్లతో నేషనల్ హైవేస్, ఆర్అండ్​బీ రోడ్లు, సీసీ రోడ్ల పనులు సాగుతున్నాయి. వీటికి అవసరమైన మట్టి, మొరం కోసం కాంట్రాక్టర్లు గతంలో గుట్టలు, మిట్ట భూములు, అటవీ ప్రాంతాలపై ఆధారపడేవారు. ప్రభుత్వం నుంచి అవసరాన్ని బట్టి ఆయా చోట్ల తవ్వకాలకు అనుమతులు వచ్చేవి. కానీ మట్టి గుట్టలు, మిట్ట భూముల్లో మొరం తవ్వకాలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, అటవీ ప్రాంతాల్లో తవ్వకాలపై నిషేధం కఠినంగా అమలు చేస్తుండడంతో ఈజీగా దొరికే చెరువు మట్టిపై కాంట్రాక్టర్లు కన్నేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల సాయంతో ఇరిగేషన్ శాఖ నుంచి పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు. ఒకటీరెండు చెరువుల్లో మీటరు, మీటన్నర లోతు తవ్వకాలకు పర్మిషన్లు తెచ్చుకొని.. వందలాది చెరువులను పది మీటర్లదాకా తవ్వుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఇటుక బట్టీల యజమానులకు కూడా నామమాత్రపు రేట్లకు చెరువులను లీజుకిస్తున్నారు. రాష్ట్రమంతటా ఈజీఎస్ కింద చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఆ మట్టిని రైతుల పొలాలకు తరలించాల్సి ఉండగా, బీఆర్ఎస్ లీడర్లు టిప్పర్ల ద్వారా బయట బిల్డర్లు, రియల్టర్లు, ఇటుక బట్టీ యజమానులు, రోడ్డు కాంట్రాక్టర్లకు అమ్మి కోట్లు ఆర్జిస్తున్నారు. మహబూబ్​నగర్ సహా అనేక జిల్లాల్లో ఈ తరహా అక్రమ మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పాలమూరు జిల్లాలో ఒక్కో ట్రాక్టర్​మట్టిని రూ.2,500 నుంచి రూ.3 వేల దాకా అమ్ముకుంటున్న లీడర్లు.. ఎక్స్​కవేటర్లు వాడుతూ ఫిజికల్ కంపోనెంట్ కింద ఈజీఎస్​ ద్వారా బిల్లులు కూడా డ్రా చేసుకుంటున్నారు. 

రూల్స్‌‌‌‌ పట్టించుకుంటలే

రూల్స్ ప్రకారం.. చెరువుల్లో పూడిక మట్టిని మాత్రమే అది కూడా గడ్డపార, పార ఉపయోగించి కూలీల సాయంతో తీయాలి. ఈజీఎస్ కింద గతంలో ఇదే పద్ధతిలో పూడిక తీసేవారు. అలా తీసిన మట్టిని వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలి. చెరువు కట్ట నుంచి 30 ఫీట్ల దూరం వరకు ఎలాంటి తవ్వకాలు చేయవద్దు. 30 ఫీట్ల తర్వాత చెరువులో ఉన్న పూడిక మట్టిని ఏటవాలుగా 3, 4 ఫీట్ల లోతుకు మించకుండా ఒకే స్థాయిలో తీసుకుంటూ పోవాలి. ఇష్టం వచ్చినట్లుగా ఒకే దగ్గర లోతు తవ్వకూడదు. చెరువుల్లో ఒండ్రు తప్ప మట్టి, మొరం అసలే తవ్వకూడదు. ఒకవేళ మట్టి, మొరం తవ్వితే చెరువు గతి మారుతుందని, చెరువుల్లోని నీరు భూమిలోకి ఇంకిపోయి ఎండిపోతాయని ఇరిగేషన్ ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు.

పాలమూరు పేరుతో వందల చెరువులు బలి

పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నార్లపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్ కట్టల నిర్మాణం కోసం అవసరమైన మట్టిని మిషన్ భగీరథ కింద అభివృద్ధి చేసిన నోటిఫైడ్ చెరువుల నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. వట్టెం కట్ట కోసం నాగర్ కర్నూల్, బిజినేపల్లి మండలంలోని మూడు చెరువుల నుంచి మట్టి తీసేందుకు ఇరిగేషన్​డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పర్మిషన్ తీసుకుని వందల చెరువుల్లోని మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. ఒక్కో చెరువులో10 మీటర్ల లోతు దాకా అడ్డగోలుగా తవ్వేయడంతో ఏ చెరువు చూసినా గోతులమయమై కనిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ మండలంలో 36 చెరువులు, తిమ్మాజిపేట్ మండలంలో 9, తాడూర్‌‌‌‌‌‌‌‌లో 26, తెల్కపల్లిలో 32, మిడ్జిల్ మండలంలో 6, ఊర్కొండ మండలంలో 5 చెరువుల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తవ్వి వట్టెం, కర్వెన కట్టలకు తరలించారు.

రిజర్వాయర్లనూ వదలట్లే.. 

కరీంనగర్ పక్కనే ఉన్న లోయర్ ​మానేర్ డ్యామ్​ను కూడా అక్రమార్కులు వదలట్లేదు. ​ప్రజాప్రతినిధుల అండదండలతో గత ఆరు నెలలుగా రిజర్వాయర్​లోకి ఎక్స్​కవేటర్లను దింపి టిప్పర్ల ద్వారా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్​ బ్రిడ్జి పనులకోసం పర్మిషన్​ తీసుకున్నట్లు చెప్తున్నా ప్రైవేట్ గా అమ్ముకుంటున్నారు. బిల్డర్లకు, రియల్టర్లకు, ఇతర నిర్మాణదారులకు అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నా, ఇరిగేషన్​ ఆఫీసర్లు ఇటువైపు కన్నెత్తిచూడడం లేదు. ఒకవేళ తవ్వకాలకు పర్మిషన్​ ఉన్నా ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

చెరువులు తెగుతున్నయి.. 

చెరువు కట్ట నుంచి 30 ఫీట్ల దూరం వరకు ఎలాంటి తవ్వకాలు చేయవద్దని నిబంధనలు చెప్తున్నా ఇష్టారాజ్యంగా తవ్వడం వల్ల చెరువులు తెగిపోతున్నాయి. మహబూబ్​నగర్​ జిల్లా నవాబ్​పేట మండలం యన్మన్​గండ్ల పెద్ద చెరువును 2016లో 'మిషన్​ కాకతీయ' కింద  రూ.80 లక్షలతో డెవలప్​చేశారు. 2017లో వర్షాలు, వరదలు రావడంతో చెరువు పూర్తి స్థాయిలో నిండింది. కానీ 2020 ఎండకాలంలో చెరువు  నీళ్లు అడుగంటిపోయాయి. ఆటైంలో  జడ్చర్ల మండలంలో నిర్మిస్తున్న ఉదండాపూర్​ రిజర్వాయర్​కోసం కాంట్రాక్టర్​కు ఈ చెరువును అప్పగించారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంతో 2022లో వచ్చిన వరదలకు ఆగస్టు 9న తెగిపోయింది. మరో రూ.30 లక్షలతో రిపేర్లు చేసినా మళ్లీ అక్టోబర్​లో కురిసిన భారీ వర్షానికి కొట్టుకపోయింది.

ఇది మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని పెద్ద చెరువు. ప్రస్తుతం ఈ చెరువును మినీ ట్యాంక్ బండ్‌‌‌‌గా డెవలప్​ చేస్తున్నారు. రూల్స్ ప్రకారం చెరువులోని ఒండ్రుమట్టిని తోడి, రైతుల పొలాలకు ఫ్రీగా తరలించాలి. కానీ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్.. రెండు నెలలపాటు పది ఎక్స్​కవేటర్లు, 40 టిప్పర్ల ద్వారా చెరువులోని మట్టిని తరలించాడు. రైతుల పొలాలకు కాకుండా మహబూబ్​నగర్, హన్వాడ మండలాల శివార్లలోని ఇటుక బట్టీలకు అమ్ముకొని భారీగా సంపాదించాడు. అక్రమంగా మట్టి తవ్వి అమ్ముకున్నా ఆఫీసర్లు మాత్రం పట్టించుకోలేదు.

ఇది వనపర్తి జిల్లా శ్రీరంగాపురం తాటిపాముల గ్రామంలోని వీరసముద్రం చెరువు. కొందరు లీడర్లు కొద్దినెలల కిందట చెరువులోని మొరం మట్టిని తవ్వి అమ్ముకున్నారు. ఆ టైంలో చెరువులో దాదాపు 15 ఫీట్ల లోతు వరకు గోతులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో చెరువులో బట్టలు ఉతికేందుకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు వెళ్లారు. బండపై బట్టలు ఉతుకుతుండగా సబ్బు చెరువులో పడిపోయింది. ఆ ప్రాంతంలో పెద్ద గోతి ఉండటం, ఆ విషయం తెలియకపోవడంతో సబ్బు తీసేందుకు వెళ్లి ఒకరి తర్వాత ఒకరు చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందారు.

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట గ్రామానికి చెందిన అల్లంవారి కుంట చెరువు ఇది. దీని కింద 25 ఎకరాలు సాగవుతోంది. గుడెప్పాడ్‌‌‌‌‌‌‌‌ నుంచి చెల్పూర్‌‌‌‌‌‌‌‌ వరకు రూ.112 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనుల కోసం కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ కు ఈ చెరువును అప్పగించారు. దీంతో జేసీబీలు పెట్టి  సుమారు 10 నుంచి 15 ఫీట్ల లోతు వరకు కట్ట దగ్గరి వరకు తవ్వుకుంటూ పోయారు. దీంతో గడిచిన కొన్నేళ్లుగా భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువు నిండుతున్నా ఉన్నట్టుండి కొద్ది రోజులకే  చెరువు ఎండిపోతోందని రైతులు చెప్తున్నారు.

ఇటుక బట్టీలకు పర్మిషన్లు

కొన్ని జిల్లాల్లోని చెరువులను ఇటుక బట్టీల యజమానులకు ఏడాది కాలానికి లీజుకిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో గడిచిన మూడు నాలుగు ఏండ్లుగా కలెక్టర్ ఆధ్వర్యంలోనే లీజు వ్యవహారం నడుస్తున్నది. గతేడాది పెద్దపల్లి జిల్లాలోని  రాఘవాపూర్, పెద్దబొంకూర్, కొత్తపల్లి, కొలనూర్ తదితర కొన్ని చెరువులకు అఫీషియల్​గా లీజుకు ఇవ్వగా, ఈ ఏడాది మరో పది చెరువులు లీజుకిచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. మెట్రిక్ టన్నుకు రూ. 37 దాకా వసూలు చేస్తున్నట్లు చెప్తున్నారు. కాగా, అఫీషియల్​​లీజును అడ్డుపెట్టుకొని వందలాది చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వి ఇటుక బట్టీలకు అమ్ముకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రూలింగ్​పార్టీకి చెందిన పలువురు లీడర్ల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. పెద్దబొంకూర్ చెరువులో మట్టి తవ్వకాల వల్ల చెరువు ఎండిపోతోందంటూ గ్రామస్థులంతా లారీలకు అడ్డం పడుకోవాల్సి వచ్చిందనే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అక్కడి బీజేపీ లీడర్ గొట్టిముక్కుల సురేష్​రెడ్డి..  మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు కంప్లయింట్ చేయగా, ఉన్నతాధికారులు ఎంక్వైరీకి ఆదేశించారు. ఇప్పటికీ ఆ నివేదికను బయటపెట్టలేదు.