ఉక్రెయిన్ కు అమెరికా క్లస్టర్ బాంబు.. రష్యా నాశనం అవుతుందా.. ఈ బాంబు ప్రత్యేకతలు ఏంటీ?

ఉక్రెయిన్ కు అమెరికా క్లస్టర్ బాంబు.. రష్యా నాశనం అవుతుందా.. ఈ బాంబు ప్రత్యేకతలు ఏంటీ?

రష్యా- ఉక్రెయిన్ యుద్దం మొదలై మరి కొన్ని రోజుల్లో 500 రోజులు పూర్తి కావస్తున్నా.. ఆ రెండు దేశాల మధ్య బాంబులు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. ఆ యుద్దానికి మరింత ఆజ్యం పోస్తున్నట్టుగా ఇటీవల అమెరికా చేసిన ప్రకటన మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే 100 ప్రపంచ దేశాలు నిషేధించిన కస్టర్ బాంబులను ఉక్రెయిన్ యుద్దరంగంలోకి పంపాలని అమెరికా నిర్ణయించుకుంది. తాజాగా ఆ కస్టర్ బాంబులు ఉక్రెయిన్ కు చేరినట్టు తెలుస్తోంది. అయితే ఇంతకీ కస్టర్ బాంబులు అంటే ఏమిటి.. వాటి వల్ల దేశాలు కూడా  నాశనం అవుతాయా.. అంతటి శక్తి వాటికుందా అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

యుద్దంలో రష్యాను ఎలాగైనా కట్టడి చేయాలన్న ఉద్దేశంతో ఉక్రెయిన్‌ కు ఆయుధాలు సమకూర్చే భారాన్ని నెత్తిన వేసుకుంది అమెరికా.. ఈ యుద్ధం ప్రత్యక్షంగా రష్యా- ఉక్రెయిన్ ల మధ్య అయితే పరోక్షంగా మాత్రం రష్యా- అమెరికా దేశాల మధ్య జరుగుతుందని చెప్పవచ్చు. అమెరికా నిర్ణయాన్ని మానవ హక్కుల సంఘాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్లస్టర్ బాంబులతో పౌర సమాజానికి ఎక్కువ నష్టం జరుగుతుందని.. విచక్షణారహితంగా జరిగే ఈ దాడులతో చాలామంది మరణించే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నాయి. యుద్ధంలోనే కాదు.. యుద్ధానంతరం పేలే ఈ బాంబులతో ఎక్కువ నష్టమే జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి.

క్లస్టర్ బాంబులతో ఉన్న ఇబ్బందేంటంటే..

క్లస్టర్ ఆయుధాలనేవి గాల్లోకి వెదజల్లినట్టుగా ముక్కలు ముక్కలుగా విడిపోయి ఒకే సమయంలో ఉద్దేశించిన ప్రాంతాల్లో దాడులు చేస్తాయి. ఫిరంగుల ద్వారా దాదాపు 24 నుంచి 32 కిలో మీటర్ల మేర ఉండే లక్ష్యాలను సైతం ఈ బాంబులు ఛేదించగలవు, ఇలా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి లక్ష్యాన్ని చేరే క్రమంలోనే భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కస్టర్ ఆయుధాలతో ఉన్న మరో పెద్ద సమస్య ఏంటంటే.. వీటిలో కొన్ని లక్ష్యాన్ని చేరినప్పటికీ పేలవు. కొంత కాలం తర్వాత పేలతాయి. అంటే అవి ఎప్పుడు పేలుతాయో కూడా స్పష్టంగా చెప్పలేం. ఒకవేళ ఏదైనా కారణాల చేత యుద్దం ఆగిపోయినా.. ఆ ప్రదేశంలో కొంత కాలం తర్వాత ఆ ముక్కలు పేలే ప్రమాదం ఉంటుందన్న మాట. ఇంతటి నష్టం ఉంటుంది కాబట్టే 2008లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 120దేశాలు ఈ కస్టర్ ఆయుధాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించాయి. ఆ సమయంలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మాత్రం ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ నిషేధానికి సంబంధించిన ఒప్పందంపై అవి ఎలాంటి సంతకాలు చేయలేదు. ఆ తర్వాత సిరియా.. తమ ప్రత్యర్థి వర్గంపై ఇవే ఆయుధాలతో దాడులకు దిగగా.. అమెరికా కూడా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన యుద్దంలోనూ వాటిని ఉపయోగించింది. ఇదే తరహాలో 2006లో లెబనాన్ యుద్దంలో ఇజ్రాయిల్ కూడా దాదాపు 40 లక్షల కస్టర్ బాంబులను ప్రయోగించిందని ఐక్యరాజ్య సమితి ఆరోపించింది. అందులో కొన్ని ఇప్పటికీ పేలుతూ.. నష్టాన్ని కలిగిస్తున్నాయని లెబనాన్ ప్రజలు చెబుతుంటారు.

800 మిలియన్ డాలర్ల మిలిటరీ ప్యాకేజీలో భాగంగా అమెరికా, ఉక్రెయిన్ కు ఈ క్లస్టర్ బాంబులను సాయంగా పంపుతామని బైడెన్ ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది. ఇప్పటికే దాడులను తీవ్రతరం చేసిన రష్యాపై ఈ బాంబులు ప్రయోగించడం సరైందేనని అమెరికా భావిస్తోంది. కాబట్టి రష్యాను ఎదుర్కొనేందుకు ఇది చాలా మంచి నిర్ణయమని అనుకుంటోంది. కానీ వీటి వల్ల ప్రస్తుతం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా.. యుద్ధానంతరం కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు ఆందోళనం వ్యక్తం చేస్తున్నారు.