రైతుబంధు పైసలు కల్లంలనే ఖతం అయితున్నయ్

రైతుబంధు పైసలు కల్లంలనే ఖతం అయితున్నయ్
  • రైతుబంధు పైసలు కల్లంలనే ఖతం
  • తరుగు, తేమ పేరిట దోపిడీ  
  • వడ్లు ఆరపోయడానికే వేల ఖర్చు 
  • ధాన్యం మీద కప్పేటార్పాలిన్ల భారం రైతుదే   
  • హమాలీల ఖర్చు కూడా భరించాల్సిందే  
  • కాంటా ఖర్చు కేంద్రం ఇస్తున్నా రైతులపైనే భారం  
  • పండించుడు కంటే అమ్ముడే కష్టమైతుందంటున్న రైతులు

హైదరాబాద్, వెలుగు:  సర్కార్ ఇస్తున్న రైతుబంధు పైసలు.. పంటను అమ్ముకోవడానికి కూడా సరిపోవడం లేదు. సర్కార్ ఎకరానికి రూ.5 వేలు ఇస్తుంటే.. పంట కోసినప్పటి నుంచి కాంటా అయ్యేలోగా రైతుకు అంతకుమించే ఖర్చు అవుతోంది. పైగా ఆరుగాలం పంటను పండించడం కంటే, అమ్ముకోవడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల వల్ల పంట సీజన్‌ను ఒక నెల ముందుకు జరుపుతామని ఇటీవల వ్యవసాయశాఖ అధికారులు, ప్రభుత్వ పెద్దలు పరోక్ష ప్రకటనలు చేశారు. వాస్తవానికి, పంట సీజన్‌ ను చాలా మంది రైతులు ముందే మొదలు పెడుతున్నారు. కొన్ని చోట్ల ఫిబ్రవరి చివరి నుంచి కొన్నిచోట్ల మార్చి ఫస్ట్ వీక్ నుంచే కోతలు మొదలవుతున్నయి. అయితే, ఆ సమయానికి వడ్ల కొనుగోలును సర్కార్ ప్రారంభించడం లేదు. దీంతో రైతులు అమ్మేందుకు తెచ్చిన వడ్లన్నీ మార్కెట్‌లో రోజుల తరబడి ఉంటున్నాయి. తేమ పేరిట దోపిడీ చేస్తుండడంతో, వాటిని మార్కెట్‌లోనే నాలుగైదు రోజులు ఆరబెడుతున్నారు. ఒక్క ఎకరం వడ్లను ఆరబెట్టి, సాయంత్రానికి మళ్లీ వాటిని కుప్పగా పోయడానికి రైతు కనీసం ఓ ఐదొందలు కూలీలకు ఇవ్వాల్సి వస్తోంది. రెండ్రోజులు ఆరపోసినా వెయ్యి ఖర్చు తప్పదు. ఈలోగా వర్షం వచ్చి వడ్లు తడిస్తే, ఆరపోయడానికి అయ్యే ఖర్చే రూ.2 వేలు దాటుతోంది. ఇది చాలదన్నట్టు వడ్లల్లో తాలు, పొట్టు ఉన్నాయని వాటిని తూర్పార పట్టిస్తున్నారు. తూర్పార పట్టేందుకు అవసరమైన మిషన్లను మార్కెట్ నిర్వాహకులే సమకూరుస్తున్నా, వడ్లు ఎత్తి ఆ మిషన్‌లో పోయడానికి కనీసం ఒకరిద్దరు కూలీల అవసరం పడుతోంది. దీనికి ఇంకో రూ.వెయ్యి ఖర్చు అవుతోంది.  

క్వింటాకు రూ.43 హమాలీ ఖర్చు   

వడ్లు కాంటా పెట్టడానికి హమాలీలకు అయ్యే ఖర్చును కూడా రైతులే భరించాల్సి వస్తోంది. ఈ సీజన్‌లో క్వింటాకు రూ.43 చొప్పున రైతుల వద్ద వసూలు చేస్తున్నారు. ఎకరానికి 25 క్వింటాళ్లు పండించిన రైతుకు, రూ.వెయ్యికిపైగా హమాలీల ఖర్చే అవుతోంది. ప్రస్తుతం ఈ డబ్బులు కాకుండా నాలుగైదు ఎకరాలు పండించిన రైతు దగ్గర్నుంచి నయానో, భయానో మార్కెట్‌లో పనిచేసే స్వీపర్లు, ఇతర సిబ్బంది 20 నుంచి 40 కిలోల వడ్లు తీసుకుంటున్నారు. గతంలో ఇట్ల కూ  డా రూ.500 నుంచి వెయ్యి నష్టం వాటిల్లుతోంది. వాస్తవానికి, వడ్లు కాంటా పెట్టడానికి అయ్యే ప్రతి రూపాయి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. అయినా, మళ్లీ హమాలీల పేరిట రైతుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నా, రాష్ట్ర సర్కార్‌‌ మాత్రం పట్టించుకోవట్లేదు.  

తూకం పేరిట దోపిడీ 

గతంలో 70 కిలోల బస్తాలతో కాంటా పెట్టేవాళ్లు. ఇప్పుడు 40 కిలోల బస్తాలతో కాంటా పెడుతున్నారు. కానీ, 40 కిలోలు జోకాల్సిన స్థానంలో తరుగు, తేమ పేరిట ఒకట్రెండు కిలోలు అదనంగా జోకుతున్నారు. ఎకరాకు 60 బస్తాలు పండించిన రైతు, అర్ద క్వింటా నుంచి క్వింటా వరకూ తరుగు దోపిడీకి గురవుతున్నాడు. క్వింటా వడ్ల ధర ప్రస్తుతం రూ.2,060 ఉంది. వీటన్నింటికీ మించి రైతు శారీరక, మానసిక శ్రమకు గురవుతుండడం మరింత దారుణంగా ఉంది. పొలం కాడికి రెండు, మూడు రోజులకు ఓసారి పోయిన నడుస్తది. కానీ, మార్కెట్‌లో ఉన్న వడ్లను కాపాడుకోవడానికి ప్రతి రోజూ రైతు పొద్దంతా మార్కెట్‌లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. కనీసం పది, ఇరవై రోజులు తిరగక తప్పుతలేదు.

ఐకేపీ కేంద్రాల్లో గోస

వ్యవసాయ మార్కెట్‌లలో కాకుండా, ఐకేపీ సెంటర్లలో వడ్లను అమ్మకానికి పెడుతున్న రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మార్కెట్లలో వడ్ల మీద కప్పుకోవడానికి కొన్ని చోట్ల టార్పాలిన్లు ఇస్తున్నారు. ఐకేపీ సెంటర్లలో మాత్రం వట్టి నేల మీద వడ్లు పోయలేక రైతులే పరదలు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఒక్కో పరద ఖరీదు ప్రాంతాన్ని బట్టి రోజుకు రూ.20 నుంచి 30 వరకూ ఉంది. నాలుగు పరదలు అద్దెకు తెచ్చుకుంటే, రోజుకు వంద రూపాయలు వీటికే ఖర్చు అవుతోంది. అలాగే వడ్ల కుప్పలపై కప్పేందుకు టార్పాలిన్ లు కూడా అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఐకేపీ అయినా, మార్కెట్‌ అయినా వడ్లు కాంటా అయ్యే నాటికి తక్కువల తక్కువ పది రోజులు పడుతోంది. ఈ పది రోజులకు పరదల ఖర్చు రైతులే భరించాల్సి వస్తోంది.

80 వేలు ఖర్చయితోంది  

నాకు పాశిగామలో 15 ఎకరాల భూమి ఉంది. పంటకు రూ. 75 వేలు రైతుబంధు వస్తే  80 వేల ఖర్చు అవుతోంది. పొలంల  1,100 బస్తాల వడ్లు పండుతాయి. ఇందులో రైస్ మిల్లర్ల తరుగు పేరుతో దోపిడీ చేయడం తో బస్తకి 3 కిలోలైనా 33 కింటళ్లు పోతుంది. తరుగుతోటే  67,900 లాస్ అయితుంది. అట్లనే సర్కార్ టార్పలిన్ కవర్లు ఇవ్వకపోవడంతో అదనంగా ఖర్చు అవుతుంది. సన్నకారు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 
‑ రాజు, పాశిగాం, వెల్గటూర్, జగిత్యాల జిల్లా

పైసలు ఏ మూలకైతయి?   

సర్కారు ఇచ్చే రైతు బంధు ఏమిటికి సరి పోతలేవు. వరి కోస్తందుకు, వడ్లు పొలంల నుంచి సెంటర్ కాడికి తెచ్చేటందుకి ట్రాక్టర్ కిరాయికి, 20 రోజుల నుంచి వడ్లు ఎండబొస్తందుకు, వానకు తడిసిపోకుండా కుప్పల మీద కప్పే టాపర్​ల కిరాయి వేలల్ల అయితుంది. కాంట పెట్టేటందుకి హమాలీ చెయ్యి తడపాలే. సంచికి 2కిలోల తరుగు తీస్త రు. గిట్లుంటే రైతు బంధు పైసలు ఏ మూలకైతయి? 
‑ మదిరే కృష్ణ, రైతు, 
చిన్నగొట్టిముక్కుల, మెదక్ జిల్లా