ఎకో సెన్సిటివ్​ జోన్​లోనూఇసుక తవ్వకాలు

ఎకో సెన్సిటివ్​ జోన్​లోనూఇసుక తవ్వకాలు
  • ఎకో సెన్సిటివ్​ జోన్​లోనూ ఇసుక తవ్వకాలు.
  • ఏటూరు నాగారం పరిధిలో ఎడాపెడా క్వారీలకు అనుమతిస్తున్న సర్కారు
  • గతేడాది రూ.114 కోట్ల విలువైన ఇసుక అమ్మకాలు
  • అరుదైన వృక్షాలకు, వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు
  • చోద్యం చూస్తున్న ఫారెస్ట్‌, రెవెన్యూ‌ ఆఫీసర్లు

జయశంకర్‌‌ భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు:  అరుదైన వృక్ష సంపదకు, అంతరించిపోతున్న  జీవజాతులకు నిలయంగా ఉన్న  ‘ఏటూరునాగారం ఏకో సెన్సిటివ్ జోన్‌‌’ లోనూ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఏటూరునాగారం ఏజెన్సీలో సుమారు1,200 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ఫారెస్ట్‌‌ భూభాగాన్ని పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతంగా 2015లో కేంద్రం ప్రకటించింది. ఇక్కడ పర్యావరణానికి, వన్యప్రాణులకు నష్టం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టరాదనే నిబంధనలున్నాయి. కానీ, ఇసుక మాఫియా ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి క్వారీలకు ఎడాపెడా పర్మిషన్లు ఇస్తున్నారు. నిత్యం ఎక్స్​కవేటర్లతో గోదావరిలో తవ్వకాలు చేపడ్తూ వందలాది లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్ల కోసం, రవాణా కోసం చెట్లను నరికివేయడంతో పాటు శబ్ద, వాయు కాలుష్యం వల్ల వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతోందని పర్యావరణ ప్రేమికులు మండిపడ్తున్నారు. ఇవేమీ పట్టించుకోని టీఎస్​ఎండీసీ గతేడాది ఈ ఎకోసెన్సిటివ్​ఏరియాలో 22 క్వారీల ద్వారా రూ.114 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రకటించడం, ఈ ఏడాది కూడా మరిన్ని క్వారీలకు పర్మిషన్లు ఇచ్చేందుకు రెడీ అవుతుండడంపై విమర్శలొస్తున్నాయి. 

2015లో ఏటూరునాగారం ఎకో సెన్సిటివ్‌‌ గెజిట్‌‌ 

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో విస్తరించిన ఏటూరు నాగారం అభయారణ్యం అరుదైన వృక్ష సంపద, అంతరించిపోతున్న జీవజాతులకు నిలయం. ఇక్కడ టెర్మినలియా టోమెంటోసా, అనోజిసస్  లాటిఫోలియా, బోస్వెల్లియా సెరాటా, డయోస్పైరోస్ మెలనోక్సిలాన్, స్టెర్క్యులియా యురెన్స్, మడుకా ఇండికా తదితర సుమారు 18 రకాల అరుదైన వృక్షజాతులు,  టైగర్, ఇండియన్ గౌర్, పాంథర్, చిరుత పిల్లి, కొండచిలువ, జెయింట్ స్వైరెల్, ఫ్లయింగ్ స్క్వైరల్ లాంటి మరో 20 రకాల అరుదైన వన్య ప్రాణులున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, మహా ముత్తారం, చింతకాని భూపాలపల్లి మండలాల పరిధిలోని 1,218.7 చదరపు కిలోమీటర్ల అటవీప్రాంతాన్ని ‘ఏటూరునాగారం ఏకో సెన్సిటివ్‌‌ జోన్‌‌’గా పరిగణిస్తూ ఎస్ ఓ నంబర్‌‌ 2046 (ఇ) ద్వారా గెజిట్​ఆర్డర్స్‌‌ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల పరిధిలో మొత్తం 87 పాయింట్స్ తో మ్యాప్ తయారు చేసి బౌండరీస్ ఏర్పాటు చేసింది. ఈ బౌండరీస్ నుంచి చుట్టూ పది కిలోమీటర్ల అవతలి వరకు వృక్షాలకు, జంతువులకు హాని కలిగించేలా గాలి, నీరు, నేల, వాతావరణం కలుషితం చేయరాదని స్పష్టంగా పేర్కొంది. ఫ్యాక్టరీలు నెలకొల్పడం, మైనింగ్​ చేయడం, భారీ యంత్రాలు, వాహనాలను తిరగడంపై నిషేధం విధించింది. ఏటూరునాగారం అభయారణ్యాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న  గోదావరి నదిని సైతం కేంద్ర ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ కిందికి తెచ్చింది. దీని ప్రకారం నదిలో ఎలాంటి ఇసుక తవ్వకాలు చేపట్టరాదు.

2015 నుంచి ఆరేళ్ల పాటు నో పర్మిషన్​..

ఏటూరునాగారం ఏకో సెన్సిటివ్‌‌ జోన్‌‌ ఏర్పాటు తర్వాత 2015 నుంచి 2021 వరకు ములుగు  జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు రాష్ట్ర సర్కారు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు. 2019 ఫిబ్రవరి 16కు ముందు ములుగు జిల్లా భూపాలపల్లి జిల్లాలో కలిసి ఉండడంతో అప్పటి కలెక్టర్లు ఆకునూరి మురళి, అమయ్‌‌ కుమార్‌‌, ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత పనిచేసిన కలెక్టర్లు వాసం వెంకటేశ్వర్లు, ఆర్‌‌వీ కర్ణన్‌‌, సి.నారాయణరెడ్డి ఇసుక క్వారీలకు పర్మిషన్‌‌ ఇవ్వలేదు. జిల్లా ఫారెస్ట్‌‌ ఆఫీసర్లుగా(డీఎఫ్‌‌వో) పనిచేసిన శశికిరణ్‌‌, ప్రదీప్‌‌ కుమార్‌‌ శెట్టి లాంటి ఆఫీసర్లు కూడా చాలా స్ట్రిక్ట్‌ గా రూల్స్‌‌ ఫాలో అయ్యారు. ఇసుక మాఫియా ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేశారు. కానీ ఆ తర్వాత సీన్​మారింది. ప్రభుత్వ పెద్దల అండదండలతో రంగంలోకి దిగిన ఇసుక మాఫియా 2022లో  దొడ్డిదారిన పర్మిషన్లు తెచ్చుకున్నది. పట్టా భూముల్లో ఇసుక మేటల తొలగింపు, గిరిజన సొసైటీల పేరుతో వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాలలో తవ్వకాలకు సర్కారే గ్రీన్​సిగ్నల్​ ఇస్తున్నది. గతేడాది 77 క్వారీలకు పర్మిషన్‌‌ ఇవ్వగా పర్యావరణ ప్రేమికులు, ప్రజల పోరాటాలతో 55 చోట్ల ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. 22 చోట్ల 19.35 లక్షల క్యుబిక్‌‌ మీటర్ల ఇసుక తవ్వి అమ్మగా రూ.114 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా టీఎస్‌‌ ఎండీసీ తాజాగా ప్రకటించింది.

వన్యప్రాణులకు ప్రమాద ఘంటికలు

 ఇసుక రవాణా కోసం రోడ్లు వేసే క్రమంలో అరుదైన చెట్లను నరుకుతున్నారు. సెన్సిటివ్​ ఏరియాలో జనసంచారం వల్ల జంతువుల సహజ ఆవాసాలు దెబ్బతింటున్నాయి. వాహనాల రొదతో వన్యప్రాణులు పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోతున్నాయి. జేసీబీలతో ఇసుక తవ్వకాల వల్ల గోదావరిలో  గోతులు ఏర్పడి వన్యప్రాణుల తాగునీటి వనరులు దెబ్బతింటున్నాయి. ఎండాకాలంలో నది తీరమంతా ఎడారిగా మారి, చుక్కనీరు లేక చిన్నాచితకజంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆరోపిస్తున్నాయి.  రోడ్ల వెంబడి  పెద్ద పెద్ద బొమ్మలతో వన్యప్రాణులను రక్షించాలని హోర్డింగ్‌‌లను ఏర్పాటుచేసిన ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు ఇసుక మాఫియా జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఇసుక క్వారీల వల్ల ప్రతిరోజు వందలాది ఇసుక లారీలు అడవిలో తిరుగుతున్నా, పెద్ద పెద్ద హారన్లు మోగిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మాఫియాకు సర్కారు పెద్దల అండదండలు ఉండడం, నెలానెలా మామూళ్లు ముడుతుండడం వల్లే తవ్వకాలకు, రవాణాకు అడ్డుచెప్పడంలేదనే ఆరోపణలున్నాయి.

వన్యప్రాణులను కాపాడాలె..

ఈ ప్రభుత్వానికి వన్యప్రాణుల సంరక్షణ కంటే ఇసుక అమ్మకాలే ఎక్కువయ్యాయి. ఇసుక మాఫియాకు తలొగ్గే గోదావరిలో ఇష్టారీతిగా క్వారీలకు పర్మిషన్లు ఇస్తున్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం. బాధ్యులను శిక్షించేదాకా పోరాడుతాం.

‒ గౌరారపు చంద్రశేఖర్,  ధర్మవరం గ్రామం, వాజేడు మండలం
 

విచారణ జరిపి  చర్యలు తీసుకుంటం..

వారం కిందే డీఎఫ్‌‌ఓగా చార్జి తీసుకున్నా.  ఏటూరు నాగారం ఎకో సెన్సిటివ్‌‌ జోన్‌‌ పరిధి ఎక్కడి వరకు ఉంది, ఇసుక క్వారీలకు ఎక్కడ పర్మిషన్ ​ఇస్తున్నారు అనే దానిపై క్లారిటీ లేదు. త్వరలోనే స్టడీ చేసి, విచారణ జరిపి అటవీ చట్టాలను పరిరక్షించే చర్యలు తీసుకుంటా. 
‒ రాహుల్‌‌ కిషన్‌‌,  డీఎఫ్‌‌వో, ములుగు జిల్లా.