శబరిమలలో సాధారణ పరిస్థితి.. దర్శనానికి అనుమతి

శబరిమలలో సాధారణ పరిస్థితి.. దర్శనానికి అనుమతి

పతనంథిట్ట: కిందటి రోజు కంటే వర్షాలు కాస్త తగ్గడంతో కేరళలోని శబరిమల యాత్ర సాధారణ స్థితికి చేరుకుంది. శుక్రవారం పతనంథిట్ట జిల్లాలో తెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. నీటి ప్రవాహం పెరగడంతో పంబ డ్యామ్‌‌ రెండు గేట్లు కొంత మేర ఎత్తి నీటిని కిందకు వదిలారు. వర్షాలు కొనసాగితే భక్తులకు ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో శనివారం అయ్యప్ప ఆలయ దర్శనం నిషేధిస్తూ పతనంథిట్ట జిల్లా యంత్రాంగం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా టెంపుల్​సమీప ప్రాంతంలో పెద్దగా వర్షాలు కురవకపోవడంతో శనివారం బ్యాచ్ ల వారీగా కొందరు భక్తులను దర్శనానికి అనుమతించారు. శుక్రవారం నాటి నిషేధాజ్ఞలతో నిలక్కల్‌‌లో చిక్కుకుపోయిన భక్తులను శబరిమల కొండ ఎక్కేందుకు ఈ మేరకు జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ అనుమతించారు. కాగా అధికారులు పంబానది, సంబంధిత డ్యామ్​లలో నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నీటి ప్రవాహం తీవ్రతను బట్టి, భక్తులను దర్శనానికి అనుమతించడం, నిలిపి వేయడం చేస్తున్నారు. శుక్రవారం విధించిన యాత్ర నిషేధాన్ని శనివారం 10.30 గంటలకు ఎత్తేసినట్లు ట్రావెన్ ​కోర్​ దేవస్థాన బోర్డ్​ ఆఫీసర్​ తెలిపారు. “ఈ ప్రాంతంలో వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. పుణ్యక్షేత్రాల దర్శనం సజావుగా సాగుతోంది. ఉదయం 10.30 గంటల వరకు ఆలయాన్ని మూసివేసినందున, పెద్ద ఎత్తున రద్దీ నెలకొంది. శనివారం దర్శనం కోసం దాదాపు 20 వేల మంది ఆన్​లైన్​లో బుక్ చేసుకున్నారు”అని ఆయన తెలిపారు. 

ముంపు ప్రాంతాలకు హెచ్చరిక

నీటి ప్రవాహం పెరిగితే పంబా డ్యామ్ రెండు గేట్లను పైకి ఎత్తనున్న నేపథ్యంలో నది ఒడ్డున ఉండేవారు, శబరిమల భక్తులు, సాధారణ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. డ్యామ్​ నుంచి నీటిని విడుదల చేసిన 6 గంటల తర్వాత శబరిమల యాత్రలో భాగమైన “పంబా త్రివేణి’’కి చేరుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు, కరోనా దృష్ట్యా యాత్రికులను నియంత్రించేందుకు ఈసారి కూడా భక్తులను వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు.