కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నిండు గర్భిణి, మరో మహిళ మృతి

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నిండు గర్భిణి, మరో మహిళ మృతి

ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం దగ్గర ఘోర విషాద సంఘటన జరిగింది. సాగర్ ఎడమ కాల్వలోకి టాటా ఇండికా కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు చనిపోయారు. 9 నెలల నిండు గర్భిణి, ఆమె అత్తమ్మ ప్రాణాలు కోల్పోయారు. గర్భిణి చనిపోయినా.. ఆమె కడుపులో శిశువు బతికే ఉందని తెల్సుకున్న డాక్టర్లు.. వెంటనే అంబులెన్స్ లో ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఐతే… చికిత్స కొనసాగుతుండగానే.. శిశువు ప్రాణాలు కోల్పోయింది.

మహబూబాబాద్ జిల్లా చినగూడూరు మండలం జయ్యారానికి చెందిన పోగుల మహిపాల్ రెడ్డి.. తన భార్య, 9 నెలల గర్భిణి అయిన స్వాతి(28), తల్లి ఇందిర(48)తో కలిసి కారులో ఈ ఉదయం ఖమ్మం వెళ్లారు. హాస్పిటల్ లో భార్యకు చెకప్ చేయించి.. తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గ మధ్యలో బాత్ రూమ్ కోసమని… కెనాల్ దగ్గర కారు ఆపినట్టు పోలీసులు చెప్పారు. కారును రివర్స్ తీస్తుండగా.. వెనక్కి కెనాల్ లోకి జారిపోయింది. ప్రమాదం గమనించి.. భర్త మహిపాల్ రెడ్డి కారు నుంచి దిగాడు. ఐతే.. కారు నీళ్లలో మునిగిపోయింది. కారు నుంచి బయటకు రాలేక.. ఊపిరాడక నిండు గర్భిణి స్వాతి, ఇందిర ప్రాణాలు కోల్పోయారు.

స్థానికుల సమాచారంతో.. పోలీసులు కారును బయటకు తీయించారు. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ కు మృతదేహాలను అంబులెన్స్ లో పంపించారు. ఐతే.. స్వాతి కడుపులో శిశువు బతికే ఉందని తెలిసి ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. ఐతే.. కొద్దిసేపటికే బాబు ప్రాణం విడిచాడని డాక్టర్లు చెప్పారు.