Sachin Tendulkar: కూరగాయలు పండిస్తున్న సచిన్

Sachin Tendulkar: కూరగాయలు పండిస్తున్న సచిన్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్..మైదానంలో తన ఆటతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఒంటి చేత్తో ఎన్నో మ్యాచులను గెలిపించి దేశ పతాకాన్ని రెపరెపలాడించాడు. వేల పరుగులు చేసి ..క్రికెట్ గాడ్గా పేరొందాడు. అయితే ఇన్నాళ్లు క్రికెటర్గా మనకు సుపరిచితమైన సచిన్..ఇప్పుడు రైతుగా మారి..తన ఇంటి పెరట్లో కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నాడు. ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తూ..స్వచ్ఛమైన, సురక్షితమైన ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

తన ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకున్న తోటలో వంకాయ, పాలకూర, బచ్చలి కూర, గుమ్మడికాయ, ముల్లంగి, క్యాప్సికం తదితర కూరగాయలను పండిస్తున్నాడు. ఈ సందర్భంగా తన ఇన్ స్టా గ్రామ్ రీల్ లో కిచెన్ గార్డెన్ టూర్ వీడియోనూ పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ముల్లంగి, పాలకూరను తెంపుతున్నట్లు చూపించాడు. అలాగే కొన్ని కుండీల్లో క్యాప్సికంను, మరో పక్కన వంకాయను సాగు చేస్తున్నట్లు చూపించాడు. పాలకూరతో పాటు..ముల్లంగిని తెంపిన సచిన్..వాటిని తమ అమ్మ కోసం వండుతానని చెప్పాడు. బయట దొరికే వాటి కన్నా తోటలో పండించిన కూరగాయలు ఫ్రెష్ గా ఉన్నాయని, అవి తిని తన కుటుంబసభ్యులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని అన్నాడు.