మేడారంలో మండ మెలిగే పండుగ..మహా జాతరలో తొలి అంకం ప్రారంభం

మేడారంలో మండ మెలిగే పండుగ..మహా జాతరలో తొలి అంకం ప్రారంభం

తాడ్వాయి/ములుగు, వెలుగు : మేడారం మహా జాతరలో తొలి అంకం మొదలైంది. సమ్మక్క పూజారులు మేడారంలో, సారలమ్మ పూజారులు కన్నెపల్లిలో బుధవారం మండ మెలిగే పండుగ ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 21 నుంచి నాలుగు రోజుల పాటు సమ్మక్క సారలమ్మ మహా జాతర జరగనుంది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం.. జాతరకు వారం ముందు మేడారం, కన్నెపల్లిలో మండ మెలిగే పండుగ నిర్వ హిస్తారు. ఇందులో భాగంగా మేడారంలో సమ్మక్క పూజారులైన సిద్ధబోయిన వంశీయులు, కొక్కెర వంశీయులు, వడ్డె వంశీయులు.. కన్నెపల్లిలో సారలమ్మ పూజారులైన కాక వంశీయులు మండ మెలిగే పండుగ నిర్వహించారు. 

పూజారులు బుధవారం ఇండ్లు, వాకిళ్లు అలికి పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతల గుడులను శుభ్రం చేశారు. మేడారంలో సమ్మక్క పూజారి సిద్ధబోయిన మునేందర్ ఇంటి నుంచి డోలువాయిద్యాల నడుమ పసుపు, కుంకుమ, పూలు, ఇతర పూజా సామగ్రితో పూజారులు, గ్రామ పెద్దలు, ఆడబిడ్డలు సమ్మక్క గుడికి చేరుకున్నారు. గుడిలో ధూపదీపాలు వేసే సామగ్రిని వడ్డెలు శుభ్రం చేశారు. ఆడబిడ్డలు గుడి లోపల, బయట ముగ్గులు వేశారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాలతో ఊరు మధ్యలో ఉన్న బొడ్రాయి, భూలక్ష్మి మహాలక్ష్మి విగ్ర హాల వద్దకు చేరుకొని.. 

వాటిని పవిత్ర జలాలతో అభిషేకించారు. గ్రామ శివారులోని పోచమ్మ, మైసమ్మ గుడులను శుభ్రం చేసి పూజలు చేశారు. అనంతరం గ్రామ శివారులో తూర్పు, పడమర దిక్కుల్లో ద్వారబంధనం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అమ్మవారి గద్దెలకు చేరుకుని.. ధ్వజస్తంభం దగ్గర బూరుగు కట్టెలతో ఏర్పాటు చేసిన స్తంభాలకు నులకతాడు, మామిడి తోరణాలు కట్టి, తాడుకు కోడి పిల్ల, సొరకాయ కట్టి ప్రతిబంధించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లేలా దీవించాలని అమ్మవార్లను మొక్కుకున్నారు. 

అందరినీ చల్లంగ చూడు తల్లీ అంటూ చార (కట్టు) పోశారు. కన్నెపల్లిలోనూ పూజారులు సారలమ్మ గుడిని శుభ్రం చేసి మామిడాకు తోరణాలతో అలంకరించారు. కన్నెపల్లి శివారులో బూరుగు కట్టెలతో ద్వారబంధనం ఏర్పాటు చేసి,  ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో రాత్రంతా గుడిలో జాగారం చేశారు.  

ములుగు గట్టమ్మకు ఎదురుపిల్ల పండుగ.. 

ములుగు గట్టమ్మకు ఆదివాసీ నాయకపోడ్​లు ఎదురుపిల్ల పండుగను బుధవారం వైభవంగా నిర్వహించారు. 14 లక్ష్మీదేవరలను ప్రత్యేకంగా అలంకరించి డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ములుగులోని డీఎల్ఆర్ ఫంక్షన్​హాల్​నుంచి గట్టమ్మ తల్లి ఆలయం వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ములుగు జిల్లాలోని రొయ్యూరు, సింగారం, బూర్గుపేట, చల్వాయి, పత్తపల్లి, వెంకటాపూర్, సీతారాంపురం, ఏటూరునాగారం, కమలాపూర్, వీరాపూర్, ముప్పనపల్లి, కడేకల్​తదితర గ్రామాల నుంచి నాయకపోడ్​లు లక్ష్మీదేవరలతో తరలివచ్చారు. 

నాయకపోడ్ మహిళలు ములుగు నుంచి గట్టమ్మ తల్లి ఆలయం వరకు 3 కిలోమీటర్లు కాలినడకన 70 బోనాలతో తరలివెళ్లి నైవేద్యం సమర్పించారు. ప్రధాన పూజారి కొత్త సదయ్య ఆధ్వర్యంలో పూజా సామగ్రిని వెదురుబుట్టలో తీసుకువెళ్లి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరె, సారె, గాజులు పెట్టి, ఒడిబియ్యం పోశారు. ఎదురుపిల్ల పండుగ సందర్భంగా యాటపోతుల మొక్కులు చెల్లించారు. గట్టమ్మ పక్కనే ఉన్న సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద సమీప అడవుల నుంచి తీసుకువచ్చిన కంకవనాన్ని ప్రతిష్ఠించారు.