సమ్మక్క తల్లీ.. మా ఆయన బెట్టింగ్ మానేయాలి..!

సమ్మక్క తల్లీ.. మా ఆయన బెట్టింగ్ మానేయాలి..!
  •  మేడారం హుండీల్లో బయటపడుతున్న కోర్కెల చిట్టాలు
  • మా అక్క కొడుక్కు ఐఐటీ  సీటు రావాలి
  • ఫారిన్ పోవాలి.. అనుకున్న పొల్లతో పెండ్లి కావాలి
  • కరెన్సీ పై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి 
  • చిట్టీలు రాసి హుండీల్లో వేసిన భక్తులు
  • రూ.10 కోట్లు దాటిన జాతర ఆదాయం

వరంగల్, వెలుగు: మేడారం హుండీలను తెరిచి, కానుకలను లెక్కిస్తుండగా వాటిలో భక్తుల కోర్కెల చిట్టాలు, చిట్టీలు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. ‘‘మా ఆయన బెట్టింగ్ మానేయాలి.. మా అక్క కొడుక్కు ఐఐటీలో సీటు రావాలి’’ అంటూ ఓ మహిళ కాగితంపై రాసి హుండీలో వేసింది. ‘‘ఫారిన్ పోవాలి.. అనుకున్న పొల్లతో పెండ్లి కావాలి’’ అంటూ ఓ యువకుడు సమ్మక్క తల్లిని వేడుకుంటూ చిట్టీ రాసి హుండీలో వేసిండు. 
         
ఈ కోర్కెల చిట్టీలను చూసి కౌంటింగ్ సిబ్బంది, లెక్కింపును పర్యవేక్షిస్తున్న అధికారులు ఆశ్చర్యపోతున్నారు. హనుమకొండ టీటీడీ కల్యాణ మండపంలో గురువారం నుంచి మేడారం హుండీలు లెక్కిస్తున్నారు. ప్రతి హుండీలోనూ డబ్బు, కానుకలతో పాటు ఇలాంటి చిట్టీలు బయటపడ్తున్నాయి. వీటితో పాటు అంబేద్కర్ ఫొటో ఉన్న నకిలీ వంద రూపాయల నోట్లు కనిపించాయి. వాటిపైన ‘‘ప్రభుత్వం కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి’’ అనే డిమాండ్లు రాసి ఉన్నాయి. కాగా, కోరుకున్న ఉద్యోగం రావాలని కొందరు.. తమ బిడ్డల పెండ్లిళ్లు అయ్యేలా చూడాలని  మరికొందరు.. ఫారిన్ వెళ్లే అవకాశం రావాలని ఇంకొందరు, అనుకున్న అమ్మాయితో పెండ్లి కావాలని  కొందరు.. చిట్టీలపై రాశారు.

నాలుగురోజుల్లో రూ.10 కోట్లు దాటిన ఆదాయం

మేడారం మహా జాతర హుండీల కానుకల ఆదాయం రూ.10 కోట్లు దాటింది. లెక్కింపు గతానికి భిన్నంగా జెట్ స్పీడ్‍తో సాగుతున్నది.  జాతరలో అధికారులు 535 హుండీలను ఏర్పాటు చేయగా హన్మకొండ టీటీడీ కల్యాణ మండపానికి పూర్తిగా నిండిన 518 బాక్సులు చేరాయి. గురు, శుక్రవారాల్లో 205 హుండీల ద్వారా రూ.6 కోట్ల 13 లక్షల 75 వేలు, శనివారం 112 బాక్సులతో రూ.3 కోట్ల 46 లక్షల 61 వేలు కరెన్సీ రూపంలో ఆదాయం వచ్చింది. ఆదివారం 88 హుండీలను తెరవగా.. రూ.71 లక్షల 67 వేల కరెన్సీ వచ్చింది.  

దీంతో నాలుగు రోజుల మొత్తం ఆదాయం రూ.10 కోట్ల 32 లక్షల 3వేలకు చేరింది. వచ్చిన మొత్తం ఆదాయాన్ని డిపార్ట్​మెంట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు అసిస్టెంట్‍ కమిషనర్‍ రామల సునీత, మేడారం ఈవో రాజేంద్రం తెలిపారు. తిరుగువారం కోసం ఏర్పాటు చేసిన హుండీలను సోమవారం టీటీడీకి తరలించనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.