పెరిగిన పెట్రోల్​, డీజిల్​ సేల్స్

పెరిగిన పెట్రోల్​, డీజిల్​ సేల్స్

న్యూఢిల్లీ : శీతాకాలంలో కొంత డల్​గా ఉన్న పెట్రోల్, డీజిల్​ అమ్మకాలు ఫిబ్రవరి నెలలో జోరందుకున్నాయి. ఈ నెలలో పెట్రోల్​, డీజిల్​ వినియోగం రెండంకెల గ్రోత్​ సాధించినట్లు ఇండస్ట్రీ డేటా చెబుతోంది. ఫిబ్రవరి నెల మొదటి 15 రోజులలో పెట్రోల్​ అమ్మకాలు 18 శాతం పెరిగి 1.22 మిలియన్​ టన్నులకు చేరినట్లు పేర్కొంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలానికి పెట్రోల్​ వినియోగం 1.04 మిలియన్​ టన్నులు మాత్రమే. 2021 ఫిబ్రవరి మొదటి 15 రోజులతో పోలిస్తే పెట్రోల్​ అమ్మకాలు 18.3 శాతం, 2020 ఫిబ్రవరి మొదటి 15 రోజులతో పోలిస్తే 15.7 శాతం పెరిగినట్లు డేటా వెల్లడించింది. ఫిబ్రవరి 2021 నెలలో కొవిడ్​ సమస్య ఉన్న విషయం తెలిసిందే. నెలవారీగా అంటే  జనవరి 2023తో పోలిస్తే పెట్రోల్​ డిమాండ్​ 13.6 శాతం ఎక్కువైంది. జనవరి నెలలో చలి ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు 5.1 శాతం తగ్గాయి. ఇక దేశంలో ఎక్కువగా వాడే ఫ్యూయెల్​ డీజిల్​ సేల్స్​ కూడా ఫిబ్రవరి 1–15 మధ్యలో ఏకంగా 25 శాతం పెరిగాయి. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాది ఫిబ్రవరి 1–15 తో పోలిస్తే 1.5 మిలియన్​ టన్నుల నుంచి 3.3 మిలియన్​ టన్నులకు చేరాయి. డీజిల్​ వినియోగం ఫిబ్రవరి 2021 తో పోలిస్తే 16.7 శాతం, ఫిబ్రవరి 2020 తో పోలిస్తే 7 శాతం ఎక్కువైంది. జనవరి 2023 మొదటి 15 రోజులతో పోలిస్తే ఫిబ్రవరి 2023 మొదటి 15 రోజులలో డీజిల్​ అమ్మకాలు 10.3 శాతం పెరిగాయి. జనవరి నెలలో ట్రక్కుల మూవ్​మెంట్​ పెద్దగా లేకపోవడంతో డిమాండ్​ 8.6 శాతం తగ్గింది. పెట్రోల్​, డీజిల్​ అమ్మకాలు బాగా జోరందుకున్నట్లు ఈ లెక్కలు చూస్తే తెలుస్తుందని పరిశ్రమ వర్గాలు 
చెబుతున్నాయి.

ఎయిర్​ ప్యాసింజర్లు పెరిగారు..

కొవిడ్‌‌–19 ​ముందు లెవెల్స్​కు ఎయిర్​ ట్రావెల్  చేరుకుంది. ఏవియేషన్​ సెక్టార్​పై రెస్ట్రిక్షన్లు తొలగిపోవడంతో ఎయిర్​పోర్టులలో ప్రయాణీకుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో జెట్​ ఫ్యూయెల్​ (ఏటీఎఫ్​) డిమాండ్ ​ ఫిబ్రవరి మొదటి రెండు వారాలలో  43.7 శాతం ఎక్కువై 2,94,000 టన్నులకు చేరింది. ఫిబ్రవరి 2021 తో పోలిస్తే ఇది 35.6 శాతం పెరిగినట్లు. కానీ, ఫిబ్రవరి 2020 తో పోలిస్తే మాత్రం ఇంకా 12.8 శాతం తక్కువగానే ఉన్నట్లు. జనవరి 2023 లోని మొదటి రెండు వారాలతో పోలిస్తే ఫిబ్రవరి 2023 మొదటి రెండు వారాలలో ఏటీఎఫ్​ డిమాండ్​ 4.22 శాతం ఎక్కువైంది. డొమెస్టిక్​ ట్రావెల్ బాగా జోరందుకుందని, కొన్ని దేశాలలో ఇంకా రెస్ట్రిక్షన్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్​ ఎయిర్​ ట్రావెల్​ ఇంకా పుంజుకోవాల్సి ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటీవలి నెలల్లో ఇండియాలో రికవరీ మొమెంటమ్​ పెరుగుతోంది. కాకపోతే, ఇన్​ఫ్లేషన్​ కూడా ఎక్కువవుతోంది. దీని ఫలితంగా రికవరీ చురుకుదనం ఒకింత తగ్గుతోంది. కొవిడ్‌‌​ రెస్ట్రిక్షన్లు ఎత్తివేసినప్పటి నుంచీ క్రమంగా పెట్రోల్​, డీజిల్​తోపాటు ఇతర ఫ్యూయెల్స్​ డిమాండ్​ పెరుగుతూనే వస్తోంది. ఫిబ్రవరి 2022 మొదటి రెండు వారాలతో పోలిస్తే ఎల్​పీజీ అమ్మకాలు కూడా 4.1 శాతం పెరిగి 1.39 మిలియన్​ టన్నులకు చేరాయి.