
- నిరుద్యోగుల ఆశలపై సీఎం నీళ్లు చల్లిండు
- ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత
- అఖిలపక్షం ఆధ్వర్యంలో సడక్ బంద్
- కమిషన్ చైర్మన్, సభ్యులను తొలగించాలని డిమాండ్
నెట్ వర్క్, వెలుగు : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయనుకున్న విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు అడియాసలుగానే మారాయని శనివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో సడక్ బంద్ నిర్వహించారు. జడ్చర్ల లోని 44వ నంబర్ జాతీయ రహదారిపై కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేతలు నినదించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ లక్ష ఉద్యోగాలు కల్పిస్తానని కల్లబొల్లి మాటలు చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నోటిఫికేషన్లను వేయడం మరిచిపోయారని, వేసిన కొద్దిపాటి నోటిఫికేషన్లకు కూడా నియామకాలు సరిగ్గా చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు అప్పులు చేసి తమ పిల్లలకు కోచింగ్ ఇప్పిస్తున్నారని, గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలు పరీక్షలు వాయిదా పడడంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆమె ఆత్మహత్యకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలన్నారు. అనంతరం 200 మంది అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జోగుళాంబ గద్వాల బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంసీ కేశవ్ రావు అన్నారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉండవల్లి మండలం 44వ నంబర్ జాతీయ రహదారిపై పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర సడక్ బంద్ నిర్వహించారు. గద్వాల జిల్లా అధ్యక్షుడు కేశవ్ రావు తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగించాలని, ప్రవళిక ఆత్మహత్యకు సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, తెలంగాణ జన సమితి, టీడీపీ, ప్రజా సంఘాల నాయకులు కరీంనగర్ సిటీలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సడక్ బంద్ నిర్వహించారు. ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరుద్యోగ సమస్యను తీర్చలేకపోయారని, నిరుద్యోగుల జీవితాలపై ఆయన నీళ్లు చల్లారని ఫైరయ్యారు. రాస్తారోకోలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ సమీపంలో హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద సంఖ్యలో సడక్ బంద్ చేపట్టాయి. ఆయా పార్టీల లీడర్లు మాట్లాడుతూ టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల రద్దుకు కమిషన్ బాధ్యత వహించి, ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు తలా రూ.3 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. సడక్ బంద్ నిర్వహించిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు.