రాత్రికి రాత్రే ఇసుక తోడేస్తున్రు

రాత్రికి రాత్రే ఇసుక తోడేస్తున్రు
  •     మాఫియాకు ఆఫీసర్లు సపోర్ట్  చేస్తున్నారనే అనుమానాలు
  •     తుంగభద్ర తీర పల్లెల్లో ఎక్కడ చూసినా ఇసుక డంపులే

గద్వాల, వెలుగు: ఇసుక మాఫియాకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. రాత్రిపూట మినీ టిప్పర్లతో ఇసుకను తోడేస్తున్నారు. మాఫియా ఇసుకను తరలిస్తుంటే అఫీషియల్ రీచ్ లకు గిరాకీ తగ్గింది. గత ఏడాది ప్రతిరోజు 400 ట్రిప్పుల బుకింగ్ లు రాగా, ఈ ఏడాది వారానికి 100 నుంచి 150 ట్రిప్పుల బుకింగ్​లు వస్తున్నాయి. తుంగభద్ర నది పరిధిలోని రీచ్‌‌‌‌ను క్లోజ్  చేశాక, రాత్రిపూట కాపలా లేకపోవడంతో ఇసుక మాఫియా అక్రమ దందా చేస్తోంది.

రాత్రి సమయాల్లో మినీ టిప్పర్లు, ఎడ్లబండ్లు, బొలేరోలు, ట్రాక్టర్లలో ఇసుకను తీసుకొచ్చి సమీప గ్రామాల్లో డంప్  చేస్తున్నారు. పొద్దున్నే అక్కడి నుంచి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. రెవెన్యూ, పోలీస్​ ఆఫీసర్లకు నెలవారీగా మామూళ్లు వెళ్తుండడంతో పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అక్కడక్కడ డంప్​లు సీజ్  చేస్తున్నా వాటిని కూడా మాయం చేస్తున్నారు.

అఫీషియల్ రీచ్ లకు గిరాకీ తగ్గింది..

జిల్లాలోని కాలేశ్వరంతో పాటు నారాయణపేట, మక్తల్  నుంచి గద్వాల జిల్లాకు ఇల్లీగల్ గా ఇసుక వస్తుంది. వీటితో పాటు రీచ్ ల వద్ద రాత్రి నిఘా లేకపోవడంతో మాఫియా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటోంది. అలంపూర్ మండలం  ర్యాలంపాడ్  రీచ్ లో 25 ట్రాక్టర్లు, తూర్పు గార్లపాడులో 35 ట్రాక్టర్లు, పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ రీచ్ లలో 100 ట్రాక్టర్లు, వేణి సోంపూర్ లో 50 ట్రాక్టర్లు అఫీషియల్ గా నడుస్తున్నాయి. వీటికి గిరాకీ లేకపోవడంతో ఇండ్ల దగ్గరే ట్రాక్టర్లు పెట్టుకుంటున్నారు.

గతంలో అన్ని రీచ్​లకు కలిపి ప్రతి రోజు 400 ట్రాక్టర్లకు గిరాకీ ఉండగా, ప్రస్తుతం అన్ని రీచ్ లలో కలిపి వారంలో 150 ట్రాక్టర్ల ఇసుక కూడా అమ్ముడుపోని పరిస్థితి నెలకొంది. వేణి సోంపూర్, రాజోలి రీచ్ లలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ఐజ మండలం కేశవరం, వేణు సోంపూర్ దగ్గర్లో ఇసుక మాఫియా ఇల్లీగల్ గా రీచ్ ను ఏర్పాటు చేసుకొని తరలిస్తోంది. తుంగభద్ర నది తీరాన అలంపూర్  మండలంలోని ర్యాలంపాడు, తూర్పు గార్లపాడు, మెన్నిపాడు, పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, వేణి సోంపురం దగ్గర అఫీషియల్ ఇసుక రీచ్ లు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఆఫీసర్లు ఉంటారు.

ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి ఇసుక ఇస్తారు. ఆ తర్వాత రీచ్ ను క్లోజ్  చేసి వెళ్లిపోతారు. అక్కడ ఎవరూ కాపలా ఉండకపోవడంతో రాత్రి 10:30 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటుందని స్థానికులు చెబుతున్నారు. గతంలో రాత్రివేళ వీఆర్ఏ, ఓ కానిస్టేబుల్  కాపలాగా ఉండేవారు. కాగా కొన్ని నెలల నుంచి ఎవరూ కాపలా ఉండడం లేదు. 10 రోజుల నుంచి ఇసుక దందా జోరందుకుంది. జేసీబీ, ప్రొక్లైనర్లు పెట్టి మరీ ఇసుక తరలిస్తున్నారు. రాజోలి, శాంతినగర్  మండలాల పరిధిలోని 10 గ్రామాల్లో ఎటు చూసినా ఇసుక డంపులే కనిపిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేస్తున్నా ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు

ప్రతి నెలా మామూళ్లు..

రాజోలి, శాంతినగర్, అలంపూర్, ర్యాలంపాడ్  మండలాల పరిధిలోని తుంగభద్ర నదిలో ఇసుకను తోడేస్తున్న బండ్లకు పోలీసులు రేట్​ ఫిక్స్  చేసినట్లు ఆరోపణలున్నాయి. మినీ టిప్పర్ కు నెలకు రూ.20 నుంచి రూ.25 వేలు, లేబర్‌‌‌‌‌‌‌‌తో ఇసుకను తరలించే ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు నెలకు రూ.10 వేలు, నదిలోకి జేసీబీ, ప్రొక్లైన్లను దింపి ఇసుకను తోడేస్తే ఒక్కో ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు ప్రతి రోజూ రూ. 6 వేలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం 20 ట్రాక్టర్లు, 10 మినీ టిప్పర్లు, వందల ఎడ్ల బండ్లు నడుస్తున్నాయి. ఈ లెక్కన పోలీసులకు ఎంత ముడుతుందో అర్థం చేసుకోవచ్చు. ట్రాక్టర్  ఇసుకను రూ. 6 వేల నుంచి 8వేలు, టిప్పర్  ఇసుక రూ. 40 వేల వరకు పలుకుతోంది.  

నిఘా పెంచుతాం..

అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు స్పెషల్  ఫోర్స్ తో నిఘా పెడతాం. ప్రస్తుతం వీఆర్ఏలు లేకపోవడంతో రాత్రి పూట కాపలా పెట్టడం లేదు. రెవెన్యూ డిపార్ట్​మెంట్  నుంచి సహకారం లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పెట్రోలింగ్  పెంచి అక్రమ ఇసుక రవాణాను అరికడతాం. 
- వెంకంటేశ్వర్లు, డీఎస్పీ, గద్వాల