సోషల్ మీడియాలో శాడిస్ట్​ ట్రోలర్స్!

సోషల్ మీడియాలో శాడిస్ట్​ ట్రోలర్స్!

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాలను పొగిడిన తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి వీడియో ఒకటి గత మార్చిలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమెపై ట్రోలర్స్ అసభ్యకరమైన కామెంట్స్ చేయడంతో మానసికంగా కుంగిపోయి గీతాంజలి రైలు కిందపడి చనిపోయింది.  ఏప్రిల్​లో చెన్నైలో ఓ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ తల్లి చేతిలోంచి చిన్నారి జారి ఫస్ట్ ఫ్లోర్ లో  రేకులపైన పడింది. ఆ పాపను అపార్ట్ మెంట్​వాసులు ఎట్టకేలకు సురక్షితంగా రక్షించారు. ఆ పాపను కాపాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ పాప తల్లిపైన ట్రోలర్స్ చేసిన నెగెటివ్ కామెంట్స్ తట్టుకోలేక  తీవ్ర మనో వేదనకు గురై ఆమె గత ఆదివారం కోయంబత్తూరులోని తన పుట్టింట్లో సూసైడ్ చేసుకుంది. నెల రోజుల కిందట యూపీలో టెన్త్ ఫలితాల్లో విద్యార్థిని ప్రాచీ నిగమ్ స్టేట్ టాపర్​గా నిలిచింది. ఆమె ఓ చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఆ విద్యార్థినికి  మీసాలు ఉన్నాయని, అబ్బాయి లెక్క ఉందంటూ నెటిజన్లు బాడీ షేమింగ్ కామెంట్లతో నీచంగా ట్రోలింగ్ చేశారు.  

గతేడాది సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న  ట్రోల్స్​పై  తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై  స్పందిస్తూ.. “  సోషల్  మీడియాలో తనపై, తన శరీర రంగుపై  బాడీ షేమింగ్‌‌‌‌ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. నాకు బట్టతల అని కొందరు ట్రోల్ చేస్తున్నారని,  వారందరిని నిప్పులా మారి కాల్చివేస్తానంటూ” ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్రోలర్స్.. అవతలివారిపై బాడీ షేమింగ్ చేయడం, వ్యక్తిగత ద్వేషం చిమ్మడం, రోత రాతలతో  వేధింపులకు గురిచేయడం, మకిలి మాటలతో వక్రబుద్ధిని చూపడం పరిపాటిగా మారింది.  ఇలా సోషల్ మీడియాలో  కొందరు నెటిజన్లు తమ శాడిజాన్ని చాటుకుంటున్నారు!  

నిజం నిలకడగా తెలిస్తే.. అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది

ఇంటర్నెట్ ప్రపంచంలో డిజిటల్‌‌‌‌ మీడియా వచ్చా క మనిషి ఏం మాట్లాడినా, ఏది చేసినా.. ఏ ఘటన అయినా నిమిషాల్లో వైరల్ అయిపోతోంది.  వాటిని చూసిన నెటిజన్ల నుంచి ఆదరణ కూడా బాగానే  ఉంటుంది. అయితే, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇంకో వైపు చూస్తే ‘ నిజం నిలకడగా తెలిస్తే.. అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది’ అనే సామెత లెక్కలా తయారైంది సోషల్ మీడియా.  రోత రాతలు, దుర్మార్గపు చేష్టలతో  ట్రోలర్స్ అవతలివారిని కామెంట్లతో కుళ్లబొడుస్తుంటారు. మానసికంగా  కుంగిపోయి,  కృశించి ఆత్మహత్యకు పాల్పడే స్థాయి దాకా ట్రోలింగ్‌‌‌‌ చేస్తుంటారు. సోషల్ మీడియా విస్తృతి రోజురోజుకు పెరిగిపోతుండగా.. మంచి ఎంత జరుగుతుందో.. చెడు కూడా అంతకంటే  ఎక్కువగానే ఉంటోంది.  డిజిటల్ మీడియాను కొందరు ఉపాధిగా మార్చుకుంటే, మరికొందరు ఎంటర్ టైన్ మెంట్​గా,  ఇంకొందరు  ట్రోలింగ్ అడ్డాగా చేసుకుంటున్నారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టడం,  బాడీ షేమింగ్​పై పదే పదే ట్రోల్స్ చేస్తుంటారు. 

 రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ దుర్వినియోగం

మన రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛను ఆర్టికల్​19(1)(ఏ) ద్వారా కల్పించింది. దీని ప్రకారం.. దేశంలోని ప్రతి పౌరుడు తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు. ప్రభుత్వాలను, అధికార, ప్రతిపక్షాలను  విమర్శించవచ్చు. అంతటి అమూల్యమైన హక్కును ట్రోలర్స్ ఒక సోషల్ మహమ్మారిగా  మార్చి వేస్తున్న పరిస్థితులు దాపురించాయి.  ఒక మనిషి అభిప్రాయాన్ని తప్పుడుగా,  వక్రభాష్యాన్ని అంటగట్టి  పదే పదే  ప్రచారం చేయడమే పరిపాటిగా మారింది.  దేశంలో పాతుకుపోయిన  పేదరికం,  అవినీతి,  సామాజిక రుగ్మతలపై పోరాటాలకు, పోరాడేవాళ్లకు మద్దతు తెలిపేందుకు ట్రోలర్లు ముందుకు రారు. కానీ మకిలి, వెకిలి చేష్టలకు అయితే ముందుండేందుకు పోటీ పడతారు.

 పెద్ద ఒత్తిడిగా మారుతోంది

టెక్నాలజీ పెరిగిపోయే కొద్దీ  పెడ ధోరణులు కూడా ఎక్కువవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఎదురయ్యే విమర్శలు, ఆరోపణలు, నెగెటివ్  కామెంట్స్ ఫేస్ చేయడం జీవితంలో పెద్ద ఒత్తిడిగా మారిపోయింది.   ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఇంటర్నెట్ లైఫ్​ని అలవాటు చేసుకున్నాం. ఫేస్​ బుక్, వాట్సాప్, ఇన్​స్టా,  ఎక్స్,  షేర్ చాట్,స్కైప్​ ఇలాంటి సోషల్ ఫ్లాట్​ఫామ్​ల్లోనే  గంటల
కొద్దీ గడుపుతున్నారు. ఎవరైనా తమ ప్రతిభను వీడియోలుగా చేసి పోస్ట్ చేసినా.. వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసినా..  ట్రోలర్స్ కాచుకుని ఉంటారు. అది మంచిదా.. చెడ్డదా అనే విచక్షణ చేయరు.  ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. బురద చల్లడమే చేస్తుంటారు. లైక్​లు, షేర్లు,  కామెంట్ల కోసం కన్నింగ్ బుద్ధి చూపుతుంటారు.

తెలియని విషయాల్లో ఇన్వాల్వ్​ కావొద్దు

ట్రోలింగ్ చేసేవాళ్ల  విషయంలో ఎంతవరకు స్పందించాలో అంతవరకు మాత్రమే పరిమితమైతే మంచిదని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. మనకు సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్‌‌‌‌ కాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. సామాజిక రుగ్మతగా మారిన ట్రోలింగ్ భూతంపై కొరడా ఝుళి పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందంటున్నారు.  కఠిన చట్టాలతో పాటు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలంటున్నార.  సోషల్ మీడియా కాస్తా  సోషల్ మాఫియాగా మారకముందే ప్రభుత్వాలు దృష్టి సారించి తగు కట్టడి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.  ‘సోషల్ మీడియా నియంత్రణకు  ప్రత్యేక చట్టాలు రూపొందించాలని మేధావులు, ప్రజాసంఘాలు చెబుతున్న మాట ఇది.! ఇక పౌర సమాజం కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించినప్పుడే భావ ప్రకటన స్వేచ్ఛ పరిఢవిల్లుతుంది. 

మంచి ఎంతో.. చెడు అంతకంటే ఎక్కువే

 కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా కారణంగా మంచి జరుగుతున్నా.. చెడు కూడా అంతకంటే  ఎక్కువగానే ఉంటోంది.  ఒక విషయం, అంశానికి సంబంధించిన అసలు వాస్తవాలు తెలుసుకోకుండానే..  ఒక  అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా బాధితులు ట్రోలింగ్​కు గురవుతుంటారు. కొందరు మంద బుద్ధులకు మంచి, చెడు, చిన్నా, పెద్దా, ఆడ, మగ.. ఇలాంటి తేడాలేవీ ఉండవు.  అదే పనిగా విషం చిమ్మడమే చేస్తుంటారు.  ఇలాంటి విష సంస్కృతి  సోషల్ మీడియాకే  సవాల్ విసిరే స్థాయికి  చేరుతోంది.  సమాజానికి పాశుపతాస్త్రంలా ఉండాల్సిన సోషల్ మీడియా..  మకిలి, వెకిలి చేష్టలు, విషం చిమ్మే కొందరు ట్రోలర్స్ కారణంగా అపనిందను మూటగట్టుకుంటున్నది. కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసి ట్రోల్స్ చేయడం శాడిజంగా మారిపోయింది.  ట్రోలర్స్ బారిన పడి ఎంతోమంది  తీవ్ర మనోవేదనకు గురై  ప్రాణాలు కోల్పోయిన ఘటనలను మనం అక్కడక్కడ చూస్తున్నాం. 

సామాజిక రుగ్మతగా ట్రోలింగ్​

సోషల్  మీడియాలో  పోస్ట్ అయ్యే.. వీడియోలు, ఫొటోల్లో  మార్ఫింగ్ చేస్తుండగా.. ఏది ఫ్యాక్ట్​.. ఏది ఫేక్​ తెలుసుకోవడం చాలా కష్టతరంగా మారిపోయింది.  ఇది ఏ ఒక్కరికో ఎదురయ్యే సమస్య కాదు. ఓ సర్వే ప్రకారం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌‌‌‌ బారిన పడినవారు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నట్టు వెల్లడైంది. ట్రోలింగ్​లు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసి.. కాపురాల్లో  చిచ్చు పెట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి.  నేర, హింసా ప్రవృత్తి వ్యాప్తిలో కూడా ట్రోలింగ్ ప్రభావం ఉంటున్నదనేది కూడా  ఆ సర్వేలో తేలిన వాస్తవ సత్యం.  సినిమా, రాజకీయాలు, కార్పొరేట్ వ్యక్తులను  బ్లాక్ మెయిల్ చేస్తూ అక్రమ దందాలు చేసే స్థాయికి కూడా ట్రోలర్స్  ఎదిగారని చెప్పొచ్చు.  సోషల్ మీడియాలో ఉండే  చాలామంది ఎదుర్కొంటున్న సమస్యనే ఇది. ట్రోలర్స్ సోషల్  క్రిమినల్స్​గానూ మారిపోయారు. ప్రస్తుతం ట్రోలింగ్  పెనుభూతంలా  మారి పట్టి పీడిస్తుండగా.. భవిష్యత్​లోనూ ట్రోలింగ్ మాఫియాగా అవతరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  

- వేల్పుల సురేష్, 
సీనియర్ జర్నలిస్ట్​