ఒక పుస్తకం వందమంది స్నేహితులకు సమానం..ఇది అబ్దుల్ కలాం లెక్క

ఒక పుస్తకం వందమంది స్నేహితులకు సమానం..ఇది అబ్దుల్ కలాం లెక్క

ఆరో తరగతి విద్యార్థులు పుట్టిన రోజున కేక్, చాక్​లెట్స్​ని స్కూలుకి తీసుకొచ్చి క్లాస్‌లో అందరికి పంచుతుంటారు. ఆ రోజు రుత్వీ పుట్టిన రోజు. ఆమె  అందరిలా కాకుండా ఒక ఖరీదైన పెన్ బాక్స్ తీసుకొచ్చింది. దాన్ని తన స్కూల్ బ్ బ్యాగ్ నుంచి తీసి క్లాస్ టీచర్​ వెంకటరమణకు ఇస్తూ ‘‘మాస్టారూ.. ఈ సారి నా పుట్టిన రోజుకు కేక్, చాకోలెట్లకు బదులుగా ఒక పెన్ బాక్స్ తీసుకొచ్చాను. మీరే ఏదైనా పరీక్ష పెట్టి అందులో గెలిచినవారికి ఈ బహుమతి ఇవ్వండి” అంది. 

రుత్వీ ఆలోచనను మెచ్చుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు వెంకటరమణ. ఆ తరువాత పిల్లలూ శుభాకాంక్షలు చెప్పారు.

మీకు ఈ రోజు అబ్దుల్ కలాం లెక్క చెప్తాను. ఆ లెక్క సరిగ్గా చేసిన వారికి ఈ పెన్ బాక్స్ బహుమతిగా ఇస్తాను’’ అన్నాడు వెంకటరమణ.

బోర్డు మీద1 --= 100 --అంటూ రాశాడు.

‘‘ఒకటి వందకు సమానమని రాశాను. ఇది అబ్దుల్ కలాం గారి లెక్క. ఒకటి పక్కనున్న ఖాళీని, వంద పక్కనున్న ఖాళీని పూర్తి చెయ్యాలి. అబ్దుల్ కలాం గారి లెక్క ప్రకారం సరిగ్గా చెప్పిన వారికి బహుమతి’’ అన్నాడు.

‘‘ఒక రూపాయి వంద పైసలకు సమానం’’ అన్నాడు అరవింద్.

‘‘నీ సమాధానం సరియైనదే. కానీ,  కలాం గారి లెక్క అది కాదు’’ అన్నాడు వెంకటరమణ. 

‘‘ఒక మీటరుకు వంద సెంటీమీటర్లు’’ అన్నాడు గోపి.

కాదన్నట్లుగా వెంకటరమణ  తలాడించాడు.

అందరూ కాసేపు అలోచించిన తరువాత కొంతమంది తమకు తోచింది చెప్పారు.

అది కాదని చెప్పాడు రమణ.

‘‘సార్ నేను చెబుతాను’’ అంటూ సమాధానం చెప్పాడు అద్విక్.

‘‘అద్విక్, నువ్వు చెప్పింది సరైన సమాధానం’’ అంటూ వెంకటరమణ చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు.  

‘‘ఈ సమాధానం నీకెలా తెలుసు’’ అడిగాడు. 

‘‘మన బడి గ్రంథాలయంలో పుస్తకాలు తీసుకెళ్లి ఆదివారాలలో చదువుతాను సార్. ఒక నెల ముందే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పుస్తకం చదివాను. అందులో ఆ లెక్క ఉంది’’ అన్నాడు అద్విక్.

‘‘పిల్లలూ, కలాం గారు చెప్పిన లెక్క మీకు అర్థమైఉంటుంది. ఒక పుస్తకం వందమంది స్నేహితులకు సమానం అని చెప్పారు. పుస్తకాలు మంచి స్నేహితులు. మహానుభావుల జీవిత చరిత్ర పుస్తకాలు చదివి వారి అడుగుజాడలలో నడిస్తే గొప్పవారు అవుతారు’’ అన్నాడు వెంకటరమణ.

అప్పటికే పిల్లలలో పుస్తకాలు చదవాలన్న ఆలోచన కలిగింది.

“రుత్వీ నీ చేతులతో ఆ పెన్ బాక్స్ అద్విక్ చేతికి ఇవ్వమ్మా” అన్నాడు వెంకటరమణ.    

- ఓట్ర ప్రకాష్ రావు