సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థికి గుండెపోటు .. ఆసుపత్రిలో జాయిన్

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థికి గుండెపోటు .. ఆసుపత్రిలో జాయిన్

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి కాజల్ నిషాద్ ఆదివారం (ఏప్రిల్ 7)  అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆమెను లక్నోలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె రక్తపోటు, గుండెకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆమె భర్త సంజయ్ నిషాద్ చెప్పారు. ఏప్రిల్ 5న కాజల్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో స్టార్ హాస్పిటల్‌లో చేర్పించారు.  ఆదివారం ఆరోగ్యం విషమించడంతో డాక్టర్ ఆమెను లక్నోకు రెఫర్ చేశారు. 

 ఈ లోక్ సభ ఎన్నికల్లో  ప్రముఖ నటుడు గోరఖ్‌పూర్ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ రవి కిషన్ శుక్లాపై కాజల్ నిషాద్ (41) పోటీ చేస్తున్నారు.  లోక్‌సభ షెడ్యూల్ రిలీజ్ అయినప్పటీ నుంచి కాజల్ నిషాద్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆమె ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితికి చేరుకుంది. ఇదిలా ఉండగా కాజల్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న సమాచారం అందడంతో ఆసుపత్రిలో ఆమెను చూసేందుకు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.  

కాజల్ నిషాద్ టీవీ నటి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.2012 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై గోరఖ్‌పూర్ రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె గెలవలేదు. 2017 ఎన్నికలలో గోరఖ్‌పూర్‌లోని కాంపియర్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయగా అక్కడ కూడా ఆమె ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.  2024 లోక్‌సభ ఎన్నికలకు గోరఖ్‌పూర్ స్థానం నుండి సమాజ్‌వాదీ పార్టీ ఆమెను బరిలోకి దింపింది.