పంచాయతీ సెక్రటరీ సూసైడ్.. ఆఫీసర్లు సహకరించట్లేదని నోట్​

పంచాయతీ సెక్రటరీ సూసైడ్..  ఆఫీసర్లు సహకరించట్లేదని నోట్​
  • సంగారెడ్డి జిల్లా పుల్కల్ ​మండలం మిన్​పూర్​లో విషాదం
  • మిన్ పూర్ పంచాయతీ సెక్రెటరీ సూసైడ్
  • పని ఒత్తిడి, లీడర్ల వేధింపులే కారణమని నోట్ 
  • తన కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి

సంగారెడ్డి/జోగిపేట, వెలుగు: ‘అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. నేను చనిపోవడానికి ప్రధాన కారణం నా ఉద్యోగం. జాబ్ చేస్తున్నా సంతృప్తి లేదు. పై ఆఫీసర్లు సహకరించట్లేదు. లీడర్ల వేధింపులు, పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా. జీవితం చాలా ఉన్నది..  బతకాలని ఉన్నా బతకలేక చచ్చిపోతున్నా. ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. మా కుటుంబానికి తగినంత సాయం చేయండి’ అంటూ సంగారెడ్డి జిల్లా పుల్కల్​మండలం మిన్ పూర్ పంచాయతీ సెక్రెటరీ జగన్నాథ్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అందోల్ మండలం నాదులాపూర్ పంచాయతీ సెక్రెటరీగా చేస్తున్న జగన్నాథ్ ను ఆరు నెలల క్రితం మ్యూచువల్ అండర్ స్టాండింగ్ కింద మిన్ పూర్ పంచాయతీ సెక్రెటరీగా బదిలీ చేశారు. అంతకుముందు ఇక్కడ పని చేసిన సెక్రెటరీ, లోకల్ లీడర్ల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె మరో చోటికి వెళ్లడం వల్ల జగన్నాథ్ ఇక్కడికి రావాల్సి వచ్చింది. డ్యూటీలో చేరిన తొలి రోజు నుంచే జగన్నాథ్ కు లీడర్ల వేధింపులు మొదలయ్యాయి. పై ఉద్యోగుల వేధింపులు, పంచాయతీ సభ్యుల్లో కొందరు ఇబ్బంది పెట్టినా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా పని చేస్తూ వచ్చారు. సొంత డబ్బులతో పంచాయతీ బిల్లుల చెల్లింపులు కూడా చేశారు. ఆ డబ్బులు ఇప్పించాలని అధికారులు, లోకల్ లీడర్లకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు ఆరు నెలలుగా జీతాలు అందకపోవడం, ఖర్చు పెట్టిన పైసల బిల్లులు ఇవ్వకపోవడంతో బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.