అక్రమ రవాణాకు చెక్.. ఇసుక వాహనాలకు జీపీఎస్

అక్రమ రవాణాకు చెక్.. ఇసుక వాహనాలకు జీపీఎస్
  • గ్రానైట్, మట్టి, కంకర వెహికల్స్​కు కూడా
  • పోర్టల్​లో రిజిస్ట్రేషన్​కు మూడు నెలల గడువు
  • రెండేండ్ల తర్వాత రెన్యూవల్

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో ఇసుక, గ్రానైట్, మట్టి, కంకర అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నది. వీటిని ట్రాన్స్​పోర్ట్ చేసే వెహికల్స్ ఇక మీదట తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ కలిగి ఉండాలి. అంతేగాక మైనింగ్ డిపార్ట్​మెంట్ పోర్టల్ లో వెహికల్ వివరాలను మూడు నెలల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఈ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ రెండేండ్ల వరకు ఉండనుంది, ఆ తర్వాత మళ్లీ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజును రూ.2 వేలుగా నిర్ణయించారు. మూడు నెలల్లోగా www.mines.telangana.gov.in పోర్టల్​లో వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రవాణా చేసినట్లు గుర్తిస్తే అధికారులు రూ.1,000 ఫైన్ వేయడంతోపాటు వెహికల్స్​ను సీజ్ చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానంతో ఇసుక, గ్రానైట్, మట్టి, కంకర అక్రమ రవాణాకు చెక్ పడనుంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఒక లారీ నంబర్, ఒక వే బిల్లుపై నాలుగైదు లారీల్లో ఇసుక రవాణా చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం తీసుకొచ్చినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ నంబర్ తో లింకయ్యే  జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఒక ఆర్సీ నంబర్ తో నాలుగైదు లారీలను తిప్పడం ఇక కుదరదు. దీంతో అక్రమాలకు చెక్ పడనుంది.

ఇసుక, గ్రానైట్ అక్రమాలపై ఫోకస్..

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక, గ్రానైట్ అక్రమాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. కరీంనగర్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్ లను క్లోజ్ చేసింది. అలాగే కొత్త ప్రభుత్వం వచ్చాక మైనింగ్ అధికారులు రాయల్టీ, సీనరేజ్‌‌ ఎగవేతలపై కూడా ఆఫీసర్లు దృష్టి సారించారు. మరికొన్నిచోట్ల పర్మిషన్ పొందిన లీజు స్థలాల హద్దులు దాటి పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కంకర, గ్రానైట్ మైనింగ్ కు పాల్పడినట్లు పలు చోట్ల గుర్తించారు.

ఈ నెల మొదటివారంలో కరీంనగర్ జిల్లాలో హద్దులను అతిక్రమించి తవ్వకాలు జరిపి లీజు ఒప్పందాలను ఉల్లంఘించిన గ్రానైట్ క్వారీల యజమానులకు రూ.6.11 కోట్ల మేర ఫైన్ వేసిన సంగతి తెలిసిందే. అలాగే గ్రానైట్, ఇసుక ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ ను తనిఖీ చేసి ఆరు వెహికల్స్ పై కేసులు నమోదు చేసి మరో రూ.5 లక్షల పైన్ వేశారు.