అణ్వాయుధ మిసైల్స్ ను టెస్ట్ చేస్తున్నం

అణ్వాయుధ మిసైల్స్ ను టెస్ట్ చేస్తున్నం
  • మరియుపోల్ స్టీల్​ ప్లాంట్​లోకి రష్యా సోల్జర్లు చొచ్చుకెళ్లారన్న ఉక్రెయిన్
  • లోపలున్న వారిని చంపాలని చూస్తున్నారంటూ ఆరోపణ
  • ప్లాంటులోకి వెళ్లలేదని, తమ సేనలు ఇంకా వేచి ఉన్నాయన్న రష్యా  

లవీవ్(ఉక్రెయిన్): మరియుపోల్ సిటీలో ఉన్న అజోవ్ స్టల్ స్టీల్ ప్లాంటు నుంచి ఒకవైపు ప్రజల తరలింపు కొనసాగుతుండగా.. మరోవైపు రష్యన్ బలగాలు ఆ ప్లాంటులోకి చొచ్చుకెళ్లాయని ఉక్రెయిన్ వెల్లడించింది. స్టీల్​ ప్లాంట్ లో ఉన్న వారందరినీ చంపేందుకు రష్యన్ సైనికులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. స్టీల్ ప్లాంట్ పై దాడులకు సంబంధించి రష్యా మాట తప్పిందని ఉక్రెయిన్​ కమాండర్ ఒకరు అన్నారు. అయితే ఉక్రెయిన్ ఆరోపణలను రష్యా ఖండించింది. తమ బలగాలు ప్లాంట్​లోకి చొచ్చుకెళ్లాయనేది అబద్ధమని, అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు తమ సైనికులు ఇంకా వేచి చూస్తున్నారని స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్ లో నుంచి పౌరులను తరలించే మానవతా కారిడార్లు ఇంకా పనిచేస్తున్నాయని తెలిపింది. ప్లాంట్​లోకి చొచ్చుకెళ్లడం లేదని స్పష్టం చేసింది. మరియుపోల్ మొత్తం రష్యా వశమైనా.. ఒక్క అజోవ్​స్టల్ స్టీల్ ప్లాంట్ మాత్రం ఇంకా ఉక్రెయిన్ సేనల అధీనంలోనే ఉన్న సంగతి తెలిసిందే. ప్లాంట్​లోని బంకర్లు, టన్నెల్స్​లో తలదాచుకున్న రెండు వేల మంది ఉక్రెయిన్ డిఫెండర్లు, సోల్జర్లు ఇంకా పోరాటం కొనసాగిస్తున్నారు. మరోవైపు  మరియుపోల్ నుంచి 300 మంది పౌరులను సమీపంలోని నాలుగు గ్రామాలకు తరలించినట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 

ఫండ్ రైజింగ్ ప్లాట్​ఫామ్ ఏర్పాటు

యుద్ధంలో ఉక్రెయిన్ కు సహాయం అందజేసేందుకు వీలుగా అంతర్జాతీయ ఫండ్​ రైజింగ్ ప్లాట్​ఫామ్​ను ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్​స్కీ ప్రారంభించారు. దీని ద్వారా తమ దేశానికి సాధ్యమైనంత సహాయం అందించాలని ఆయన కోరారు. ఉక్రెయిన్​లో మానవతా సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో పాటు యుద్ధంలో గెలవడానికి ఈ నిధులను ఉపయోగిస్తామన్నారు.  

అణ్వాయుధ మిసైల్స్ ను టెస్ట్ చేస్తున్నం: రష్యా 

అణ్వాయుధాలను మోసుకెళ్లగల మిస్సైల్స్​ను తమ బలగాలు పరీక్షిస్తున్నాయని రష్యా వెల్లడించింది. కలినింగ్​గార్డ్​ ప్రాంతంలో ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. ఉక్రెయిన్​తో యుద్ధం కొనసాగుతుండటం, ఇప్పటికే అణు బాంబుల ప్రయోగానికీ వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించిన నేపథ్యంలో అణ్వాయుధాలతో రిహార్సల్స్ కూడా జరుపుతుండటం ఆందోళనకరంగా మారింది. ఉక్రెయిన్​కు విదేశాలు ఆయుధాలు సమకూర్చడం వల్లే ఈ సంక్షోభానికి ముగింపు ఆలస్యమవుతోందని రష్యా రక్షణ శాఖ తెలిపింది.