న్యూఢిల్లీ: హిమోఫిలియా వ్యాధి మరియు రక్తస్రావ లోపాల గురించి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలకు సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ శ్రీకారం చుట్టారు. శనివారం ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం (World Hemophilia Day) సందర్భంగా సముద్రతీరంలో ఇసుకతో పెద్ద శిల్పంలా మలచి అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హిమోఫిలియా అనే ప్రాణాంతక జబ్బు గురించి మన దేశంలోని ప్రజల్లో సరైన అవగాహన లేదు. హిమోఫిలియా అంటే శరీరంలో రక్తస్రావం అయితే 5 లేదా 10 నిమిషాల తర్వాత గడ్డ కట్టి ఆగిపోవాలి. కానీ నిరంతరం రక్తస్రావం ఆగకుండా జరిగితే అతనికి హిమోఫిలియా వ్యాధి ఉన్నట్లు అర్థం. మన దేశంలో ప్రతి పది వేల మందిలో ఒకరికి ఈ వ్యాధి సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఈ ప్రత్యేకమైన వ్యాధి గురించి వ్యాధి గ్రస్తులకే అవగాహన లేకపోవడంతో పరిస్థితిని కట్టడి చేసే బాధ్యతను అంతర్జాతీయ బయో ఫార్మాసూటికల్ కంపెనీ ‘టేక్ ద’ స్వీకరించింది. జనంలోకి విరివిగా వెళ్లి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వ్యాధి గ్రస్తులను గుర్తించి సరైన చికిత్స చేయించుకునేలా చేసే బాధ్యతను తీసుకుంది. ఇందులో భాగంగా జనాన్ని ఆకట్టుకునే సైకత శిల్పి, శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ తో ఒప్పందం చేసుకుని ఇవాళ ఏప్రిల్ 17న ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా (WFH- World Federation of Hemophilia) ను స్థాపించిన ఫ్రాంక్ ష్నాబెల్ (Frank Schnabel) ఏప్రిల్ 17 న జన్మించాడు. ఈయన జ్ఞాపకార్థం ఈయన పుట్టినరోజైన ఏప్రిల్ 17 ను ప్రపంచ హిమోఫిలియా దినోత్సవంగా WFH ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.
