న్యూఢిల్లీ : కొత్త మోడల్ లాంచ్‌లు, ధరల తగ్గింపుల కారణంగా భారతదేశంలో జులైలో ప్యాసింజర్ వెహికల్స్(పీవీ) రిటైల్ విక్రయాలు 10 శాతం పెరిగాయని ఇండస్ట్రీ సంస్థ ఫాడా సోమవారం తెలిపింది. గత ఏడాది జులైలో 2,90,564 యూనిట్ల అమ్ముడుపోగా, ఈ ఏడాది జులైలో విక్రయాలు 3,20,129 యూనిట్లకు పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) తెలిపింది.
ఇన్వెంటరీ స్థాయిలు 67-–72 రోజుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వీటి విలువ రూ. 73,000 కోట్లకు సమానం. గత నెలలో టూ-వీలర్ రిటైల్ అమ్మకాలు 14,43,463 యూనిట్లుగా ఉన్నాయి. జులై 2023లో 12,31,930 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 17 శాతం ఎక్కువ. కమర్షియల్ వెహికల్స్ రిటైల్ విక్రయాలు 7 శాతం పెరిగాయి.