రామప్ప సర్క్యూట్​ను డెవలప్ చేయాలె

రామప్ప సర్క్యూట్​ను డెవలప్ చేయాలె
  • టూరిజం సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా

హనుమకొండ సిటీ, వెలుగు: ములుగు జిల్లాలోని రామప్ప పరిసర ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల మేర టూరిజం సర్య్యూట్ ను డెవలప్ చేయాలని తెలంగాణ టూరిజం సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆఫీసర్లకు సూచించారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ కాన్ఫరెన్స్ హాల్​లో పాలంపేట స్పెషల్ డెవలప్ మెంట్ అథారిటీ సమావేశం జరిగింది. రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో  చేయాల్సిన పనులపై ప్రధానం గా సమీక్ష చేశారు. 

సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ జాకారం, దేవునిగుట్ట, బస్సాపూర్ ను కలుపుకొని సర్క్యూట్ గా డెవలప్ చేయాలన్నారు.ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య రామప్ప ఆలయం అభివృద్ధి, చేయాల్సిన పనులను వివరించారు. యునెస్కో అధికారులకు పంపాల్సిన నివేదికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. టూరిజం, ఆర్కియాలజీ, రామప్ప అభివృద్ధి కమిటీ సహకారంతో నివేదిక పంపిస్తామన్నారు. ఇన్ టాక్ కన్వీనర్ పాండురంగారావు మాట్లాడుతూ.. రామప్ప పరిసరాల అభివృద్ధి నివేదికను నవంబర్ 15 తేదీలోగా అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావు, హనుమకొండ, వరంగల్ జిల్లాల అడిషనల్ కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్, టూరిజం అధికారి శశిధర్, కుడా టౌన్ ప్లానింగ్ అధికారి అజిత్ రెడ్డి, అర్కియాలజీ అధికారులు రాములునాయక్, నాగరాజు పాల్గొన్నారు.