ఉక్రెయిన్‌పై రష్యా వార్.. భారత్‌పై ప్రభావమెంత?

ఉక్రెయిన్‌పై రష్యా వార్.. భారత్‌పై ప్రభావమెంత?

కొద్ది రోజులుగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించి.. ఉద్రిక్తతలను సృష్టించిన రష్యా ఇప్పుడు డైరెక్ట్ వార్ డిక్లేర్ చేసింది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై రష్యన్ ఆర్మీ దాడికి దిగింది. ఇప్పటికే రాజధాని కీవ్ లోని ఎయిర్ పోర్ట్ సహా దాదాపు 10కి పైగా సిటీల్లోకి రష్యన్ బలగాలు ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో యూఎన్ భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైన.. రష్యా దాడులను ఆపాల్సిందిగా కోరింది. అయితే రష్యా మాత్రం తమ దాడులు.. ఉక్రెయిన్ ప్రజలకు సొంత దేశ ఆర్మీ నుంచి రక్షణ కల్పిచడం కోసమేనని, తాము ప్రజలపై ఎక్కడా అటాక్ చేయడం లేదని, ఉక్రెయిన్ ఆర్మీనే టార్గెట్ చేశామని స్పష్టం చేసింది. రష్యా మొండిగా ముందుకు వెళ్తుండడంతో అమెరికా, నాటో దేశాలు ఆ దేశ వైఖరిని తప్పుబట్టాయి. తాము ఉక్రెయిన్ కు అండగా నిలుస్తామని చెప్పాయి. ఈ యుద్ధంలో రష్యా వైపు నిలుస్తామని చైనా చెబుతోంది. భారత్ మాత్రం తటస్థ వైఖరిని ఎంచుకుంది. రెండు దేశాలు సంయమనం పాటించి.. శాంతిని నెలకొల్పాలని కోరింది. భారత్ నేరుగా ఈ యుద్ధ రంగంలోకి అడుగు పెట్టే చాన్స్ లేదని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. మన దేశంపై ఈ వార్ ప్రభావం పడుతుందనడంలో అనుమానం లేదు. మన ఎకానమీపై మేజర్ ఇంపాక్ట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మన వంటింటిపై ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. 

సామాన్యుడి జేబుకు చిల్లు

ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడబోతోందని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వంట నూనె రేట్లు చాలా పెరుగుతాయంటున్నారు. అలాగే పెట్రో ఉత్పత్తులు, వంట గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయని, ఈ పరిణామాలతో సామాన్యుడి జేబుకు చిల్లుపడడం ఖాయమని చెబుతున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో మొదటిది మన దేశానికి వస్తున్న సన్ ఫ్లవర్ ఆయిల్  దిగుమతుల్లో దాదాపు 90 శాతం వరకు రష్యా, ఉక్రెయిన్ల నుంచే. మన దేశంలో ఎక్కువ మంది వాడే వంట నూనెల్లో మొదటి స్థానం పామాయిల్ ఉంటే, రెండో స్థానం సన్ ఫ్లవర్ ఆయిల్ దే.

ఉక్రెయిన్ 70 శాతం.. రష్యా 20 శాతం

మన దేశం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలు ఎంత మేరకు ఉన్నాయన్న దానిపై నిపుణులు చెప్పేది సామాన్యులకు ఆందోళన కలిగించే ఆస్కారం ఉంది. ఇండియాలో మనం వాడే మొత్తం వంట నూనె ఉత్పత్తుల్లో 60 శాతం వరకు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ దేశాయ్ తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం ఉక్రెయిన్, రష్యా దేశాలపైనే ఆధారపడుతున్నాం. దిగుమతుల ద్వారా సమకూర్చుకునే సన్ ఫ్లవర్ ఆయిల్ లో 70 శాతం ఉక్రెయిన్ నుంచి, 20 శాతం రష్యా నుంచి వస్తోంది. మరో పది శాతం దిగుమతులను అర్జెంటినా నుంచి చేసుకుంటున్నాం. 

ఫిబ్రవరిలో సున్నా

2021లో మన దేశం ఒక్క ఉక్రెయిన్ నుంచే 1.89 మిలియన్ టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంది. ప్రతి నెలా సగటున రెండు మూడు లక్షల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఈ రెండు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని సుధాకర్ దేశాయ్ చెప్పారు. అంటే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్దంతో భారత్ వచ్చే దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. సరిహద్దుల్లో ఉద్రికత్త వాతావరణం మొదలైన తర్వాత ఫిబ్రవరి నెలలో సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఒక్క షిప్మెంట్ కూడా మన దేశానికి రాలేదు. లక్షల టన్నుల్లో రావాల్సిన వంట నూనె దిగుమతి నిలిచిపోయింది. ప్రస్తుత పరిస్థితి మరో రెండు మూడు వారాలు కొనసాగితే.. భారత్ లో వంట నూనె నిల్వలు అడుగంటి రేట్లు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని సుధాకర్ దేశాయ్ చెబుతున్నారు.

పెట్రోల్, గ్యాస్ రేట్లూ పెరుగుతయ్

  • - ఉక్రెయిన్, రష్యా మధ్య వార్ వల్ల మన దేశంలో వంట నూనెలే కాదు పెట్రోల్, గ్యాస్ రేట్లు కూడా పెరుగుతాయి. అలాగే ఫార్మా రంగంపైనా పెను ప్రభావం పడనుంది.
  • - భారత్ కు వచ్చే లిక్విడ్ నేచురల్ గ్యాస్ లో దిగుమతుల్లో 50 శాతం ఉక్రెయిన్ నుంచే. మరికొంత మొత్తం రష్యా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు గ్యాస్ దిగుమతులు ఆగిపోవడంతో మరికొద్ది రోజుల్లోనే రేటు పెరిగే చాన్స్ ఉందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
  • - క్రూడాయిల్ రేట్లు భారీగా పెరుగతాయి. ఉక్రెయిన్, రష్యా క్రైసిస్ మొదలైన కొద్ది నెలల్లోనే అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు బ్యారెల్ కు 4 శాతం చొప్పున పెరిగాయి. దాదాపు 100 డాలర్లకు బ్యారెల్ రేటు చేరుకుంది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరగబోతున్నాయని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఈ పెంపు ఉండబోతోందని చెబుతున్నారు.
  • - ఫార్మా రంగంపైనా ఈ యుద్ధం ప్రభావం పడనుంది. ఉక్రెయిన్ కు భారత్ అతి పెద్ద ఫార్మాస్యూటికల్ ఎక్స్ పోర్టర్. జర్మనీ, ఫ్రాన్స్ తర్వాత మన దేశం నుంచే ఫార్మా ఉత్పత్తులను ఉక్రెయిన్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అంతేకాదు రాన్ బాక్సీ, సన్ గ్రూప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరెటరీస్ కంపెనీలకు ఉక్రెయిన్ లో ఫార్మాస్యుటికల్ తయారీ యూనిట్లు కూడా ఉన్నాయి. ఆ దేశంలో భారత్ కు చెందిన ఈ కంపెనీలపై పడే ప్రభావం ఇక్కడా కనిపించొచ్చు. ఆర్థికంగా ఈ కంపెనీలు సతమతమైతే.. దాని ఇంపాక్ట్ మన దేశంలో అమ్ముడయ్యే మందులపైనా పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.