పల్లె ప్రకృతి వనాలు ఎండుతున్నయ్!

పల్లె ప్రకృతి వనాలు ఎండుతున్నయ్!

మహబూబ్​నగర్​, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌తో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి.  వీటిని రెండేళ్ల పాటు ఎన్ఆర్ఈజీఎస్​ఫండ్స్‌‌‌‌‌‌‌‌తో వీటిని మెయింటేన్‌‌‌‌‌‌‌‌ చేయగా.. ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు హ్యాండోవర్​ చేశారు.  కానీ, రాష్ట్ర సర్కారు పల్లెప్రకృతి వనాల నిర్వహణ కోసం ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదు. సర్పంచులు సొంత డబ్బులు పెడదామన్నా.. పాత బిల్లులకే మోక్షం లభించట్లేదు. దీంతో ఏడాది కింద వరకు పచ్చగా కళకళలాడిన పల్లె ప్రకృతి వనాలు.. ప్రస్తుతం ఎండిన మొక్కలతో దర్శనం ఇస్తున్నాయి. 

మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్​ లేవ్​

మహబూబ్​నగర్​ జిల్లాలోని 441 గ్రామ పంచాయతీల పరిధిలో 704 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఎన్​ఆర్​ఈజీఎస్​ ఫండ్స్​ ద్వారా ఇందులో ఎకరా విస్తీర్ణంలో ఉన్న వాటికి రూ.6.9 లక్షలు, ముప్పావు ఎకరాలో ఉన్న వాటికి రూ.5.5 లక్షలు, అర ఎకరాలో ఉన్న వాటికి రూ.4.42 లక్షలు ఖర్చు చేశారు.  వీటిలో మొత్తం 14 రకాలకు చెందిన 18.25 లక్షల మొక్కలను నాటారు.  మొదటి రెండేళ్లు ఎన్ఆర్ఈజీఎస్​ కింద మెయింటేన్ చేయగా,  గతేడాది నుంచి వీటి నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించారు.  మొదట్లో సర్పంచ్‌‌‌‌‌‌‌‌, పంచాయతీ కార్యదర్శి ప్రతి శుక్రవారం మల్టీపర్పస్​ వర్కర్లు, జీపీ సిబ్బందితో  నీళ్లు పట్టించారు.  కానీ, సర్కారు ట్యాంకర్లకు డీజిల్​బిల్లులు చెల్లించలేదు. మల్టీపర్పస్ వర్కర్లు, జీపీ సిబ్బందికి జీతాలు కూడా ఐదునెలలుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టింది.  

పెట్రోల్ బంకుల్లో ఉద్దెరకు డీజిల్​పోయట్లే..

పీపీవీలకు జీపీ ట్రాక్టర్ల ద్వారా వాటర్​ సఫ్లై చేసేవారు. ఇన్నాళ్లు ప్రతి వారం పెట్రోల్​బంక్​వద్దకు వెళ్లి ఉద్దెరకు డీజిల్​ పట్టించుకునే వారు. కానీ, ఏడాదిన్నరగా ట్రాక్టర్లకు డీజిల్​బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. ఈ విషయం తెలిసి పెట్రోల్​ బంకుల యజమానులు ఉద్దెరకు డీజిల్​ పోయడం లేదు. దీంతో  జీపీ సిబ్బంది ట్రాక్టర్లకు బయటకు తీయడం లేదు.  పీపీవీలే కాదు చాలాచోట్ల  నర్సరీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 

మెటీరియల్​ కాంపోనెంట్​ బిల్లులు చేయట్లే..

కొద్ది రోజుల కింద స్టేట్​నుంచి జీపీలకు మెటీరియల్​ కాంపోనెట్​ బిల్లులు మంజూరు కానున్నాయని జిల్లా స్థాయి ఆఫీసర్లు ప్రకటించారు. అయితే, ఆ బిల్లులు క్లియర్​ కాలేదు. ఉదాహరణకు భూత్పూర్​ మండలానికి సంబంధించి కాంపోనెంట్​ బిల్లు రూ.59 లక్షలు ఉంటే, అందులో కేవలం 
రూ.లక్ష  మాత్రమే క్లియర్ చేశారు. అది కూడా ఆ బిల్లులో అన్ని రూ.వెయ్యి, రూ.2 వేలు, రూ.3 వేలు పనులకు సంబంధించినవే ఉన్నాయి.   జిల్లా వ్యాప్తంగా పెద్ద మండలాలకు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు.. చిన్న మండలాలకు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు బిల్లులు చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు.

మొక్కలకు నీళ్లు పట్టాలని చెబుతున్నాం..

పల్లె ప్రకృతి వనాలను రెండేళ్ల కిందటే జీపీలకు అప్పగించాం. జీపీల ఆధ్వర్యంలో అక్కడి మొక్కలను నీళ్లు పట్టి సంరక్షించాలని సూచించాం. దాని ప్రకారమే పీపీవీల్లో మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. ఎక్కడైనా మొక్కలను నీళ్లు పట్టకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

–రూపేందర్​రెడ్డి, ఎంపీడీవో, గండీడ్

సెక్రటరీకి మెమో జారీ చేశాం

పీపీవీల మొయింటెనెన్స్‌‌ బాధ్యత గ్రామ పంచాయతీలది. మరికల్‌‌‌‌‌‌‌‌ పీపీవీలో నీళ్లు లేక మొక్కలు ఎండిపోయిన విషయం మా దృష్టికి రెండు రోజుల కింద వచ్చింది.  దీనిపై వివరణ ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీకి మెమో జారీ చేశాం.
–లత, ఎంపీడీవో, నవాబ్​పేట