ఇమ్మిగ్రేషన్​కు చిక్కిన పేపర్ లీక్ నిందితుడు-

ఇమ్మిగ్రేషన్​కు చిక్కిన పేపర్ లీక్ నిందితుడు-

హైదరాబాద్,వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో 16వ నిందితుడు సన ప్రశాంత్ రెడ్డిని శనివారం సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. బషీర్ బాగ్ లోని సీసీఎస్ కు తరలించారు. ఆదివారం న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రూప్‌‌1, డీఏఓ, ఏఈఈ, ఏఈ సహా మొత్తం ఆరు పేపర్స్‌‌ లీకేజీపై ఈ ఏడాది మార్చి11న బేగంబజార్‌‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

సీసీఎస్‌‌ నేతృత్వంలో సిట్‌‌టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో రెండో నిందితుడైన అట్ల రాజశేఖర్ రెడ్డికి ప్రశాంత్ బావమరిది. న్యూజిలాండ్ లో ఉంటున్న ప్రశాంత్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి గ్రూప్1 పేపర్ పంపించాడు. ఆ తర్వాత ప్రశాంత్ హైదరాబాద్ కు వచ్చి పరీక్ష రాసి వెళ్లిపోయాడు. కేసు నమోదు అయిన నాటి నుంచి ప్రశాంత్ న్యూజిలాండ్ నుంచి రాలేదు. దీంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కాడు.