సంగారెడ్డిలో ఘోరం: చెరువులో ఈతకెళ్లి 8వ తరగతి పిల్లలు మృతి

సంగారెడ్డిలో ఘోరం: చెరువులో ఈతకెళ్లి 8వ తరగతి పిల్లలు మృతి

సరదాగా చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి ముగ్గురు పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో మంగళవారం నాడు జరిగింది. గుమ్మడిదల మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సందీప్ (13), మహిపాల్ (13), సూరారం గ్రామానికి చెందిన పల్లవ్ కుమార్ (13) అన్నారం కేంద్రీయ విద్యాలయం‌‌–1లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. మంగళవారం స్కూల్‌కి సెలవు కావడంతో మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి అన్నారం కొత్త చెరువులో ఈతకు వెళ్లారు. సరదాగా చెరువులో ఈతకు దిగిన సందీప్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. దీన్ని గమనించిన మహిపాల్, పల్లవ్ కుమార్ వెంటనే స్నేహితుడిని కాపాడేందుకు చెరువులో దూకారు. కానీ ఆ ఇద్దరు కూడా మునిపోతుండడం గమనించి గట్టుపై ఉన్న మరో ముగ్గురు స్నేహితులు సాయం కోసం కేకలు వేశారు.

చెరువు దగ్గర ఆ పిల్లల కేకలు విని సమీపంలో ఉన్న గ్రామస్థులు మునిగిపోతున్న స్టూడెంట్స్‌ని కాపాడే ప్రయత్నం చేశారు. చెరువులో దూకి సందీప్, మహిపాల్, పల్లవ్ కుమార్‌ను ఒడ్డుకు తీసుకొచ్చారు. కానీ, అప్పటికే ఆ ముగ్గురు నీటిలో ఊపిరాడక మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గుమ్మడిదల పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంచిగా చదువుకుని ప్రయోజకులు అవుతారనుకున్న పిల్లలు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఆ పిల్లల మృతదేహాలు చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.